ధర.. దగా..!
● పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారుల రింగ్ ● రైతులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం ● క్వింటాలుకు రూ.5 వేలకు పడిపోయిన ధరలు
పరిగి: పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారులు చెప్పిందే ధర అన్నట్లు తయారైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా వేరుశనగ ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు రింగ్‌గా ఏర్పడి ధరలు తగ్గించేశారు. రైతులు తెచ్చిన వేరుశనగ పంటను చిన్న కుప్పగా పోసి దాని నాణ్యత ఆధారంగా పంట మొత్తానికి ధర లెక్కిస్తున్నారు. కొంత మంది రైతులకు క్వింటాలుకు రూ.6 వేలు వేసి.. మిగతా రైతులకు క్వింటాలుకు రూ.4 వేలు నుంచి రూ.5 వేల వరకు ధరలు వేసి మోసానికి పాల్పడుతున్నారు. టెండరుదారులు సిండికేట్‌గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు తెలిపారు. తాము ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే దాళారులు ఒక్కరోజు వ్యాపారం చేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
మద్దతు ధర రూ.6,700
ప్రభుత్వం క్వింటాలు వేరుశనగ పంటకు రూ.6, 700 మద్దతు ధర చెల్లించాలని ఆదేశిస్తే దళారులు, టెండర్‌దారులు కేవలం రూ.4,500 నుంచి రూ. 5వేలు ఇస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాలుకు ఏకంగా రూ. 2వేల వరకు నష్టపోతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అక్రమాలకు ఆస్కారం లేదు
మార్కెట్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదు. రైతుల ఎదుటే బీట్లు నిర్వహించి ధర నిర్ణయిస్తున్నాం. తూకం, ధరలో ఎలాంటి వ్యత్యాసం లేదు. నాణ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అది కూడా రూ.100 నుంచి రూ.200ల లోపే. ఎగుమతులను బట్టి వ్యాపారులు రేట్లు నిర్ణయిస్తున్నారు.
– విజయ్‌కిషోర్, పరిగి మార్కెట్ కమిటీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment