
ముందురోజు జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు మద్దతు
మరుసటి రోజు టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తికే టికెట్ ఇవ్వాలని నిరసన
పెందుర్తి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకుల డబుల్ గేమ్
విస్తుపోతున్న టీడీపీ కేడర్..అయోమయంలో జనసేన నేతలు
పెందుర్తి: ఇంటి పెద్ద నడవడికను బట్టి..ఆ కుటుంబంలో మిలిగిన వారి వ్యవహారశైలి ఉంటుంది. కచ్చితంగా ఇంటి పెద్ద ప్రభావం కాస్తో కూస్తో పడుతుంది. మరి అక్కడున్న పార్టీ పెద్ద వెన్నుపోటు పొడవడంలో ఘనాపాటి. ఆయన వెన్నుపోటు రాజకీయాలను అడుగడుగునా అందిపుచ్చుకున్నారు పెందుర్తి తెలుగు తమ్ముళ్లు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అనే సామెత.. ఇప్పుడు పెందుర్తిలో నీవు నేర్పిన విద్యయే ‘నారా’జాక్షగా మారింది. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తుపాట్లు ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..
పెందుర్తి తెలుగుదేశం ద్వితీయశ్రేణి నేతలు ప్లేటు ఫిరాయింపులతో జనసేన నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘పొత్తులో భాగంగా ఇరు పార్టీల పెద్దలు కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారు. జనసేన నుంచి మీకు (పంచకర్ల రమేష్‌బాబు) టికెట్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందం కలిగింది. బండారు సత్యనారాయణమూర్తి మద్దతు ఉన్నా లేకపోయినా..మేమంతా మీతోనే ఉంటాం. టీడీపీ ఓట్లన్నీ మీకే పడేలా చూస్తాం’ అని బుధవారం జనసేన నేత పంచకర్ల రమేష్‌బాబుతో పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హామీ ఇచ్చారు.
‘మా బండారు సత్యనారాయణమూర్తికి అన్యాయం జరిగింది. టీడీపీ అధిష్టానం పునరాలోచన చేయాలి. జనసేనకు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితిలోనూ పడవు. అదే టీడీపీ నుంచి అభ్యర్థి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియారిటీ బట్టి అయినా బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఇవ్వాలి. లేకపోతే మేమంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం’ గురువారం సబ్బవరం కేంద్రంగా అదే టీడీపీ నాయకుల యూటర్న్ వాఖ్యల చేయడం చర్చనీయాంశమైంది..
వెన్నుపోటు 2.0
మాట మార్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిపోయారు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారైన జనసేన నేత పంచకర్ల రమేష్‌బాబుకు టీడీపీ నాయకులు ఒక్కరోజు తిరగకముందే జలక్ ఇచ్చారు. బుధవారం పంచకర్ల నివాసంలో ఆయనను కలిసి మా సంపూర్ణ మద్దతు మీకే అంటూ నమ్మబలికి..24 గంటలు తిరగక ముందే గురువారం సాయంత్రం సబ్బవరం మండల కేంద్రంలో అదే టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ కేటాయించాలంటూ నిరసన తెలిపారు. ఈ పరిణామం చూసి ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కి పడగా..జనసేన నేతలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. టీడీపీ నాయకుల డబుల్ గేమ్‌తో పంచకర్ల అనుచరులు తలలు పట్టుకుంటున్నారు.
ఛీఛీ ఇవేం వెన్నుపోటు రాజకీయాలు
సాధారణంగా రాజకీయాల్లో రెండు పార్టీ మద్య పొత్తు కుదిరితే ఎవరికి టికెట్ వచ్చినా మిగిలిన పార్టీ వారు సహకరించడం సర్వసాధారణం. కానీ పెందుర్తి టికెట్ విషయానికి వస్తే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నుంచి పంచకర్ల రమేష్‌బాబు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పొత్తులో భాగం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమకు కేటాయించిన 21 సీట్లలో పెందుర్తిని చేర్చి కూటమి నుంచి పంచకర్ల రమేష్‌బాబుకి మాటిచ్చారు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు రమేష్‌బాబుకే టికెట్ అని జనసేన నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ మేరకు రమేష్‌బాబు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం పెందుర్తి, సబ్బవరం, పరవాడకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా పంచకర్లను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే వెన్నుపోటుకు మారుపేరైన టీడీపీ నాయకులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. బుధవారం సబ్బవరంలో పంచకర్లకు మద్దతు పలికిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులే బండారు సత్యనారాయణమూర్తికి మద్దతుగా అతనికి టికెట్ కేటాయించాలని..లేకపోతే తాము టీడీపీకి రాజీనామాలు చేస్తామని గురువారం హెచ్చరికలు జారీ చేశారు. పంచకర్లకు మద్దతుగా ఎట్టి పరిస్థితిలోనూ పనిచేయబోమని తేల్చి చెప్పారు. దీంతో జనసేన కార్యకర్తలు, నేతలు ఛీఛీ ఇవేం రాజకీయాలు..ఇదేం పొత్తు ధర్మమంటూ టీడీపీ నేతలను ఛీదరించుకుంటున్నారు.