త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

త్వరితగతిన చందనోత్సవం ఏర్పాట్లు

Published Wed, May 8 2024 5:15 AM

-

డాబాగార్డెన్స్‌: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి ఈ నెల 10న జరిగే చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ అధికారులతో తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వామి నిజరూప దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. భక్తులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు విరివిగా అందించాలన్నారు. కొండపైన, కొండ దిగువన పలు ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేసి, వాటికి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నడక, రోడ్డు మార్గాల్లో త్వరగా విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్‌ ప్రదేశాలతో పాటు స్వామి దర్శన మార్గాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. మూడు షిప్టుల్లో కార్మికులను నియమించి, ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలన్నారు. చందనోత్సవం ఏర్పాటు పనులు నిరంతరం పర్యవేక్షించేలా సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలని సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ నిర్వాహకులకు కమిషనర్‌ సూచించారు. ప్రధాన ఇంజినీరు రవికృష్ణంరాజు, అదనపు కమిషనర్లు వె.శ్రీనివాసరావు, వి.సన్యాసిరావు, పర్యవేక్షక ఇంజినీర్లు రవి, వినయ్‌కుమార్‌, శ్యాంసన్‌ రాజు, రామ్మోహనరావు, వేణుగోపాల్‌, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement