అయ్యవార్లకు పంగనామాలు!
● ప్రమోషన్లలో మున్సిపల్ టీచర్లకు మొండిచేయి ● డీఎస్సీ బూచితో పోస్టులను బ్లాక్‌లో పెట్టిన అధికారులు ● సీనియార్టీ జాబితాలపై అంతా గోప్యత ● కూటమి ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే విద్యాశాఖ నిర్ణయాలు
సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన ఎక్కడ?
ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చే సమయంలో వారి సర్వీసు రిజిస్టర్లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. గతంలో ఇలానే చేశారు. అయితే షెడ్యూల్ మేరకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ గురువారం సాయంత్రం వరకు ఫైనల్ సీనియార్టీ జాబితా ప్రకటించలేదు. ప్రొవిజనల్ జాబితాపై ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదు. ఇలా హడావుడి చేపట్టిన ప్రమోషన్ల ప్రక్రియలో పారదర్శకతపై ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ విద్య: మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలనే విద్యాశాఖ డైరక్టరేట్ నుంచి వచ్చిన షెడ్యూల్‌కు జిల్లా విద్యాశాఖాధికారులు తిలోదకాలిచ్చేశారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా, ప్రమోషన్ కోటా మేరకు అందుబాటులోని ఖాళీలను బహిర్గతం చేయుకుండా అంతా గోప్యత పాటిస్తున్నారు. ప్రమోషన్ ఎవరికి వస్తుంది? అసలు ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకునే పరిస్థితులు లేకుండా చేపడుతున్న ప్రమోషన్ల ప్రక్రియపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖపై కూటమికి చెందిన ఓ ఎమ్మెల్సీ చేస్తున్న ఆధిపత్యానికి.. ఇక్కడి అధికారులు సైతం తలొగ్గుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
జీవీఎంసీ స్కూళ్లలో ఖాళీలు ఇలా..
గ్రేటర్ మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రాబోయే డీఎస్సీకి 109 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్(ఫస్ట్ లాంగ్వేజ్)–10, స్కూల్ అసిస్టెంట్ (సెకండ్ లాంగ్వేజ్)–4, ఇంగ్లిష్–7, గణితం–2, ఫిజికల్ సైన్స్–3, బయాలజీ–10, సోషల్–6, సెకండరీ గ్రేడ్ టీచర్స్–67 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క చూపించారు. వీటిని డీఈవో కార్యాలయ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఖాళీల గోప్యతపై మర్మమేమిటో.?
మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన విద్యాశాఖ డైరక్టరేట్ నుంచి వచ్చిన షెడ్యూల్ మేరకు ఈ నెల 4న ఇద్దరు గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టుల్లో అర్హులైన వారికి డీఈవో కార్యాలయ అధికారులు ప్రమోషన్ కల్పించారు. కాగా శుక్రవారం స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. స్కూల్ అసిస్టెంట్ గణితం–1, ఫిజికల్ సైన్స్–5, సోషల్–1 తెలుగు –7 ఫిజికల్ డైరెక్టర్ –1, ఒరియా–1, పీఎస్ హెచ్‌ఎం–5 పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అయితే ఖాళీలకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం వరకు కూడా డీఈవో కార్యాలయ అధికారులు బహిర్గతం చేయలేదు. అంతా గోప్యత పాటిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీఎస్సీ కోసం ప్రమోషన్లలో కోత
జీవీఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న 109 పోస్టుల్లో ఎస్జీటీ 67 పోనూ మిగిలిన 42 పోస్టుల్లో 70 శాతం పోస్టులు ప్రమోషన్ల ద్వారా, మిగిలిన 30 శాతం డైరెక్ట్ రిక్రూట్ మెంట్(డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలన్న నిబంధన ఉంది. విద్యాశాఖనే కాదు, ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఇదే రీతిన ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇలాంటి నిర్ణయాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. బయాలజీ 10 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు వీటిలో 7 పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. కానీ ఏ ఒక్కరికీ అవకాశం లేకుండా.. పోస్టులన్నీ డీఎస్సీ కోసమని బ్లాక్ చేశారు. ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ చర్రితలో ఎప్పడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, కూటమి ప్రభుత్వంలో ఇచ్చే ప్రమోషన్లు ఇలాగే ఉంటాయా? అంటూ ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment