విశాఖ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ సిద్ధం
మహారాణిపేట: అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే.. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధమైందని, అతి త్వరలో కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సీఐఐ 4వ జోనల్‌స్థాయి సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా రోడ్ల అనుసంధానంపై దృష్టి సారించామని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎక్స్‌ప్రెస్ కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. దువ్వాడ, అచ్యుతాపురం, గంగవరం పోర్టు, ఇతర పారిశ్రామికవాడల నుంచి సులభంగా ట్రాన్స్‌పోర్ట్ జరిగేలా రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానిస్తామని తెలిపారు. లంకెలపాలెం నుంచి తగరపువలస వరకు ఉన్న ప్రధాన కూడళ్లలో పైవంతెనలు లేదా ఎక్స్‌ప్రెస్ కారిడార్లు నిర్మిస్తామని తెలిపారు. నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా చూస్తామని, 100 శాతం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టి.. జిల్లా సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడతామని, ఆ దిశగా అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ పరిశ్రమలకు సమీపంలో ఉండే ప్రజలతో పారిశ్రామికవేత్తలు సత్సంబంధాలు కొన సాగించాలని, సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. భద్రతా ప్రమాణాలను పాటించాలని, ప్రజలు, ఉద్యోగుల ప్రాణ రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. సీఐఐ ఏపీ సెక్టార్ చైర్మన్ మురళీ కృష్ణ, సీఐఐ విశాఖ జోన్ చైర్మన్ గ్రంథి రాజేశ్, ఇతర సభ్యులు పలు అంశాలపై సలహాలు, సూచనలు అందజేశారు. టెంపుల్, ట్రావెల్ టూరిజంకు అధిక ప్రాధాన్యమివ్వాలని, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేయాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి సహకారం అందించాలని కోరారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment