ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్
కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోర్సు నిర్వహణకు ఏర్పాట్లు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నూతనంగా ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోర్సును ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏయూతో అవాంటెల్ లిమిటెడ్ శుక్రవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.శశిభూషణరావు సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు, అవాంటెల్ వైస్ ప్రెసిడెంట్(టెక్నికల్) ఎన్. శ్రీనివాసరావు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ కోర్సులో 18 మందికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు రెండో సంవత్సరంలో రూ.25 వేలు స్టైఫండ్ అందిస్తామన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు రూ.9 లక్షల వార్షిక వేతనంతో అవాంటెల్ సంస్థ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకొచ్చిందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్– వీఎల్‌ఎస్‌ఐ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నూతన కోర్సులను రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు అనువైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అవాంటెల్ అడ్వైజర్ డాక్టర్ నాగరాజన్ మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ అభ్యసనానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్(టెక్నికల్) ఎన్.శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ వేణుగోపాల్ అట్లూరి, డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.భాస్కర్, జనరల్ మేనేజర్(హెచ్.ఆర్) శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment