హత్యాయత్నం కాదు.. ఆత్మహత్యాయత్నం
ఆరిలోవ: పెదగదిలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తోటగరువుకు చెందిన గవిరెడ్డి అప్పారావుపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు వార్తలు వ్యాపించాయి. దీంతో స్థానికులు, ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివీ.. గవిరెడ్డి అప్పారావుపై శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో పెదగదిలి వద్ద కొత్తగా నిర్మించిన వంతెన పక్కన దుకాణం చాటున హత్యాయత్నం జరిగినట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్‌ఐ కృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి అప్పారావు మెడపై గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకుని తనపై కత్తితో దాడి చేసి మెడపై కోశారని అప్పారావు ఎస్‌ఐకి తెలిపాడు. వెంటనే పోలీసులు అప్పారావును విమ్స్‌కు తరలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హత్యాయత్నం కేసుగా నమోదు చేశారు. అప్పారావుకు చికిత్స అనంతరం స్టేషన్‌కు తరలించి మళ్లీ ప్రశ్నించగా.. అసలు నిజం చెప్పారు. అప్పుల బాధ తట్టుకోలేక తానే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కంగుతిన్న పోలీసులు.. ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment