తాగునీటి సమస్య ఉత్పన్నం కావొద్దు | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య ఉత్పన్నం కావొద్దు

Published Tue, Apr 16 2024 1:20 AM

- - Sakshi

కొత్తకోట రూరల్‌: జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మదనాపురం మండలంలోని రామన్‌పాడు ప్రాజెక్టును కలెక్టర్‌ తేజస్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రొ. జయశంకర్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రిజర్వాయర్‌లో ఎన్ని రోజులకు సరిపడా నీటినిల్వ ఉంది.. అన్ని ఇంటెక్‌వెల్‌ల వద్ద మోటార్లు నడుస్తున్నాయా? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటి సరఫరాలో సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిస్థితులను చక్కబెట్టాలని సూచించారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయంగా బోరుమోటార్ల ద్వారా తాగునీటి సరఫరా చేయించేలా ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేశామన్నారు.

ప్రతి ఇంటికి వందశాతం తాగునీరు..

ప్రతి ఇంటికి వందశాతం తాగునీరు అందించడమే మిషన్‌ భగీరథ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ తేజస్‌ పవార్‌ కోరారు. ఎక్కడైనా సమస్య తలెత్తి ఒకరోజు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల్లో అందించాలని, నీటి ఇబ్బందులు ఉండవనే భరోసా ప్రజలకు కల్పించాలని అధికారులకు సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈసీ చెన్నారెడ్డి, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌, ఈఈ మేఘారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీఓ నాగేంద్ర, మిషన్‌ భగీరథ ఏఈలు, అధికారులు ఉన్నారు.

తాగునీటి సరఫరాపై అపోహలొద్దు..

వీపనగండ్ల: వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నారు. సోమవారం 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న రామన్‌పాడు జలాశయంలో కూడా వేసవికి సరిపడా నీటి నిల్వ ఉందన్నారు. గద్వాల, వనపర్తి జిల్లా ప్రజలకు పైపుల ద్వారా అందుతున్న నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా వెంటనే మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. జిల్లా, గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని.. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గంటగంటకు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్‌ తేజస్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సి.చెన్నారెడ్డి, ఎస్‌ఈ జగన్మోహన్‌, ఈఈ మేఘారెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఇన్‌చార్జ్‌ డీఆర్డీఓ నాగేంద్ర, జూరాల డీఈ భవాని, తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా

Advertisement
Advertisement