పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన షురూ | - | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన షురూ

Published Tue, Jan 28 2025 1:04 AM | Last Updated on Tue, Jan 28 2025 1:04 AM

పురపా

పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన షురూ

వనపర్తి టౌన్‌/అమరచింత: మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం సోమవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) సంచిత్‌ గంగ్వార్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారుల కనుసన్నల్లో మున్సిపాలిటీ పాలన పర్యవేక్షణ కొనసాగనుంది. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, వ్యాపార సముదాయాల పన్నుల వసూళ్లతో పాటు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలర్లు, చైర్మన్ల చుట్టూ తిరిగే రోజులు ఇక ఉండవని.. ఇక నేరుగా సమస్యలను మున్సిపల్‌ కమిషనర్‌కు విన్నవించే వీలుంటుందని మున్సిపల్‌ వార్డు ఆఫీసర్లు అంటున్నారు.

ఎన్నికలు నిర్వహించే వరకు..

ఇప్పటి వరకు కొనసాగిన మున్సిపల్‌ పాలకవర్గాలు 2020 జనవరి 27న ఎన్నిక కాగా.. కాలపరిమితి ఈ నెల 26వ తేదీతో ముగిసింది. అయితే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే వరకు వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచింత మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. మున్సిపాలిటీలో జరిగే పనులన్నింటిని అధికారులు పర్యవేక్షిస్తారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు.. బిల్లుల చెల్లింపు తదితర వ్యవహారాలన్నింటినీ ప్రత్యేకాధికారి అనుమతులతో మున్సిపల్‌ యంత్రాంగం నిర్వహించాల్సి ఉంటుంది.

ఇబ్బందులు తప్పవా.?

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఒకే ఒక్క ప్రత్యేకాధికారిని నియమించడం గమనార్హం. గతంలో కౌన్సిల్‌ ఎన్నికలు ఆలస్యమైన ప్రతీసారి ఒక్కో మున్సిపాలిటికీ ఒక ప్రత్యేకాధికారిని నియమించడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిగింది. ప్రస్తుతం ఐదు మున్సిపాలిటీల బాధ్యతలు ఒక్కరికే అప్పగించడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిపాలన అనుమతులు తదితర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

ప్రత్యేకతను చూస్తారు..

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మున్సిపాలిటీల స్పెషల్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు చేపడుతున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ తెలిపారు. స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో పట్టణ ప్రజలు ప్రత్యేకతను చూసేలా ముందుకు సాగుతామన్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచింత మున్సిపాలిటీల స్పెషల్‌ ఆఫీసర్‌గా సోమవారం ఆయన వనపర్తి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ఒక్కటే కాకుండా.. ట్రేడ్‌ లైసెన్స్‌, నల్లా బిల్లులు, వినోదం తదితర పన్నులను వందశాతం వసూలు చేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కమిషనర్లకు సూచించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లపై మంగళవారం వార్డు అధికారులతో సమీక్షించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్లు పూర్ణచందర్‌, పవన్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదు మున్సిపాలిటీల స్పెషల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన షురూ 1
1/1

పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement