
ముదినేపల్లి రూరల్: మణుదుర్రు వైఎస్సార్ సీపీ నాయకుడు నంగెడ్డ మునిబాబు (68) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వణుదుర్రు పంచాయతీ సర్పంచ్ పదవికి 19న ఉప ఎన్నిక జరగనుంది. దీనిపై పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)తో చర్చించేందుకు కొంతమంది పార్టీ నాయకులతో కలిసి వణుదుర్రు నుంచి కై కలూరు వెళుతున్నారు. మునిబాబుతో ద్విచక్రవాహనంపై మరో నాయకుడు ఏసుపాదం ఉన్నారు.
వీరిద్దరూ ప్రొద్దువాక సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఏసుబాబు, మునిబాబులకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే వీరిని 108 ఆంబులెన్సులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మునిబాబు మృతి చెందారు.
ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మునిబాబు మరణంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుమారుడు శేషుబాబు ఫిర్యాదు మేరకు ముదినేపల్లి ఎస్సై బి.వెంకటకుమార్ కేసు నమోదు చేసి మృతదేహానికి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. మునిబాబు మరణంపై ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండలంలోని పార్టీ నేతలు పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment