ముక్కనుమ.. లాగించేద్దామా | - | Sakshi
Sakshi News home page

ముక్కనుమ.. లాగించేద్దామా

Published Wed, Jan 17 2024 1:32 AM | Last Updated on Wed, Jan 17 2024 1:32 AM

- - Sakshi

తణుకు: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ పేరుతో నాలుగో రోజూ పండుగ జరుపుకుంటారు. సాధారణంగా భోగి, సంక్రాంతి రోజుల్లో మాంసాహారం ముట్టుకోరు. ఇక కనుమ, ముక్కనుమ రోజుల్లో ఎవరికి నచ్చిన మాంసాహారాన్ని వాళ్లు భుజిస్తారు. వాస్తవంగా కనుమ రోజు కూడా మాంసాహారాన్ని ముట్టుకోవద్దని కొంతమంది పండితులు చెబుతుంటారు. దీంతో సంక్రాంతి పండుగ ముగిసే ముక్కనుమ రోజున గ్రామదేవతలకు పసుపు, కుంకుమ ఇచ్చి పూజలు చేస్తారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాఖాహారమే భుజించాలని ఇది శాసీ్త్రయమైన సంప్రదాయం, ఆరోగ్యసూత్రమని చెబుతుంటారు.

ఆఫర్లూ ప్రకటించే అవకాశం

ముక్కనుమ రాకతో మాంసాహార ప్రియుల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా మాంసం విక్రయాలు జరగనున్నాయి. సాధారణంగా ఆదివారం, పండుగ సమయాల్లో అధిక మొత్తంలో మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే సంక్రాంతి నాలుగోరోజైన ముక్కనుమకు ఎలాంటి ఆటంకాలు లేకపోడంతో మాంసం అమ్మకాలకు వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా మాంసాహారంలో చికెన్‌ తర్వాతి స్థానంలో మటన్‌ విక్రయాలు జరుగుతుంటాయి. ఈ సారి ముక్కనుమ రోజున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 500 క్వింటాళ్ల మేర చికెన్‌, మరో 100 క్వింటాళ్లు మటన్‌ అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో చికెన్‌ ధర తగ్గి రూ.200 పలుకుతుండగా, మటన్‌ ధర రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు ముక్కనుమ రోజున మాంసాహార విక్రయాలకు కొందరు వ్యాపారులు సైతం ఆఫర్లు ప్రకటిస్తుండటం విశేషం.

నేడు మాంసాహార ప్రియులకు పసందైన రోజు

భారీగా మాంసం విక్రయాలకు అవకాశం

రెట్టింపు అమ్మకాలు

సాధారణంగా గోదావరి జిల్లాల్లో ముక్కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. ఈ సారి ముక్కనుమ రోజున ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో మాంసం విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. సాధారణంగా ఆదివారంతోపాటు ప్రత్యేక పండుగల్లో మాంసం కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం రెండు రెట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నాం.

– బండి గణేష్‌, చికెన్‌ వ్యాపారి, తణుకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement