తీరంలో భూములపై కుట్ర | - | Sakshi
Sakshi News home page

తీరంలో భూములపై కుట్ర

Published Thu, Jan 30 2025 1:28 AM | Last Updated on Thu, Jan 30 2025 1:35 AM

తీరంలో భూములపై కుట్ర

తీరంలో భూములపై కుట్ర

నరసాపురం: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్న నరసాపురం కూటమి నేతలు తీరంలో నిరుపేదల భూములపై కన్నేశారు. నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి నవరత్నాల పథకంలో గత ప్రభుత్వం నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేసింది. గతంలో అక్కడే మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుగా పెట్టుకుని పేదలకు పట్టాలుగా ఇచ్చిన 2 ఎకరాల భూమితో పాటు మరో 25 ఎకరాలు కాసేసే కుట్రకు కూటమి నేతలు బరితెరిగించారు. దీనికి పక్కా వ్యూహంతో ముందుగా తమ అనుకూల మీడియా ద్వారా మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు స్థలం మాయమైందంటూ ప్రచారంలో చేయించి.. దాని మాటున ఇప్పటికే దొంగ పట్టాలు సృష్టించి ఎకరాలు కాజేయాలని పథకం రచించారు.

ఇదీ వేములదీవి భూమి వ్యవహారం

2104లో నరసాపురం మున్సిపాలిటీ డంపింగ్‌యార్డ్‌ కోసం పట్టణానికి దూరంగా వేములదీవిలో 228/2 సర్వే నెంబర్‌లో 5 ఎకకాల స్థలాన్ని చూశారు. ఎకరం రూ.2.25 లక్షల చొప్పుల 5 ఎకరాలకు రూ.26.25 లక్షలు మున్సిపాలిటీ డిపాజిట్‌ చేసింది. అప్పట్లో రెవెన్యూ శాఖ వేములదీవిలో సదురు స్థలాన్ని కేటాయిస్తామని మున్సిపాలిటికీ తెలిపినా.. ఇదే స్థలమంటూ రికార్డు చూపలేదు. తరువాత ఆ ప్రాంతంలో డంపింగ్‌యార్డ్‌ వద్దంటూ స్థానికులు ఆందోళన చేయడంతో మున్సిపాలిటీ ప్రయత్నాన్ని విరమించుకుంది.

ఇళ్ల స్థలాల కోసం

ఇచ్చిన వైఎస్సార్‌సీపీ సర్కార్‌

228/2 సర్వే నెంబర్‌లో మొత్తం 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2 ఎకరాల భూమిని 2021లో నవరత్నాలు, పేదలకు ఇళ్ల పథకంలో ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేశారు. పేదలకు పంపిణీ చేసిన భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నేసిన కూటమి నేతలు కొన్ని రోజులుగా మున్సిపాలిటీ సొమ్ము చెల్లించి కొన్న డంపింగ్‌యార్డ్‌ స్థలం మాయమైందంటూ ప్రచారం చేయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం మారిన తరువాత మున్సిపాలిటీలో పుట్టుకొచ్చిన కొందరు అనధికార వలస కౌన్సిలర్ల సాయంతో ఎకరాల భూములు కాజేయాలని పన్నాగం పన్నుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మున్సిపాలిటీకి ఇస్తామన్న భూమితో సంబంధం లేదు

వేములదీవిలో మున్సిపాలిటీకి కేటాయిస్తామని చెప్పిన స్థలంలో పేదలకు ఇచ్చిన 2 ఎకరాల స్థలంలేదు. మున్సిపల్‌ స్థలం పేదలకు పంచారనే అంశంలో వాస్తవం లేదు. 2011లో అప్పుటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆ సర్వే నెంబరులోని స్థలంలో సోషల్‌ వెల్ఫేర్‌ బిల్డిగ్‌ నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాధించారు. 2020లో నరసాపురానికి మంజూరైన ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి కూడా అక్కడ ప్రతిపాదించారు. ఆ తర్వాత మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ కోసం ఈ ప్రాంతంలో 5 ఎకరాలు కేటాయించాలనే ఆలోచన ఉందని అధికారుల ద్వారా తెలుసుకున్న అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని మరో ప్రభుత్వ శాఖ అవసరం కోసం సొమ్ములు చెల్లించి కొనడాన్ని వ్యతిరేకించారు. డంపింగ్‌ యార్డ్‌కు మరో స్థలం అన్వేషణ చేయాలని, అక్కడున్న సర్వే నెంబరులో ఉన్న 2 ఎకరాలను పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయించారు.

సొమ్ములు చెల్లించాం

మున్సిపాలిటీకి డంపింగ్‌యార్డ్‌ కోసం రూ 26.25 లక్షలు రెవెన్యూ శాఖకు చెల్లించిన మాట వాస్తవం. సొమ్ములు చెల్లించినట్లుగా మా వద్ద రికార్డులున్నాయి. మున్సిపాలిటీకి వేములదీవి స్థలం కాగితాల మీద మాత్రమే చూపించారు. పట్టాలు ఇచ్చిన భూమి, మున్సిపాలిటీ ఇచ్చామన్న భూమి రెండూ ఒకటేనా అన్నది పూర్తిగా తెలియదు. రెవెన్యూ శాఖను సంప్రదించి వివరణ తీసుకుంటాం.

– ఎస్‌ఎస్‌వీ త్రినాథరావు,

పట్టణ ప్రణాళికా అధికారి, నరసాపురం

ఇదీ అసలు దోపిడీ తంత్రం

పేదలకు ఇచ్చిన పట్టా భూములపై కూటమి నేతల కన్ను

వేములదీవిలో భూముల దోపిడీకి యత్నం

డంపింగ్‌ యార్డ్‌ స్థలం మాయమంటూ నాటకాలు

ఈ భూములపై కన్నేసిన కూటమి నేతలు ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూమితో పాటు మిగులు భూములకు ఎప్పడో పట్టాలు ఇచ్చేసినట్టుగా దొంగ పట్టాలు సృషించారని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెందిన మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ స్థలం అడ్డంపెట్టుకుని మొత్తం కాజేయడానికి పెద్ద స్కెచ్‌ వేశారు. వైఎస్సార్‌సీపీ హయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపం అన్నట్టు, మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ స్థలం మాయం అంటూ చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే తాము ఇరకాటంలో పడతామని ఇప్పటికే ఈ వ్యవహారంలో కూటమి నేతల ఒత్తిళ్లతో నలిగిపోతున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement