రిజిస్ట్రేషన్ బాదుడు షురూ
గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: పెనుగొండ మండలం చెరుకువాడలో ఎకరం పొలం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ 29 లక్షలు కాగా క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ ఖర్చుల కింద ప్రభుత్వానికి రూ. 2,17,500 చార్జీలు చెల్లిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి భూముల విలువ పెంచడంతో ఎకరం విలువ రూ.36 లక్షలకు పెరగనుంది. ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.2.70 లక్షలు చెల్లించాలి. ఈ మేరకు కక్షిదారులపై అదనంగా రూ.52,500 భారం పడనుంది.
భీమవరం వన్‌టౌన్‌లోని మారుమూల గజం రూ.12,500 చొప్పున సెంటు స్థలం ప్రభుత్వ ధర రూ. 6.05 లక్షల వరకు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి పట్టణంలోని అన్ని కేటగిరీ భూముల విలువను 10 శాతం పెంచడంతో గజం రూ. 13,750 చొప్పున సెంటు స్థలం రూ.6.66 లక్షలకు పెరగనుంది. ప్రస్తుతం సెంటు స్థలం రిజిస్ట్రేషన్‌కు చార్జీల కింద ప్రభుత్వానికి రూ. 45,375 చెల్లిస్తుండగా ఫిబ్రవరి నుంచి ఈ మొత్తం రూ. 49,912కు పెరగనుంది. రెండు మూడు సెంట్లు కొనుగోలు చేసుకునే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై రూ.9000 నుంచి రూ. 14000 వరకు అదనపు భారం పడనుంది. పట్టణంలో పలుచోట సెంటు భూమి రూ.28.51 లక్షల నుంచి రూ.31.68 లక్షలకు పెరగనుండగా ఆ మేరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయి.
నెలకు 70 వేల రిజిస్ట్రేషన్లు
ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిన కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువ పెంచుతూ మరో బాదుడుకు సిద్ధమైంది. పట్టణ, మండల కేంద్రాల శివార్లలోని వెంచర్లు, రోడ్డు పక్క స్థలాలు లక్ష్యంగా అర్బన్, రూరల్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ విలువ 10 నుంచి 40 శాతం వరకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు భూముల విలువలు భారీగా పెరగనున్నాయి. జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాలు ఉండగా నెలకు 70 వేల వరకు రిజిస్ట్రేషన్లు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. రిజిస్ట్రార్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ చార్జీలను నిర్ణయిస్తారు. ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ, చార్జీల నిమిత్తం 7.5 శాతం, సెటిల్‌మెంట్, గిప్ట్ రిజిస్ట్రేషన్లయితే 2.5 శాతం, పార్టేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఒక శాతం, మార్ట్‌గేజ్ రిజిస్ట్రేషన్ అయితే లోన్‌పై 0.6 శాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి.
భారీగా పెరగనున్న చార్జీలు
సవరించిన ధరలు శనివారం నుంచి అమల్లోకి రాను న్నాయి. జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో 35 శాతం, రూరల్‌లో 40 శాతం వరకు భూముల విలువలు పెరుగుతున్నాయి. అధిక శాతం పట్టణ ప్రాంతాల్లో 20 శాతానికి పైగా, అధిక శాతం మండలాల్లో 30 శాతానికి పైగా పెరిగాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరుగుతాయని వివిధ వర్గాలు అంటున్నారు. తాజా పెంపుతో భీమవరం, తాడేపల్లిగూడెం తదితర కొన్ని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ ధర ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూమి విలువ పెంపు శాతం
సబ్ రిజిస్ట్రార్ అర్బన్ రూరల్
కార్యాలయం ఏరియా ఏరియా
(శాతం) (శాతం)
తాడేపల్లిగూడెం 10–20 10–20
అత్తిలి 5–35 5–35
ఆచంట 10–20 10–30
ఆకివీడు 10–35 15–35
భీమవరం 10 10
మొగల్తూరు 11–25 10–40
నర్సాపురం 10 20
పాలకొల్లు 5–35 5–35
పెనుగొండ 20–30 20–30
పెంటపాడు 11–33 8–33
తణుకు 4–25 4–25
ఉండి 11–20 11–36
వీరవాసరం 10–25 5–33
గునుపూడి 5–25 10–30
సజ్జాపురం 7–20 9–39
ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలకు రెక్కలు
అర్బన్, రూరల్ ఏరియాల్లో 10 నుంచి 40 శాతం వరకు పెంపు
ఇప్పటికే పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం
తాజా పెంపుతో పతనమేనంటున్న వ్యాపార వర్గాలు
‘రియల్’గా పతనమే
దాదాపు ఏడాదికాలంగా సరిగా అమ్మకాలు లేక రియల్ ఎస్టేట్ రంగం నిరాశజనకంగా ఉంది. సైట్లు అమ్ముడుపోక అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బిడ్డల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా కొనే వారు లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నెలకు ఒక్క ప్లాటు అయినా విక్రయించే వారు గత కొన్ని నెలలుగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి ఉంది. ఇప్పుడే అంతంతమాత్రంగా ఉంటే రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న ఆందోళనలో ఆయా వర్గాల వారు ఉన్నారు. పెంచిన చార్జీలు తగ్గించాలని కోరుతూ భీమవరం చాబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment