ఎన్నికల కమిషన్‌.. చంద్రబాబు జేబు సంస్థా..? | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌.. చంద్రబాబు జేబు సంస్థా..?

Published Wed, May 8 2024 4:35 AM

ఎన్నికల కమిషన్‌.. చంద్రబాబు జేబు సంస్థా..?

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
ఇది రాజ్యాంగ విరుద్ధం

తాడేపల్లిగూడెం: స్వత్రంత్ర ప్రతిపత్తి కలిగి ఎన్నికలలో అవాంఛనీయ చర్యలను నియంత్రించాల్సిన ఎన్నికల కమిషన్‌.. ప్రజలు సిగ్గుపడేలా, హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ అంటే చంద్రబాబు జేబు సంస్థా అనే విధంగా చర్యలున్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌ వ్యవసాయ ఇన్‌పుట్‌ సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, రైతులకు విత్తనాల సరఫరా వంటి వాటిని అమలు చేయకుండా ఉండటం వివిధ వర్గాలకు నష్టం కలిగించే చర్య అని అన్నారు. తెలంగాణలో అడ్డం రాని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వస్తున్నాయన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయకుంటే వారు నారుమళ్లు ఎలా వేసుకుంటారు.. ఇదేమి ఎన్నికల హామీ కాదు కదా అని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం బాబుకు ఇష్టం ఉండదని కొట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా, చంద్రబాబు స్వామ్యమా అని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు వదిన పురందేశ్వరి చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్సడా వైస్‌చైర్మన్‌ వడ్డి రఘురాం పాల్గొన్నారు.

జగన్‌ గెలుపును ఆపలేరు

ఎన్నికల కమిషన్‌ తదితర వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూసినా, ఎవ్వరూ ఎన్నిరకాలుగా కుట్రలు పన్నినా జగన్‌ గెలుపును ఆపలేరని గూడూరి ఉమాబాల అన్నారు. కూటమి పార్టీలు ప్రజలకు చెడు చేస్తూ జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

ఈసీది పక్షపాత వైఖరి

కొయ్యలగూడెం: ఎలక్షన్‌ కమిషన్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పక్షపాత వైఖరి అవలంభిస్తుందని వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఆర్‌కే హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో తెలంగాణలో అనుమతించిన ఈసీ ఆంధ్రప్రదేశ్‌లో అనుమతించకపోవడం అన్యాయం అన్నారు. 2019వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ రోజు ముందు వరకు పసుపు కుంకుమ పథకం పేరిట పదివేల రూపాయలు జమ చేయడం జరిగిందని. ఇప్పుడు రైతులను ఆదుకునే విషయంలో ఈసీ అడ్డుపడుతోందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన సొమ్ములు కూడా జమ కాకపోవడంతో తల్లిదండ్రులు వేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులను ఎలక్షన్‌ కమిషన్‌ బదిలీ చేస్తున్న ప్రక్రియ అనుమానాలకు తావిస్తోందని, ఈసీ వెనుక ఎవరు ఉన్నారనేది ప్రజలందరికీ అర్థమవుతోందని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఆంక్షలు విధిస్తున్న ఈసీ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారని ఈ విషయంలో రాష్ట్రపతి కలగచేసుకొని రైతులకు విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement