సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ పొత్తులు సమీకరణలతో అధిష్టానం తల బద్దలు కొట్టుకుంటుంటే, టికెట్ ఇస్తారో లేదో తెలియడం లేదు, ఎంతకాలం నాన్చుడు ధోరణి అని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నారు. దీంతో టికెట్ ఆశావహుల్లో హైటెన్షన్ నెలకొంది. ప్రతి రోజు బీపీ చెక్ చేసుకుంటున్నామని, ఎంతమంది తమలాగా ఇబ్బంది పడుతున్నారో అర్థం కావడం లేదని ఓ మాజీ ఎమ్మెల్యే రాయచోటిలో బాహాటంగా వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నెలకొంది.
వైఎస్సార్‌సీపీకి ప్రజాబలం గణనీయంగా ఉన్న నేపథ్యంలో సింగిల్‌గా ఢీకొట్టలేమని భావించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా కడప, ప్రొద్దుటూరులో అభ్యర్థులు ఆర్ మాధవీరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. మాధవీరెడ్డికి టికెట్ వచ్చే పరిస్థితి లేదని కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబం ఇప్పటికీ బలంగా విశ్వసిస్తోంది. నారా లోకేష్ నుంచి అభయం వచ్చిన తర్వాతే తాము టీడీపీ కోసం విశేషంగా గ్రౌండ్ వర్క్ చేశామని పార్టీ టికెట్ తమదే అంటూ ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి వర్గీయులు అంటున్నారు.
కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుగుదేశం పార్టీ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి. ఈనేపథ్యంలో రాయచోటిలో రమేష్‌రెడ్డికి టికెట్ దక్కితే, కడపలో మాధవీరెడ్డికి లభించదనే ధీమాతో ఉమాదేవి కుటుంబం ఉంది. అలాగే మాధవీరెడ్డికి టికెట్ ఖరారైతే, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌రెడ్డికి దక్కే అవకాశం లేదనే భావన అక్కడి ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతల్లో టెన్షన్ కొనసాగుతోంది.
కమలాపురంలో పుత్తా తనయుడు
వరుసగా ఓటమి చెందిన నేతలకు టికెట్ ఇచ్చేది లేదని ఇదివరకు నారా లోకేష్ ప్రకటించారు. ఈనేపథ్యంలో కమలాపురం నుంచి వరసగా నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయినా పుత్తా నరసింహారెడ్డికి టికెట్ దక్కే అవకాశం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పుత్తా తనయుడు చైతన్యరెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఎలాగైనా సరే తమ కుటుంబమే పోటీలో ఉంటుందని సన్నిహితులతో పుత్తా నరసింహారెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా అందుకు బలం చేకూరుస్తోంది. మొన్నటి వరకు పుత్తా ప్రచారంలో ఉన్నా తాజాగా చైతన్యరెడ్డి పేరు తెరపైకి రావడం విశేషం. అలాంటి పరిస్థితి ప్రొద్దుటూరులో కూడా కన్పిస్తోంది. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిగా కుటుంబ సమేతంగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తీవ్రస్థాయిలో వరదకు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. అయినప్పటీకీ వరద పేరు ఖరారైందని.. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యుడి బంధువులు, సన్నిహితులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
రాజంపేటలో జనసేన బ్రేక్‌లు
రాజంపేట టీడీపీ టికెట్ కోసం ముగ్గురు ఆశావహులున్నారు. వీరందరిలో జనసేన పొత్తు కారణంగా టికెట్ దక్కదనే అభద్రతాభావం ఏర్పడింది. రాజంపేట టికెట్ జనసేన కోరుతున్న నేపథ్యంలో టీడీపీ ఆశావహులు బేల మొహం పెడుతున్నారు. ఇప్పటి వరకు తనకే పార్లమెంటు టికెట్ అనే భావనతో ఉన్న సుగవాసీ బాలసుబ్రమణ్యంలో కూడా అంతర్గతంగా ఆవేదన ఉన్నట్లు సమాచారం. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే, రాజంపేట పార్లమెంటు బీజేపీ కోరే అవకాశం లేకపోలేదనే సందిగ్ధత ఆయనలో ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుతమ్ముళ్లలో రోజు రోజుకు బీపీ పెరిగిపోతుంది. అదే విషయాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఒకరు రాయచోటిలో అనుచరవర్గంతో బాహాటంగా చెప్పుకు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment