ఇన్‌చార్జి బాధ్యతల తొలగింపు
కడప కార్పొరేషన్: వార్డు సచివాలయాల సెక్రటరీలకు ఇచ్చిన ఇన్‌చార్జి బాధ్యతలు తొలగిస్తూ నగరపాలక స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ సురేష్‌బాబు అధ్యక్షతన ఆయన చాంబర్‌లో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కమిషనర్ ప్రవీణ్‌చంద్ ఉన్నప్పుడు ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్ సెక్రటరీలకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా, ఎమినిటీస్ సెక్రటరీలకు ఏఈలుగా, టౌన్‌ప్లానింగ్ సెక్రటరీలకు టీపీబీఓ లుగా, అడ్మిన్ సెక్రటరీలకు ఆర్‌ఐలుగా ఇన్‌చార్జిలు గా వేసి సీనియర్లకు మొండిచేయి చూపారు. అలాగే కంట్రోల్ రూములో 11 మంది సెక్రటరీలను నియమించి 100 సచివాలయాల సెక్రటరీలను వారి పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ 30 మంది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిపై విమర్శలు వెల్లువెత్తడంతో స్టాండింగ్ కమిటీ వారిని ఇదివరకు పనిచేసిన స్థానాలకు పంపాలని నిర్ణయించారు. ఆ కమిషనర్ ఉన్నప్పుడే 20మంది వలంటీర్లతో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం ఏర్పా టు చేశారు. పన్నుల వసూళ్లు, ప్లాస్టిక్ నిషేధం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి వాటికి వారిని వినియోగిస్తున్నట్లు చెప్పి వారికి రూ.5వేలుగా ఇస్తున్న జీతాన్ని రూ.12వేలకు పెంచారు. ప్రస్తుతం సరిపడినంతమంది సెక్రటరీలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వీరి అవసరం లేదని భావించి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
● నగరంలో పార్కులు, సెంట్రల్ మీడియన్లు, సర్కిళ్లు, అవెన్యూ ప్లాంటేషన్, ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయుటకు హార్టికల్చర్ విభాగంలో 12 మంది అదనపు వర్కర్లు తీసుకునే అంశంపై కార్పొరేటర్లు, అధికారులతో కమిటీ వేయాలని తీర్మాణించారు.
● కడప నగరంలో వీధి కుక్కల బెడద నివారణకు, కుక్క కాటు బారిన పడిన వారికి రేబిస్ వ్యాధి రాకుండా వీధి కుక్కల జనన నియంత్రణ నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు.
● నగరపాలక సంస్థలో వివిధ స్కీముల ద్వారా జరిగే అభివృద్ధి పనులను తనిఖీ చేసి క్వాలిటీ సర్టిఫికెట్ జారీ చేసే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ స్పెక్ట్రమ్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, హైదరాబాద్ వారి సేవలు మరో రెండు నెలలు పొడిగించాలని తీర్మాణించారు.
● నగరపాలక పరిధిలో చికెన్ మాంసపు దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను తరలించడానికి వేలం పాటలో కాంట్రాక్టు పొందిన బీడీ రాజు అనే వ్యక్తిచేత రూ.10లక్షల సొమ్ము కట్టించుకున్న తర్వాత మూడు నెలల అదనపు గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
● రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసిన నేపథ్యంలో చెత్త పన్ను ఎవరూ చెల్లించడం లేదు. దీంతో కార్పొరేషన్‌పై ఆర్థిక భారం పడే అవకాశముందని, ప్రస్తుతం తిరిగే క్లాప్ వాహనాలకు మాత్రమే అదనపు వర్కర్లను వినియోగించాలని, మిగిలిన వారిని కొనసాగించరాదని తీర్మాణించారు.
ప్రొటోకాల్ పాటించకపోవడంపై మేయర్ ఆగ్రహం
ఇటీవల ఎర్రముక్కపల్లెలోని గాంధీ ప్లాజా ప్రారంభోత్సవంలో మేయర్, కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకపోవడంపై మేయర్ సురేష్ బాబు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర, స్థానిక వార్డు ఎమినిటీస్ సెక్రటరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఆహ్వానించకుండా, తమ పేర్లు శిలాఫలకంలో రాయకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించిన మీపై తగిన చర్యలు తీసుకుంటామని, న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు. ఐఈసీ టీంను రద్దు చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలుపగా...ఆ టీం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసి జరిమానాల రూపంలో రూ.25లక్షలు వసూలు చేసిందని ఏడీసీ రాకేష్ చంద్ర చెప్పగా...మరోసారి మేయర్ ఆగ్రహించారు. తాము ఇంకా ఎక్కువ వసూలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ వైఓ నందన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు లక్ష్మిదేవి, సుజాత, గౌస్ జబీన్, కె. అరుణప్రభ, ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి, ఏసీపీలు నాగేంద్ర, మునిరత్నం, ఈఈలు నారాయణస్వామి, ధనలక్ష్మి, ఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం రద్దు
నగరపాలక స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు
Comments
Please login to add a commentAdd a comment