కడప కోటిరెడ్డిసర్కిల్ : మహా కుంభ మేళాకు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో నుంచి ప్రత్యేక సర్వీసును నడపనున్నామని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. ఏడు రోజులపాటు కొనసాగే ప్రత్యేక వీడియో కోచ్ (2+2 పుష్ బ్యాక్ సూపర్ లగ్జరీ) బస్సు ఫిబ్రవరి 2వ తేది ఉదయం 8.00 గంటలకు బయలుదేరి నాగపూర్, జబలాపూర్, రేవా, ప్రయాగ రాజ్, వారణాసి మీదుగా అయోధ్యకు వెళుతుందని పేర్కొన్నారు. తిరుగుప్రయాణంలో 5వ తేదీ బయలుదేరి 8వ తేది కడపకు చేరుతుందని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుకు ఆన్లైన్ లేదా బస్టాండులోని కౌంటర్లో తమ టిక్కెట్ రిజర్వుచేసుకోవచ్చన్నారు. రాను, పోను టిక్కెట్ రూ. 10,000గా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఐటీఐలో రెండేళ్ల కోర్సుల్లో 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లో 2వ సంవత్సరంలో బ్రడ్జి కోర్సు లో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు చేసు కోవాలని మైనార్టీ గవర్నమెంట్ ఐటీఐ కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు స్టేట్ టెక్నిక్ బోర్డు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాసేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమకు దగ్గరలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల వద్దకు వెళ్లి సంప్రదించి వివరాలు నమోదు చేసుకుని త్వరలో ప్రారంభం కానున్న తరగతులకు హాజరుకావచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు.
నేడు గండిలో
తలనీలాల టెండర్లు
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఏడాది కాలం పాటు భక్తులు మొక్కుబడి కింద చెల్లించుకున్న తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల కోసం గురువారం ఇ–టెండరు,షీల్డు టెండరు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. టెండర్లు స్థానిక కార్యాలయంలో ఉదయం 10–30 గంటల నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. టెండర్లలో పాల్గొనే వారు తలనీలాలకు సంబంధించి రూ.25 లక్షలు,కొబ్బరి చిప్పలకు సంబంధించి రూ.3లక్షలు డిపాజిట్టు చెల్లించాలని చెప్పారు. దేవదాయ శాఖ నియమ నిబంధనల మేరకు నిర్వహించే టెండర్లకు ఆసక్తి గలవారు డిపాజిట్లు చెల్లించి పాల్గొనాలని సూచించారు.
31లోపు టీఐఎస్‌లో మార్పులు చేసుకోండి
– డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపల్, నగరపాలక సంస్థ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను తమ వ్యక్తిగత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఐఎస్) లాగిన్‌లో ఏవైనా మార్పులు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించా మని డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపల్, నగరపాలక ఉపాధ్యాయులందరు తమ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాగిన్‌లో సరి చూసుకుని ఏవైనా మార్పులు ఉంటే సరి చేసుకోవాలని తెలిపారు. వీటి ఆధారంగానే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని డీఈఓ షంషుద్దీన్ తెలిపారు.
సోమశిల జలాల్లోకి
చేప పిల్లల విడుదల
నందలూరు : మండలంలోని కోనాపురం సోమశిల వెనుక జలాల్లోకి 19 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. మదన మోహనపురం గ్రామ సర్పంచ్ చుక్క నిర్మల, చుక్కా యానాది, ఉప సర్పంచ్ పుల్లయ్య చేతుల మీదుగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మత్స్య క్షేత్రాల నుంచి ఈ చేప పిల్లలను సేకరించారు.
అతిథి గృహాల పనుల పరిశీలన
బి.కొత్తకోట : మండలంలోని హార్సిలీహిల్స్‌పై టూరిజం యూనిట్లో అతిథి గృహాల ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు స్వయంగా పర్యవేక్షణకు సిద్ధమయ్యారు. సోమ, మంగళవారాలు టూరిజం ఈఈ సుబ్రమణ్యంరాజు హార్సిలీహిల్స్పైనే ఉండి పనులు పర్యవేక్షించారు. సత్వరమే పూర్తి చేసి గదులను టూరిజంకు అప్పగించాలని కాంట్రాక్టర్‌ను కోరారు. వారంలోగా కొన్నింటిని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మళ్లీ పనులపై పర్యవేక్షించి గదులు అప్పగించేందుకు ఇక్కడికి రానున్నారు. నెలలోగా ఆధునికీకరణ పనులన్నీ పూర్తి చేయించాక, అంతటితో మిగిలిన పనులు నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment