ఓ ఇడ్లీ బండి వ్యక్తి టాయిలెట్ వాటర్‌తో చట్నీ తయారు చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన వీధి బండ్ల ఆహార నాణ్యతపై చర్చకు దారితీసింది. ముంబైలోని బొరివెలి రైల్వేస్టేషన్ సమీప వీధిలో ఇడ్లీలు అమ్ముకునే సదరు వ్యక్తి.. ఆ రైల్వేస్టేషన్ టాయిలెట్‌లో తెచ్చిన వాటర్‌తో చట్నీని తయారు చేశాడు. ఇదంతా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. 45 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం ప్రస్తావించలేదు.
ఇక ఈ వీడియోపై ఆహార భద్రతా(ఎఫ్‌డీఏ) అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రజలంతా కలుషిత నీటితో తయారు చేసే ఆహారపదార్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఆ వీడియో మా దృష్టికి రావడం జరిగింది. ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. కలుషిత నీటిని ఉపయోగించే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ నీరు ఆరోగ్యానికి మంచివి కావు. సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్‌ను తనిఖీ చేస్తాం, ఎలాంటి సాంపిల్ దొరికినా సీజ్ చేస్తాం’అని ముంబై ఎఫ్‌డీఏ అధికారి శైలేష్ అదావ్ మీడియాకు తెలిపారు.