indian council of medical research
-
ఇండియాలో క్యాన్సర్ విస్ఫోటం
దేశంలో క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా క్యాన్సర్ బారినపడుతున్నట్లు తెలియజేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని హెచ్చరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ–2022 అంచనాల ఆధారంగా గణాంకాలు రూపొందించారు. ఇందుకోసం 36 రకాల క్యాన్సర్లు, నాలుగు రకాల వయసు గ్రూప్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. → క్యాన్సర్ సంబంధిత మరణాల్లో చైనాది మొదటిస్థానం కాగా ఇండియాది రెండోస్థానం. → ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు. → పురుషులు, మహిళల్లో లంగ్ క్యాన్సర్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. → భారత్‌లో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు తక్కువగా కనిపిస్తోంది. → యువతీ యువకుల కంటే వృద్ధులకు క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉంది. → ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుంది. తద్వారా క్యాన్సర్ రేటు సైతం పెరగనుంది. → మధ్య వయసు్కలు, వృద్ధులతో పోలిస్తే చిన్నారులు, యువతకు క్యాన్సర్ ముప్పు అంతగా లేదు. → మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలు ప్రతిఏటా 1.2 శాతం నుంచి 4.4 శాతం పెరుగుతున్నాయి. పురుషుల్లో ఇది 1.2 శాతం నుంచి 2.4 శాతంగా ఉంది. → 2022 నుంచి 2050 వరకు క్యాన్సర్ సంబంధిత మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. → దేశంలో 2012 నుంచి 2022 వరకు క్యాన్సర్ కేసులు 36 శాతం పెరిగాయి. 2012లో 10.1 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 13.8 లక్షల కేసులు నమోదయ్యాయి. → అదే సమయంలో క్యాన్సర్ సంబంధిత మరణాలు 30.3 శాతం పెరిగాయి. 2021లో 6.8 లక్షల మంది, 2022లో 8.9 లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతిచెందారు. → క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఏకంగా 70% మంది మధ్య వయస్కులు, వృద్ధులే ఉంటున్నారు. → క్యాన్సర్ నియంత్రణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోందని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్‌కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్‌లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్‌లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్‌పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్‌ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్‌లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్‌లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్‌కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్‌లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సమోసా, చిప్స్ తింటున్నారా!
సమోసా.. పకోడీ.. ఫ్రైడ్ చికెన్.. చిప్స్.. బిస్కెట్లు.. కేక్స్.. రెడీమేడ్ మీల్స్.. మయోనైజ్, గ్రిల్డ్ చికెన్.. డ్రై నట్స్.. వేయించిన వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు డయాబెటిస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధనలో వెల్లడైంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల నిర్వహించిన పరిశోధనలో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూశాయి. మరోవైపు కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన తాజా క్లినికల్ ట్రయల్ రన్‌లోనూ మధుమేహం ముప్పునకు పైన పేర్కొన్న ఆహార పదార్థాలే కారణమని స్పష్టమైంది. – సాక్షి, అమరావతిఏజీఈ అధికంగా ఉండటం వల్లే..సమోసా, పకోడీ, ఫ్రైడ్ చికెన్, చిప్స్, నూడిల్స్, సూప్‌లు, ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలను పిల్లల నుంచి పెద్దలు ఇష్టంగా తింటున్నారు. ఈ తరహా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) దేశంలో మధుమేహం ముప్పును రోజురోజుకూ పెంచుతోంది. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానికి ఉండటానికి హానికరమైన ఆహారపు అలవాట్లే కారణమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10.10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలు రక్తంలో చక్కెరను పెంచుతున్నాయని తేలింది.అధునాతన గ్లైకేషన్ ముగింపు ఉత్పత్తులు (ఏజీఈ) హానికరమైన సమ్మేళనాలు. గ్లైకేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రోటీన్లు లేదా కొవ్వులు చక్కెరలతో సంకర్షణ చెందుతున్నప్పుడు మధుమేహం ఏర్పడుతుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని వేయించినప్పుడు లేదా కాల్చినప్పుడు, అందులో ఏజీఈలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం ఊబకాయాన్ని పెంచుతోందని.. ఇది మధుమేహానికి ప్రధాన కారణమవుతోందని వెల్లడైంది. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురించబడింది.ఆయుర్దాయంపై ప్రభావం టైప్–2 డయాబెటిస్ మనిషి ఆయుర్దాయంపైనా ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ వర్గానికి చెందిన 19 దేశాల్లో 15 లక్షల మంది జనాభా ఆరోగ్య రికార్డులపై అధ్యయనానికి సంబంధించిన అంశాలను ఇటీవల ది లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీలో ప్రచురించారు. 30 ఏళ్లలో టైప్–2 బారినపడిన వ్యక్తి సగటు ఆయుర్దాయం 14 ఏళ్లు క్షీణిస్తుందని, 40 ఏళ్ల వయసులో సమస్య తలెత్తితే పదేళ్లు, 50 ఏళ్లకు కనిష్టంగా ఆరేళ్ల చొప్పున ఆయుర్దాయం తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.38 మందిపై.. 12 వారాల పరీక్ష పరిశోధన నిమిత్తం ఎంపిక చేసిన 38 మందిపై 12 వారాలపాటు పరీక్షలు నిర్వహించారు. మధుమేహం లేనివారిని రెండు సమూహాలుగా విభజించారు. 12 వారాల పాటు ఒక సమూహానికి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్డ్స్ (ఏజీఈ) తక్కువగా ఉండే ఆహారం, మరో సమూహానికి ఏజీఈ అధికంగా ఉండే ఆహారాన్ని అందించారు. 12 వారాల అనంతరం పరిశీలిస్తే అధిక ఏజీఈ ఆహారం తిన్న సమూహంతో పోలిస్తే తక్కువ ఏజీఈ ఆహారం తిన్న సమూహంలోని వ్యక్తుల్లో టైప్–2 మధుమేహం ముప్పు తక్కువగా ఉందని గుర్తించారు. వీరిలో ఇన్సులిన్ నిరోధకతæ గణనీయంగా పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. కేకులు, కుక్కీలు వంటి కాల్చిన ఆహారాల్లో ఏజీఈలు ఎక్కువగా ఉంటాయి.చిప్స్, సమోసాలు, పకోడీలు, వేయించిన చికెన్ వంటి వాటిలో పెద్ద పరిమాణంలో ఏజీఈ ఉంటోంది. అలాగే రెడీమేడ్ ఆహార పదార్థాల రూపంలో వచ్చే వనస్పతి, మయోనైస్ కూడా చక్కెరను పెంచుతాయి. కాల్చిన మాంసాలు, కాల్చిన గింజలలో ఏజీఈలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ స్థానంలో తక్కువ ఏజీఈ డైట్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఏమిటీ అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్ఫ్రై, రోస్ట్ (బాగా వేడి) చేసిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్) ఆహారాన్ని తిన్నప్పుడు కార్పొహైడ్రేట్స్ శరీరంలో నేరుగా ప్రొటీన్స్, కొవ్వులతో కలిసి అడ్వాన్డ్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రాడక్ట్స్(ఏజీఈ)లుగా రూపాంతరం చెందుతాయి. వీటివల్ల శరీరంలో హానికరమైన మాలిక్యుల్స్ తయారవుతాయి. ఇవి ఎక్కువ కావడంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోతుంది. శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్‌ను అందించడంలో ఇన్సులిన్ తాళం చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఏజీఈ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో తిన్న ఆహారంలోని చక్కెర పదార్థాలు కణాలకు అందకుండా రక్తంలోని ఉండిపోయి టైప్–2 మధుమేహానికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ క్రమంలో ఏజీఈ అధికంగా ఉండే బేకరీ, హోటల్స్‌లో తయారు చేసే కేక్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, ఇంట్లో డీప్ ఫ్రై, ఫ్రై ఆహార పదార్థాలు తినడం తగ్గించాలని పరిశోధకులు స్పష్టం చేశారు.మిలమిలలాడే ఆహార పదార్థాలను వినియోగించొద్దు పూరీ్వకులు పాలిష్ చేయని దంపుడు బియ్యం, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, ఉప్పు ఇలా ప్రతీది తెల్లగా మిలమిలలాడేలా పాలిష్ చేస్తున్నారు. ఈ పాలిష్ ఆహార పదార్థాలను విడనాడాలి. – పి.శ్రీనివాసులు, హెచ్‌వోడీ ఎండోక్రినాలజీ విభాగం, కర్నూలు మెడికల్ కాలేజీ జీవన శైలిలో మార్పు రావాలి టైప్–2 మధుమేహం అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా వస్తుంది. దీనికి తోడు హానికరమైన ఆహారపు అలవాట్లు తోడై పిల్లలు సైతం మధుమేహం బారినపడుతున్నారు. చదువు, వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రయతి్నంచాలి. మధుమేహం అని తేలాక అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ వెంకట సందీప్, ఎండోక్రినాలజిస్ట్, గుంటూరు -
ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఇన్షెక్షన్‌తో పోలిస్తే నిఫా వైరస్‌తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2–3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్‌తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. యాంటీబాడీ డోసుల కొనుగోలుపై రాజీవ్ బహల్ స్పందిస్తూ..ఆస్ట్రేలియా నుంచి 2018లో తెప్పించిన కొన్ని డోసులు ఇప్పటికీ ఉన్నాయనీ, అవి 10 మంది బాధితులకు మాత్రమే సరిపోతాయని వివరించారు. భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు. వీరికి మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ‘అయితే, ఈ యాంటీబాడీలను ప్రారంభదశలో ఉన్న వారికే వాడుతున్నారు. వీటితో చికిత్సపై నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, వైరస్ బాధితుల కుటుంబాలకే వదిలేశాము. మోనోక్లోనల్ యాంటీబాడీలతో విదేశాల్లో భద్రతను నిర్థారించే ఫేజ్–1 ట్రయల్ మాత్రమే జరిగింది. సామర్థ్యాన్ని నిర్థారించే ట్రయల్స్ జరగలేదు. అందుకే దీనిని ‘కారుణ్య వినియోగ ఔషధం’గా మాత్రమే వాడుతున్నారు’అని రాజీవ్ వివరించారు. చదవండి: ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం -
ఐసీఎంఆర్ చీఫ్‌గా డా. రాజీవ్ బహల్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చీఫ్‌గా డా. రాజీవ్ బహల్ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీఎంఆర్ చీఫ్‌తో పాటు ఆరోగ్యశాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు. చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!) -
కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మార్గదర్శకాల్లో సూచించింది. అంటే కరోనా పాజిటివ్ వస్తున్నవారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, సీనియర్ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు వేగం ఎక్కువని, ఇంట్లో ఒకరికి వస్తే తక్కువ సమయంలోనే కుటుంబ సభ్యులకూ సోకే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి కోవిడ్ పాజిటివ్‌గా తేలినవారు తక్షణమే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోవడం మంచిది. ఇంట్లో వసతిని బట్టి ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలి. వసతి లేనివారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో చేరొచ్చు. ఇరుకు గదులు, రెండే గదులున్న ఇళ్లలో ఐసోలేషన్ పాటించడం కాస్త కష్టమే. తప్పనిసరి అయితే ఒక మూలన 6/6 అడుగుల విస్తీర్ణం కవరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఇంట్లోని వారందరూ తప్పకుండా మాస్కు ధరించాలి. ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించాలి. క్లాత్ మాస్కు అయితే రెండు లేయర్లు ఉండేవి వాడాలి. వాటిని ప్రతి 4 గంటలకోసారి శుభ్రం చేసుకోవాలి. ఎన్–95 మాస్క్ అయితే రోజంతా వాడొచ్చు. ఇంట్లోకి మంచి వెలుతురు, గాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. లక్షణాలు లేని వారైతే విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుంది. లక్షణాలున్నవారు మాత్రం తప్పకుండా వైద్యుడిని ఫోన్లోగానీ, వీడియోకా ల్ ద్వారా గానీ సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌తో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతులో గరగర లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. బాధితులు తరచూ గోరువెచ్చని నీటితో పుక్కిలించడం చేయాలి. వీలైతే గోరువెచ్చని నీటినే తాగడం మంచిది. తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆర్థిక స్తోమతను బట్టి డ్రైఫ్రూట్స్, ఇతర పళ్లు, రోజుకొక ఉడికించిన కోడిగుడ్డు తీసుకోవచ్చు. మంచి ఆహారం, విశ్రాంతితో రోగనిరోధక శక్తి బలపడుతుంది. కోవిడ్‌ను సులభంగా జయించవచ్చు. పరిశుభ్రత పాటించాలి. ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఏడు రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. తర్వాత ఎలాంటి లక్షణాలు లేకుంటే మళ్లీ కోవిడ్ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్షణాలుంటే.. పరీక్ష చేయించి నిర్ధారించుకోవాలి. మళ్లీ పాజిటివ్ వస్తే మరికొంత కాలం ఐసోలేషన్‌లో ఉండాలి. సరైన ఆహారం తీసుకోవడం కీలకం కోవిడ్ వ్యాప్తి చెందుతున్న వారిలో చాలా మందికి ఆహారాన్ని తీసుకోవాలనిపించడం లేదు. ఆకలిగా ఉన్నప్పటికీ తినాలనే ఉత్సాహం లేకపోవడంతో ఇన్‌టేక్ తక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరం. రోజుకు 3 పూటలా తాజాగా వండిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. మెనూలో మార్పులు లేకున్నా ఇంట్లో రోజువారీగా తీసుకునే ఆహారాన్ని కడుపునిండా తినాలి. సరైన ఆహారం తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే. – డాక్టర్ హెప్సిబా, మెడికల్ ఆఫీసర్, హైదరాబాద్ కోలుకున్నవారు సపర్యలు చేయొచ్చు.. ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తే.. ఇతరులకు సొకే అవకాశం ఉంటుంది. ఒకరికి హోం ఐసోలేషన్ పూర్తయ్యాక కుటుంబంలో ఇంకొకరికి వైరస్ సోకొచ్చు. అలాంటప్పుడు ఐసోలేషన్ ముగిసినవారు ఇతర బాధితులకు సపర్యలు చేయొచ్చు. అయినా భౌతికదూరం పాటించడం మంచిది. ఒక ఇంట్లో తల్లిదండ్రులిద్దరికీ కోవిడ్ వస్తే పిల్ల లకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు నెగెటివ్ వచ్చినా జాగ్రత్తలు పాటించాలి. -
ఆర్సీటీ యూనిట్‌గా గాంధీ మెడికల్ కాలేజీ
గాంధీఆస్పత్రి: రీజనల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ (ఆర్‌సీటీయు)గా గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్(ఇంటెంట్)లో భాగంగా అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఏసీసీటీ), రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్(ఆర్‌సీటీయు), ఐసీఎంఆర్ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్(ఐసీసీటీ), స్పెషాలిటీ సెంటర్ ఫర్ క్లినికల్ ట్రయల్ (ఎస్సీసీటీ), నాలెడ్జ్ పార్ట్నర్ ఫర్ క్లినికల్ ట్రయల్(కేపీసీటీ) వంటి ఐదు విభాగాల్లో దేశవ్యాప్తంగా పలు క్లినికల్ సెంటర్లను ఎంపిక చేసింది. దక్షిణ భారతదేశంలో ఆర్‌సీటీయు విభాగంలో గాంధీ మెడికల్ కాలేజీని ఎంపిక చేస్తు ఆదేశాలు జారీ చేసింది. రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్‌గా ఐసీఎంఆర్ గుర్తించడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను అభివృద్ధి చేసినందువల్లే ఇది సాధ్యమైందన్నారు. దీనివల్ల తెలంగాణ వైద్యులు, వైద్యవిద్యార్థులకు సైంటిఫిక్ స్టడీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలో ఇటీవల వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలకు వెసులుబాటు కలుగుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వ్యక్తిలో కోవాగ్జిన్ సింగిల్ డోస్‌తో యాంటీబాడీ స్పందన(రెస్పాన్స్) కనిపిస్తుందని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. ఈ రెస్పాన్స్ ఒక్కసారి కూడా వ్యాధి సోకని, టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో వచ్చే యాంటీబాడీ రెస్పాన్స్‌కు సమానంగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. అధ్యయన వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురించారు. పరిశీలించిన అంశాలను బట్టి ఇప్పటికే కరోనా సోకి తగ్గిన వారికి బీబీవీ152(కోవాగ్జిన్)సింగిల్‌డోస్ టీకా సరిపోతుందని భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. తాజా అధ్యయనంలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లనుంచి కొందరిని ఎంపిక చేసుకొని వారిలో డే జీరో(టీకా ఇచ్చే రోజు), 28 వరోజు, 56వరోజు యాంటీబాడీ రెస్పాన్స్‌ను నమోదు చేశారు. అంతకుముందు కోవిడ్ లేని వ్యక్తుల్లో టీకా వల్ల వచ్చిన యాంటీబాడీ స్పందనను, కోవిడ్ సోకి తగ్గిన అనంతరం సింగిల్ డోస్ తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీ స్పందనను మదింపు చేశారు. రెండు కేసుల్లో యాంటీబాడీ రెస్పాన్స్ దాదాపు సమానంగా ఉన్నట్లు గమనించారు. చదవండి: రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు -
మరో 6–8 వారాలు లాక్డౌన్ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరో 6 నుంచి 8 వారాల పాటు కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధిపతి డాక్టర్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సుమారు 500 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10% పైన ఉందని, ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలు ఎంతకాలం అవసరమనే విషయాన్ని డాక్టర్ భార్గవ్ వివరించారు. అయితే వైరస్ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలను సడలించాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 5% పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు 8 వారాలు పడుతుందన్నారు. ఢిల్లీ విషయాన్ని ఉదహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుందని, కానీ ఇప్పుడు అది కాస్తా 17 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ఉన్నపళంగా ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేస్తే అది మరో విపత్తుకు కారణమౌతుందని తెలిపారు. -
ఆ సమస్య కరోనా సెకండ్‌వేవ్‌లో ఎక్కువే..!
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటిదాకా కోవిడ్–19 మహమ్మారి బారినపడిన బాధితుల్లో 70కిపైగా శాతం మంది 40 ఏళ్ల వయసు దాటినవారే. మొదటి వేవ్, ప్రస్తుతం కొనసాగుతున్న రెండో వేవ్‌లో అత్యధిక శాతం మంది బాధితులు వయోధికులే కావడం గమనార్హం. ఎక్కువ వయసున్న వారికి కరోనా సులభంగా సోకుతోందని, వారు ఈ వైరస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ సోమవారం చెప్పారు. కరోనా సోకి, పరిస్థితి విషమించి, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా సంభవించిన మరణాల విషయంలో మొదటి వేవ్‌కు, రెండో వేవ్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తెలిపారు. కానీ, మెడికల్ ఆక్సిజన్ అవసరం మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో అధికంగా ఉందని వెల్లడించారు. ఫస్ట్ వేవ్‌లో 41.5 మంది బాధితులకు ఆక్సిజన్ అవసరం కాగా, సెకండ్ వేవ్‌లో 54.5 శాతం మందికి అవసరమవుతోందని చెప్పారు. వెంటిలేటర్ అవసరం మాత్రం తక్కువగానే ఉందన్నారు. కరోనా సోకితే ఊపిరి అందకపోవడం అనే సమస్య సెకండ్ వేవ్‌లో స్వల్పంగా పెరిగిందన్నారు. గొంతు నొప్పి, పొడి దగ్గు తదితర ఇతర లక్షణాలు ఫస్ట్ వేవ్‌లోనే ఎక్కువగా కనిపించాయని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు కనిపించని బాధితులు రెండో వేవ్‌లోనే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫస్ట్ వేవ్‌లో 7,600 మందిపై, సెకండ్ వేవ్‌లో 1,885 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించామన్నారు. చదవండి: (లాక్డౌన్ భయం.. విచ్చలవిడిగా షాపింగ్) యువతకు కరోనా ముప్పు విషయంలో రెండు వేవ్‌ల మధ్య పెద్దగా తేడా లేదని నీతి ఆయోగ్(హెల్త్) సభ్యుడు వి.కె.పాల్ చెప్పారు. మొదటి వేవ్ బాధితుల్లో 31 శాతం మంది 30 ఏళ్లలోపు వారని, రెండో వేవ్ బాధితుల్లో 32 శాతం మంది 30 ఏళ్లలోపు వారని వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నవారికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అవసరం లేదన్నారు. ఆసుపత్రిలో చేరి, ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే ఈ ఇంజక్షన్ ఇవ్వాలని సూచించారు. చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి) -
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఒక వలంటీర్‌గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు. -
వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా పాన్ మసాలా, జర్దా, గుట్కాలకు దూరంగా ఉండడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ కూడదంటూ భారత వైద్య పరిశోధన మండలి గత మార్చి నెలలో దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినట్లయితే జరిమానా విధిస్తామంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ నాలుగో తేదీన ఉత్తర్వులు జారీ చేశాయి. జరిమానాను రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు పేర్కొన్నాయి. చదవండి: కోవిడ్ శాంపిల్ కోసం రోబో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం, జూదంపై విధించిన నిషేధం నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ వరకు అమలవుతుండగా, ఉమ్మ కూడదన్న నిబంధన అసలు ఏమాత్రం అమలవడం లేదనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. నోటి నిండా మీటా పాన్ లేదా జర్దా పాన్ దట్టించడం, కసాపిసా నమలి రోడ్డు పక్కనో, గోడల మీదో తుపుక్కున ఉమ్మేయడం మహా నగరాల వీదుల్లో మనకు నిత్యం కనిపించే దశ్యాలే. పాన్లు గీన్లు ఏమీ వేసుకోక పోయినా వీధుల్లో ఉమ్మడం, ముక్కులు చీదడం మనకు కొత్త కాదు. కరోనా లాంటి వైరస్ల ద్వారా వచ్చే అంటు రోగాలను అరికట్టడంలో భాగంగా ఉమ్మ కూడదనే నిబంధనను తీసుకొచ్చినప్పటికీ అది దేశంలో ఎక్కడా సరిగ్గా అమలు కాకపోవడానికి కారణాలేమిటీ? నిబంధనను అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడమా, ఉమ్మడం తమ స్వేచ్ఛలో భాగమని భావించే ప్రజలు తమ వైఖరిని మార్చుకోవడానికి సుముఖంగా లేకపోవడం కారణమా? మరి పౌరుల ప్రవర్తనలో ఎలా మర్పు తీసుకరావాలి? 19వ శతాబ్దంలో అమెరికాను వణికిస్తోన్న టీబీ (ఉమ్మి ద్వారానే టీబీ ఇతరులకు వ్యాపిస్తుందని తెల్సిందే)ని అరికట్టడం కోసం అక్కడి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయింది. 1910లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలోని 74 నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకరాగా, చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంగా 34 నగరాల్లో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 13 రాష్ట్రాల్లో ఈ చట్టడం కింద ఓ 20 మందిని అరెస్ట్ చేయగా, ఒక్క న్యూయార్క్ నగరంలో 2,513 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఖ్య ఇలాంటి కేసుల్లో దేశం మొత్తం మీద అరెస్ట్ అయిన వారిలో 73 శాతం. ఉమ్మి వేయడాన్ని అరికట్టడం కోసం చట్టాలు తీసుకొచ్చి, అరెస్ట్‌లు చేసినంత మాత్రాన, ఉమ్మడం తమ స్వేచ్ఛలో అంతర్భాగమని భావించే ప్రజల వైఖరిలో మార్పురాదని అమెరికా ప్రజారోగ్య విభాగం నాడు అవగాహనకు వచ్చింది. చట్టాలతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకరావడం ఇంకా ముఖ్యమని భావించింది. ఉమ్మడం ద్వారా ఇతరులు ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాస్తున్నామన్న భావన నగర పౌరుల్లో తీసుకరావడంతోపాటు ఉమ్మక పోవడం ఓ సామాజిక బాధ్యతగా, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే పౌరులకు సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. న్యూయార్క్ నగరం పాలక మండలి ఆధ్వర్యాన దేశంలోని పలు నగరాలు ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి విస్తత కార్యక్రమాలను నిర్వహించింది. ఉమ్మడం, దాని పర్యవసనాల గురించి టాక్సీలపై, కార్లపై, బస్సులపై పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. వీధుల్లో, ఇళ్లల్లో కరపత్రాల ప్రచారాన్ని చేపట్టింది. మొబైల్‌తోపాటు అన్ని ప్రసార, ప్రచార మాద్యమాలను ఉపయోగించుకొని ప్రచారాన్ని ఉధతం చేసింది. రోడ్లపై ఉమ్మవేసిన వారిని వార్తా పత్రికలు, ఇతర ప్రసార మాద్యమాల ద్వారా గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించింది. ఉమ్మవేసే వారిని చిన్న చూపు చూడండంటూ ప్రతి సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది. జరిమానాలు విధించింది. ఈ విషయంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సంఘాలతోపాటు ఎన్జీవో సంస్థల సేవలను ఉపయోగించుకుంది. నాటి ఉమ్మడం వ్యతిరేక ఉద్యమంలో నేషనల్ ట్యూబర్కులోసిస్ అసోసియేషన్, విమెన్స్ హెల్త్ ప్రొటెక్టివ్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ విమెన్స్ క్లబ్స్ క్రియాశీలక పాత్ర వహించాయి. మరోపక్క మున్సిపల్ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి ప్రత్యేక కుండీలను ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందితో ప్రతి బహిరంగ ప్రదేశంలో శానిటరీ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేసి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఇలాంటి విస్తత ప్రచార కార్యక్రమాలతో మూడేళ్లలోనే ఉమ్మివేయడంపై విధించిన నిషేధాన్ని నూటికి నూరు పాళ్లు అమెరికా నగర పాలక అధికారులు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఫలితంగా టీబీ వ్యాప్తిని అమెరికా ప్రజారోగ్య శాఖ అరికట్టగలిగింది. -
ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు అత్యధికంగా 3.2 లక్షలకుపైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజులో ఇంత భారీసంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. జూలై 14 వరకు దేశంలో 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రతి పదిలక్షల మందికి 8994.7 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 14 వరకు మొత్తం 1,24,12,664 శాంపిల్స్ పరీక్షించగా, ఒక్క మంగళవారమే 3,20,161 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ వర్మ తెలిపారు. మే 25న రోజుకి 1.5 లక్షలకు పైగా ఉన్న కోవిడ్ పరీక్షా సామర్థ్యం మంగళవారానికి 4 లక్షలకు చేరుకున్నట్టు శర్మ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి దేశం, ప్రతి పదిలక్షల మందికి రోజుకి 140 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 865, ప్రైవేటు రంగంలో 358.. మొత్తం కలిపి 1,223 పరీక్షా కేంద్రాలున్నాయి. 24 గంటల్లో 29,429 కేసులు దేశంలో వరుసగా నాలుగో రోజు 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో కొత్తగా 29,429 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అలాగే 582 మంది బాధితులు కరోనా మహమ్మారితో పోరాడుతూ మృతి చెందారు. ఇప్పటిదాకా మొత్తం కేసులు 9,36,181కు, మరణాలు 24,309కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,19,840 కాగా, 5,92,031 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 63.24 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం 1,24,12,664 కరోనా టెస్టులు నిర్వహించిట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. -
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది. అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది. ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్‌ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు. మానవ ప్రయోగాలకి 12–18 నెలలు మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్‌కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు. -
ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. ఈ మేరకు ఎంపిక చేసిన వైద్య సంస్థలు, హాస్పిటళ్లకు తాజాగా లేఖ రాసింది. జూలై 7వ తేదీలోగా ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని కోరింది. భారత్‌లో దేశీయంగానే తయారు చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ లేఖలో పేర్కొన్నారు. ఆ సమయానికి సాధ్యమా?: భారత్‌లో కోవాక్సిన్ మానవ ప్రయోగాలు ఇంకా మొదలుకాలేదు. దీంతో ఆగస్టు 15లోగా టీకా రావటం దాదాపు అసాధ్యమన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఏ టీకా తయారీ అయినా మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకోవాలి. ఒక్కో దశకు ఏడు నెలల వరకు సమయం పట్టొచ్చు. భారత్ బయోటెక్‌కు కోవాక్సిన్ విషయంలో తొలి రెండు దశలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనుమతులు లభించాయి. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవి త్వరగా ముగిసినా మూడో దశ ట్రయల్స్ పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయ్యాక సమాచారాన్ని ఫైలింగ్ చేసి... వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొంది, మందు భారీగా ఉత్పత్తి చేయటానికి మరికొంత సమయం పడుతుందన్నది విశ్లేషకుల మాట. అన్నీ సవ్యంగా... వేగంగా జరిగితే నవంబర్– డిసెంబర్ నాటికి కోవాక్సిన్ అందుబాటులోకి రావచ్చన్నది ఆశావహుల మాట. (రికార్డు స్థాయిలో రికవరీ) -
కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఈ మానవ ట్రయల్స్‌లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్‌ను ఆవిష్కరించాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. (గుడ్‌న్యూస్: ఆగస్ట్ 15కి వ్యాక్సిన్) మానవులపై ట్రయల్స్ జరగకముందే ఎలా వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఖరారు చేస్తారని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’ సంపాదకులు అమర్ జెసాని ప్రశ్నించారు. మానవులపై వ్యాక్సిన్ ట్రయల్స్ విజయం అవుతాయన్న నమ్మకం ఏమిటని ఆయన అన్నారు. మానవ ట్రయల్స్‌లో పాల్గొంటున్న 12 సంస్థల్లో మెజారిటీ సంస్థలు కూడా భార్గవ లేఖ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎథిక్స్ కమిటీ అనుమతి ఇవ్వకుండా తాము మానవ ట్రయల్స్ పాల్గొనలేమని, ఆగస్టు 15వ తేదీ కాదుగదా, డిసెంబర్ 15వ తేదీ నాటికి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదని ఒడిశాలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సమ్ హాస్పిటల్’ ట్రయల్స్ ఇంచార్జి వెంకట్రావు తెలిపారు. (టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు) ఇది జంతువులపై ట్రయల్స్ అని, మానవులపై ట్రయల్స్ అని, సాక్షాత్తు ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నా రెండు, మూడు నెలల్లో ట్రయల్స్ పూర్తి కావని మరో ప్రభుత్వాస్పత్రికి చెందిన ఎథిక్స్ కమిటీ పేర్కొంది. భార్గవ లేఖ గురించి తనకు తెలియదని, నిర్దేశించిన కాల వ్యవధిలో వ్యాక్సిన్‌ను ఆవిష్కరించడం అసాధ్యమని, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నా ఆవిష్కరణకు కనీసం ఏడాది కాలం పడుతుందని ఐసీఎంఆర్ ఎథిక్స్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వసంత ముత్తుస్వామి చెప్పారు. ఇలా అనవసరంగా తొందరపెడితే తాము మానవ ట్రయల్స్‌లో పాల్గొనమని 12 సంస్థల్లో కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. (మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్) -
సహోద్యోగులతోనే కరోనా ముప్పు!
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాడుతున్న యోధుల్లో ముందుండే వైద్యులు, వైద్య సిబ్బందికి కోవిడ్ ఎక్కువగా రోగుల నుంచి కాకుండా సహోద్యోగులతోనే వస్తోంది. ఆస్పత్రి నుంచి వైరస్ సంక్రమించిన కేసుల్లో దాదాపు 70 శాతం మందికి సహోద్యోగులు, తోటి సిబ్బందితోనే వ్యాప్తి చెందుతోంది. హెల్త్ వారియర్స్‌కు కరోనా సోకుతున్న తీరుపై అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. మార్చి 15వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిపిన ఈ పరిశోధనలో 21,104 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విధానంపై అధ్యయనం చేశారు. వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయిన తర్వాత వారితో ఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సంభాషించి పరిస్థితిని విశ్లేషించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. (మాస్క్ అనేది సరిగ్గా వేసుకుంటేనే..) రోగులతో జాగ్రత్తగా ఉండటంతో... కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం, చేతికి గ్లౌజ్‌లు తొడుక్కోవడంతో పాటు పీపీఈ కిట్లు ధరించిన తర్వాతే రోగి ఉంటున్న వార్డుల్లోకి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో రోగుల నుంచి డాక్టర్లు, ఇతర సిబ్బందికి వైరస్ తక్కువగా సోకుతుంది. అయితే రోగిని పరిశీలించిన తర్వాత వైద్యులు, వైద్య సిబ్బంది వారి గదుల్లోకి వెళ్లిన తర్వాత పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు తొలగిస్తున్నారు. ఇదే సమయంలో సహోద్యోగులతో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, కనీసం భౌతిక దూరాన్ని సైతం పాటించకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారుతోందని పరిశీలనలో తేలింది. (ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్) వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకిన తీరును మూడు కోణాల్లో పరిశీలన చేశారు. సమాజం నుంచి, సహచరుల నుంచి, ఆస్పత్రుల నుంచి సోకుతున్నట్లు నిర్ధారించి ఆమేరకు విభజన చేసి పరిశోధన సాగించారు. హెల్త్ వారియర్స్‌కు సోకుతున్న వైరస్ ప్రధానంగా 38 శాతం సమాజం నుంచే సోకుతుండగా.. మరో 22 శాతం మేర ఆస్పత్రుల నుంచి సోకుతుంది. మిగతా 40 శాతం మందికి సమాజం, ఆస్పత్రులతో పాటు ఇతర అంశాల వల్ల వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అభిప్రాయపడింది. ఇక ఆస్పత్రి ద్వారా కరోనా సోకిన వారిలో 70 శాతం మందికి కేవలం సహోద్యోగుల వల్లే వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. మాస్కులు ధరించకుండా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా వచ్చినట్లు తేల్చారు. ఈ క్రమంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్కులు ధరించాలనే నిబంధన కఠినతరం చేయడంతో వారం తర్వాత వారియర్స్‌కు వైరస్ సోకడం గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. దీంతో ఆస్పత్రిలో ఉన్నంతసేపు జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ వస్తున్నట్లు ఆ యూనివర్సిటీ స్పష్టం చేసింది. (మేలుకుంటేనే కోలుకుంటాం) ఐసీయూలోని వారియర్స్‌కు హైరిస్క్: ఐసీఎంఆర్ కరోనా సోకుతున్న హెల్త్ వారియర్స్‌లో అధికంగా ఐసీయూలో డ్యూటీ చేస్తున్న వాళ్లున్నట్లు ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) పరిశీలనలో తేలింది. ఐసీయూ విధుల్లో భాగంగా పేషెంట్ కు ఆక్సిజన్ పెట్టడం, పైపులు మార్చడంతో పాటు రోగిని మరింత దగ్గరగా పరిశీలించాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏ ర్పడుతున్నట్లు ఐసీఎంఆర్ శా స్త్రవేత్తలు గుర్తించారు. సాధార ణ వార్డులో పనిచేసే వారితో పోలిస్తే ఐసీయూ వైద్యు లు, వైద్య సిబ్బంది నాలు గు రెట్లు అధిక రిస్క్‌లో ఉ న్నట్లు స్పష్టంచేసింది. అదే విధంగా పీపీఈ కిట్లు ధరి స్తున్న వారు జాగ్రత్తలు పాటించకపోవడం కూడా రిస్క్‌కు కారణమని తెలిపింది. (లాక్డౌన్లో ఎంత డౌన్?) చిరిగిన పీపీఈ కిట్లు ధరించడం, సరైన పద్ధతిలో మాస్క్ పెట్టుకోకపోవడం, గ్లౌజ్‌లు సరిగ్గా వేసుకోని వాళ్లలో రిస్క్ 3 రెట్లున్నట్లు తెలిపింది. జనాభా నిష్పత్తితో పోలిస్తే మన దగ్గర వైద్యులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వైద్యులు, సిబ్బందికి విధుల్లో ఉన్నంతసేపు మాస్క్ ధరించాలనే నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అదేవిధంగా బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్ ధరిస్తే మంచి ఫలితముంటుందని నిజామాబాద్ వైద్య కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. -
తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందనే దానిపై ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లు జరిపిన సీరం సర్వేల్లో రాష్ట్రంలో తీసిన శాంపిల్స్‌లో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తి పరిశోధనల్లో భాగంగా తెలంగాణలో రూరల్, అర్బన్‌లో ప్రత్యేకంగా ఐసీఎంఆర్ ప్రివలెన్స్ సర్వే నిర్వహించాయి. ముందుగా మే నెల 15 నుంచి 17 వరకు రూరల్ ప్రాంతాలైన జనగాం, కామారెడ్డి, నల్లగొండలో ఒక్కో జిల్లాలో 400 శాంపిల్స్ చొప్పున మొత్తం 1,200 శాంపిల్స్ సేకరించారు. వీటిని పరిశీలించగా కేవలం 4 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. అదేవిధంగా అర్బన్ ప్రాంతం హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్ జోన్లు అయిన ఆదిభట్ల, టప్పాచబుత్ర, మియాపూర్, చందానగర్, బాలాపూర్‌లలో మే నెల 30, 31 తేదీల్లో సీరం సర్వే నిర్వహించారు. ఒక్కో జోన్లో 100 శాంపిల్స్ చొప్పున మొత్తం 500 శాంపిల్స్ సేకరించారు. వీటిని పరిశీలించగా కేవలం 15 మాత్రమే పాజిటివ్‌లుగా తేలాయి. లాక్డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్లనే కరోనా కట్టడి సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫేజ్–1 (మే 15 నుంచి 17 వరకు) జిల్లా శాంపిల్స్ పాజిటివ్‌లు జనగామ 400 2 కామారెడ్డి 400 1 నల్లగొండ 400 1 -
కరోనా లక్షణాలు పద్నాలుగు
సాక్షి, హైదరాబాద్: దగ్గు.. జ్వరం.. ముక్కు కారటం.. శ్వాసకోశ సంబంధ సమస్యలే కరోనా లక్షణాలని భావించాం.. కానీ ఒక్కోసారి వాంతులు, విరేచనాలు వంటివి కూడా వైరస్ లక్షణాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చి చెప్పింది. జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 మధ్య దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, సోకిన కారణాలు, లక్షణాలపై అధ్యయనం చేసింది. మొత్తం 40,184 పాజిటివ్ కేసులను విశ్లేషించింది. ఏ లక్షణాలతో వైరస్ ప్రబలిందన్న దానిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. లక్షణాలు లేకున్నా కొన్ని కేసులు నమోదు కాగా, మిగిలిన వాటిల్లో 14లక్షణాలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని తేల్చిచెప్పింది. అయితే ఒక్క లక్షణంతోనే కరోనా వ్యాపించదని తెలిపింది. దగ్గు, జలుబు, జ్వరం కలసి రావడంతో వైరస్ వ్యాపించడం లేదా కేవలం జ్వరం, దగ్గుతో కలసి రావడం.. ఒక్కోసారి జ్వరం, వాంతులు ఉండటం వల్ల.. ఇలా రెండుమూడు లక్షణాలతో రావడంతో వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధమైనవే ప్రధానం.. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన 40,184 కరోనా కేసుల్లో 27,647 కేసుల్లో లక్షణాలు బయటపడ్డాయి. ఈ కేసుల్లో ఆయా వ్యక్తులకు కరోనా సోకడానికి 14 లక్షణాలను గుర్తించింది. అందులో అత్యధిక కేసులు దగ్గు కారణంగా నమోదయ్యాయి. ఆ తర్వాత జ్వరం, మూడోది శ్వాస సంబంధమైన దమ్ము వంటి కారణాలుగా తెలిపింది. నాలుగో కారణం గొంతులో గరగర వంటి కారణాలతో అని తెలిపింది. ప్రధానంగా దగ్గుతో 64.5 శాతం కేసులు నమోదయ్యాయి. జ్వరంతో 60 శాతం కేసులు, శ్వాసకోశ (దమ్ము) సంబంధమైన కారణాలతో 31.9 శాతం కేసులు, గొంతులో గరగర వల్ల 26.7 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక కండరాల నొప్పుల వల్ల 12.5 శాతం కేసులు నమోదయ్యాయి. తెమడ, ముక్కు నుంచి నీరు కారడం, వాంతులు, నీళ్ల వీరేచనాలు, వికారం, కడుపు నొప్పి, తెమడలో రక్తం పడటం, ఛాతీ నొప్పి, లక్షణాలున్నా ఇతరత్రా కారణాలతో వచ్చినవి. అత్యంత తక్కువగా ఛాతీ నొప్పి వల్ల 0.1 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఐసీఎంఆర్ తెలిపింది. వైద్య సిబ్బందిలోనే అధికం.. దేశంలో సాధారణ జనం కంటే వైద్య సిబ్బందికే కరోనా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. దేశవ్యాప్తంగా 10.21 లక్షల మందికి పరీక్షలు చేస్తే, 40,184 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అంటే చేసిన పరీక్షల్లో పాజిటివ్ రేటు 3.9 శాతం ఉంది. ఇక లక్షణాలున్న వైద్య సిబ్బందిలో దేశవ్యాప్తంగా 20,249 మందిని పరీక్షిస్తే 947 మందికి పాజిటివ్ బయటపడింది. అంటే వీరిలో పాజిటివ్ రేటు 4.6 శాతం ఉంది. లక్షణాలు లేని 48,852 మంది వైద్య సిబ్బందికి పరీక్షలు చేస్తే, 1,135 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే 2.3 శాతం పాజిటివ్ రేటుంది. మొత్తం వైద్య సిబ్బందిలో పాజిటివ్ రేటు 5 శాతంగా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. అంటే సాధారణ ప్రజల్లో కంటే వైద్య సిబ్బందిలో 33 రెట్లు అధికంగా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఐసీఎంఆర్ తేల్చిందని నిజామాబాద్ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో పలువురు పీజీ విద్యార్థులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాబట్టి పైలక్షణాల్లో ఏవైనా ఉండి అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, అజాగ్రత్త వహించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. -
కమ్యూనిటీ వ్యాప్తిపై సర్వే..
హఫీజ్‌పేట్/చందానగర్: కరోనా వైరస్ కమ్యూనిటీ విస్తరణ ఏ మేరకు ఉందనే అంశంపై నిగ్గుతేల్చేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషన ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సంస్థలు ప్ర ధాన నగరాల్లోని కంటైన్మెంట్ జోన్లలో రక్త నమూనాల సే కరణ ప్రారంభించాయి. ఇందుకు హైదరాబాద్‌లో 5 కం టైన్మెంట్ జోన్లను ఎంపిక చేశారు. ఒక కంటైన్మెంట్లో 10 బృందాలు రెండు రోజుల పాటు జోన్‌కు 100 చొప్పున మొత్తం 500 నమూనాలు సేకరిస్తున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన సర్వే ఆదివారం కొనసాగనుంది. ఈ సర్వేలో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మయ్య నేతృత్వంలోని బృందాలు సర్వే చేస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ సర్కిల్–21 పరిధిలోని మియాపూర్ ఓల్డ్ హఫీజ్‌పేట్ సాయినగర్ కాలనీ, చందానగర్‌లోని అపర్ణ బ్రీజ్ అపార్ట్మెంట్లో శనివారం సర్వే చేశారు. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లు అయిన నల్లగొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఇటీవల ఇంటిం టి సర్వే చేసి, నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. చెన్నైకి రక్త నమూనాల తరలింపు: కంటైన్మెంట్ జోన్లలో సేకరించిన రక్త నమూనాలను చెన్నైలోని ఐసీఎంఆర్ ల్యాబ్‌కు తరలిస్తామని లక్ష్మయ్య తెలిపారు. రెండ్రోజుల్లో ఈ నమూనాలపై కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. ర్యాండమ్‌గా నమూనాల సేకరణ ఐసీఎంఆర్ బృందం శనివారం రంగారె డ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో పర్యటించింది. పలు కాలనీల్లో ర్యాండమ్‌గా యాభై మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ఆదివారం మరో 50 మంది నుంచి ర్యాండమ్ పద్ధతిలో శాంపిళ్లను సేకరించనున్నట్టు బృందానికి చెందిన అధికారులు తెలిపారు. 5కంటైన్మెంట్ జోన్లలో.. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ఆధారంగా ప్రత్యేకంగా కంటైన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ సంస్థ ఇంటింటి సర్వే ప్రారంభించింది. కంటైన్మెంట్ జోన్లయిన మియాపూర్, చందానగర్, బాలాపూర్, ఆదిబట్ల, టప్పాచపుత్రలో రక్త నమూనాల సేకరణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేని పాజిటివ్ కేసులను కనిపెట్టేందుకు చందానగర్ సర్కిల్–21 పరిధిలోని కంటైన్మెంట్ జోన్లలో శనివారం నిర్వహించారు. డా.దేవరాజ్, డా.మిష్రాన్, డా.రవీంద్ర, మహేశ్‌లు రెండు బృందాలుగా ఏర్పడి రక్త నమునాలు సేకరించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు, కరోనా నివారణకు ఈ సర్వే దోహదం చేస్తుందన్నారు. పట్టణాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, ప్రధానంగా సంక్రమణ ఎంతమేర జరిగింది.. ఒకవేళ సోకితే యాంటీబాడీస్ వృద్ధి చెందాయా అన్న విషయాలు తెలుసుకుంటామని వివరించారు. సాయినగర్ కాలనీలో ఓ మహిళ నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది.. -
అలాంటిదేం లేదు.. అయినా పాజిటివ్!
నాకు జ్వరం లేదు.. దగ్గు లేనే లేదు.. తుమ్ములు రావడమే లేదు.. కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేవు.. కానీ.. నేను కరోనా పాజిటివ్!! ప్రస్తుతం కరోనాపై మనం సాగిస్తున్న పోరులో ఇదో పెద్ద సవాలు.. వైరస్ శరీరంలో ప్రవేశించినా.. ఎటువంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతున్నారు. తెలియకుండానే చాలామందికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదివారం చైనాలో 17 కొత్త కేసులు నమోదైతే.. అందులో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు! ‘వాళ్లలో లక్షణాలు కనిపించవు.. అనుమానించే పరిస్థితి ఉండవు.. మిగిలిన వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే.,. లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల వెంటనే దాన్ని గుర్తించి.. ఇన్ఫెక్షన్ మిగిలినవారికి సోకకుండా నివారించవచ్చు.. కరోనా వైరస్ ఇలా కాదు.. ఇప్పుడీ లక్షణాలు కనబరచని రోగులతోనే పెద్ద సమస్య. వీరిలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ఈ లక్షణాలు బయడపడకపోవడానికి ఒక కారణం అయిఉండొచ్చు. వీరి నుంచి ఇన్ఫెక్షన్ చెయిన్‌ను తెంచాలంటే.. ఎంత ఎక్కువ మందికి అయితే.. అంత మందికి పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం’ అని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ(అమెరికా)కు చెందిన సీనియర్ పరిశోధకుడు, ఇమ్యునాలజిస్ట్ గిగి గ్రాన్వాల్ తెలిపారు. అన్ని వసతులు లేకుంటే.. లక్షణాలతో సంబంధం లేకుండా.. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం మేలని.. అప్రమత్తత అవసరమని చెబుతున్నారు. మన దేశంలోనూ ఇలాంటి ‘లక్షణాలు లేని’ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు లక్షణాలు లేని వీరి ద్వారా కరోనా వ్యాప్తి ఎలా అన్నది ఓసారి చూద్దామా.. ఇలా ఎంత మంది.. ప్రతి నలుగురిలో ఒకరికి ఎలాంటి కరోనా లక్షణాలు కనపడకపోవచ్చు.. ఆధారం: అమెరికాలో జరిగిన అధ్యయనాలు.. ఇదెందుకంత సమస్య.. అసింప్టొమాటిక్ క్యారియర్లలో లక్షణాలు కనపడవు.. కానీ ఇన్ఫెక్షన్ ఉంటుంది.. సైలెంటుగా వీరి ద్వారా చాలామందికి కరోనా వ్యాపిస్తుంది. లక్షణాలు లేకపోవడం వల్ల పరీక్షల ద్వారానే వీరిని గుర్తించగలం. అయితే, ఇందుకోసం భారీ స్థాయిలో టెస్టింగ్ కిట్ల అవసరం ఉంటుంది. -
టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు
న్యూఢిల్లీ: కోవిడ్‌కు దేశీయంగానే టీకా రూపొందించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్)తో జట్టు కట్టింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), పుణే పరిశోధనశాలలో వేరు చేయబడిన కరోనా వైరస్‌ను ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్ఐవీ నుంచి హైదరాబాద్‌లోని బీబీఐఎల్‌కు ఈ వైరస్‌ను తరలించాం. టీకా తయారీ, అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేపట్టడం, విశ్లేషించడంలో బీబీఐఎల్–ఎన్ఐవీ పరస్పరం సహకరించుకుంటాయి’ అని ఐసీఎంఆర్ తెలిపింది. -
కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ పరిశోధన
న్యూఢిల్లీ: ఇండియన కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో కరోనా వ్యాప్తిని కనుగొనేందుకు పరిశోధన చేయనుంది. దీనిలో భాగంగా దేశంలోని 75 జిల్లాలను ఎంచుకొని అందులో కరోనా సోకినా ఎటువంటి లక్షణాలను చూపని వారిపై పరిశోధనలు చేయనుంది. దేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ స్థాయిలో జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ పరిశోధనలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల నుంచి జిల్లాలను ఎంచుకొని పరీక్షించనున్నారు. అందులో కరోనా సోకిన వారికి వారి శరీరంలోని యాంటీబాడీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోనున్నారని ఐసీఎంఆర్ కు చెందిన అధికారి తెలిపారు. ఈ పరిశోధన ముందే జరపవలసి ఉన్నప్పటికీ, చైనా నుంచి వచ్చిన కిట్లు సరిగా పనిచేయకపోవడంతో ఆలస్యమైట్లు చెప్పారు. ఈ పరిశోధనను త్వరలో ప్రారంభించనున్నారు. అధిక జనాభా, ఎక్కువగా రాకపోకలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోనున్నారు. కరోనా వచ్చిన వారిలో 80 శాతం మంది లక్షణాలను చూపకపోతున్న సంగతి తెలిసిందే. -
వైరస్ మార్పు చెందుతోందా?
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యోచిస్తోంది. సార్స్–కోవిడ్2 తన రూపం మార్చుకుందా అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల దానికి విరుగుడుగా కనుగొనే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఉపయోగపడు తుందని దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. (లాక్డౌన్ : మాకు వర్క్ ఫ్రం హోమ్ బాగుంది) ఈ అధ్యయనం ద్వారా వైరస్ మరింత బలంగా వృద్ధిచెందుతోందా? మరింత త్వరగా వ్యాప్తిచెందుతోందా అనే విషయం తెలుస్తుంది. కరోనా వైరస్ మార్పుచెందిందా? లేదా అనే విషయాన్ని అంచనావేయడానికి కోవిడ్–19 రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష చేస్తారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో గరిష్ట వ్యత్యాసం 0.2 నుంచి 0.9 మధ్యలో ఉన్నట్టు గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డేటా(జీఐఎస్ఏడీ)ని బట్టి తెలుస్తోందని మరో శాస్త్రవేత్త వెల్లడించారు. (‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’) ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారత్‌లోకి వివిధ రకాల కరోనా వైరస్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మూడు రకాలైన వైరస్లు దేశంలో ఉన్నట్టు గుర్తించారు. ఒకటి వూహాన్ నుంచి వచ్చిందీ, మరొకటి ఇటలీ నుంచి, మరో వైరస్ ఇరాన్ నుంచి వచ్చిన రకం. అయితే ఇరాన్ నుంచి వచ్చిన వైరస్ మాత్రం చైనా వైరస్‌ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందనీ, అయితే అన్నిరకాల వైరస్లలో ఒకేరకం ఎంజైములు ఉండడం వల్ల టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. (ఆ మూడు జిల్లాల్లో.. 50 శాతానికి పైగా రికవరీ) భారత్‌లో ఈ వైరస్ మూడు నెలలుగా ఉన్నప్పటికీ త్వరగా మార్పులకు గురికాలేదనీ ఐసీఎంఆర్‌లోని ఎపిడెమాలజీ అండ్ కమ్యూని కబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ రమణ ఆర్.గంగాఖేద్కర్ గతంలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ప్రాణాంతక వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఆరు భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 70 వాక్సిన్లు పరీక్షించగా మూడు మాత్రం క్లినికల్ ట్రయల్స్ దశకు చేరాయి. అయితే 2021 కన్నా ముందు వ్యాక్సిన్ ప్రజల వినియోగానికి రాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు) -
కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పరీక్షలకు ఉపయోగించే ‘యాంటీ బాడీ టెస్ట్ కిట్ల’ కోసం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మార్చి 25వ తేదీన బిడ్డింగ్‌లకు ఆహ్వానించింది. విదేశాల్లో మాత్రమే దొరికే ఈ కిట్ల సరఫరా కోసం బిడ్డింగ్ వేసే కంపెనీలకు ‘దిగుమతి లైసెన్స్’ ఉండాలనే షరతును విధించలేదు. దాంతో దిగుమతి లైసెన్స్‌లేని ఢిల్లీకి చెందిన ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ కంపెనీతోపాటు చైనా నుంచే కాకుండా యూరప్ నుంచి కూడా మందులను, వైద్య పరికరాలను దిగుమతి చేసుకునే లైసెన్స్ ఉన్న కొన్ని కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. భారత వైద్య పరిశోధనా మండలి మార్చి 27వ తేదీన ఆశ్చర్యంగా 30 కోట్ల రూపాయల విలువైన ‘టెస్ట్ కిట్ల’ను సరఫరా చేయాల్సిందిగా ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’కు అప్పగించింది. ఈ వ్యవహారం ఒకానొక దశలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. కిట్‌కు 600 రూపాయల చొప్పున చైనాకు చెందిన ‘గ్వాంజౌ వాండ్ఫో బయోటెక్’ తయారు చేసిన టెస్ట్ కిట్లను సరఫరా చేస్తామని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్ కంపెనీ, భారత వైద్య పరిశోధనా మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్క్ ఫార్మా ష్యూటికల్స్కు దిగుమతి లైసెన్స్ లేకపోవడమే కాకుండా చైనా కంపెనీతో ఎలాంటి ఒప్పందం లేదు. గ్వాంజౌ అనే చైనా కంపెనీతో చెన్నైకి చెందిన ‘మ్యాట్రిక్స్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉంది. ఆ కంపెనీకి దిగుమతి లైసెన్స్ ఉంది. కనీసం మ్యాట్రిక్స్తోని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు ఎలాంటి ఒప్పందం లేదు. మ్యాట్రిక్స్‌కు ఆలిండియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ఢిల్లీలోని ‘రేర్ మెటబాలిక్స్ లైవ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీతో కరోనా టెస్ట్ కిట్ల సరఫరాకు ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ ఒప్పందం చేసుకుంది. దీంతో చైనా నుంచి మ్యాట్రిక్స్ కంపెనీ 245 రూపాయల చొప్పున కిట్లను దిగుమతి చేసుకొని రేర్ మెటబాలిక్స్కు సరఫరా చేయగా, ఆ కంపెనీ వాటిని 420 రూపాయలకు చొప్పున ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు సరఫరా చేసింది. ఆ కంపెనీ భారత వైద్య పరిశోధనా మండలితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాటిని 600 రూపాయలకు సరఫరా చేసింది. ఇంతవరకు లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. (వైరస్ మూలాలపై గందరగోళం..) ఆ తర్వాత 50 వేల కిట్లను సరఫరా చేసేందుకు మ్యాట్రిక్స్ కంపెనీ నేరుగా తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐసీఎంఆర్‌కు సరఫరా చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా తమకు వాటా ఇవ్వాలంటూ ఆర్క్ ఫార్మాష్యూటికల్స్, రేర్ మెటబాలిక్స్ మ్యాట్రిక్స్‌ను డిమాండ్ చేశాయి. అందుకు ఆ కంపెనీ అంగీకరించక పోవడంతో రెండు కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ 245 రూపాయల కిట్లు, 420 రూపాయలుగా మారడం, ఆ తర్వాత 600 రూపాయలుగా మారిన బాగోతం వెలుగులోకి వచ్చింది. కోర్టు విచారణ జరిగి ఏప్రిల్ 17వ తేదీ నాటికి ఐసీఎంఆర్‌కు 2.76 లక్షల కిట్లు సరఫరాకాగా, ఇంకా 2.34 లక్షల కిట్లను సరఫరా చేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వాటిని 420 రూపాయల చొప్పునే సరఫరా చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. కరోనా టెస్ట్ కిట్లను తయారుచేసే చైనాకు చెందిన ‘గెటైన్ బయోటెక్ ఇన్కార్పొరేషన్’ కంపెనీతో ఢిల్లీకి చెందిన ‘సోవర్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉండడమే కాకుండా ఆ కంపెనీకి ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ మంజూరు చేసిన దిగుమతి లైసెన్స్ కూడా ఉంది. ‘600 రూపాయలకు తక్కువగా కిట్ల సరఫరాకు ఐసీఎంఆర్‌లో బిడ్లను దాఖలు చేశాం. మమ్మల్ని కాదని ఆర్క్ ఫార్మాష్యూటిక్స్కు ఎలా బిడ్డింగ్ ఖరారు చేశారో మాకు అర్థం కావడం లేదు’ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర జైస్వాల్ మీడియా ముందు వాపోయారు. (మాస్క్ మాటున నిశ్శబ్దంగా ఏడ్చాను) చెన్నైలోని ‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్’ కంపెనీకి కరోనా కిట్లను తయారు చేసే మూడు చైనా కంపెనీలతో ఒప్పందం ఉండడంతోపాటు దిగుమతి ఒప్పందం ఉంది. ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తుందనడానికి గుర్తుగా ఆ కంపెనీకి ‘యూరోపియన్ సర్టిఫికేషన్’ కూడా ఉంది. తాము కూడా 600 రూపాయలకు లోపే బిడ్డింగ్ వేశామని, అయినా తమకు రాలేదని, ఈ విషయమై ఐసీఎంఆర్ అధికారులను అడిగితే వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కంపెనీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్కే వేలు మీడియా ముందు ఆరోపించారు. కరోనాలో కొత్తగా ఆరు లక్షణాలు -
ర్యాపిడ్ టెస్టులపై ఐసీఎంఆర్ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ చర్యల్లో కీలకమైన ర్యాపిడ్ టెస్టులు రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిర్ధారణకు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్టుల ఖచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో ఎటువంటి లోపాన్ని విస్మరించవద్దు’ అని స్పష్టం చేసింది. కాగా, హాట్‌స్పాట్ కేంద్రాలు, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను పాలు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. (చదవండి: కరోనా రిలీఫ్ : కోలుకునే రేటు పెరిగింది) ఈక్రమంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లలో కోవిడ్ నిర్ధారణ ఖచ్చితత్వం కేవలం 5.4 మాత్రమే ఉందని రాజస్తాన్ తెలిపింది. దాంతోపాటు తమ రాష్ట్రంలో నేడు ర్యాపిడ్ టెస్టింగ్‌ను ఆపేసింది. ‘రాజస్తాన్‌తోపాటు మరో రెండు రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు వ్యక్తం చేశాయి. నిజానిజాలు కనుగొంటాం. అప్పటి వరకు వాటిద్వారా పరీక్షలు చేయొద్దు’అని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ హెడ్ డాక్టర్ గంగాఖేల్కర్ తెలిపారు. రెండు రోజులపాటు తమ ప్రతినిధులు అన్ని రాష్ట్రాలకు వెళ్లి టెస్టింగ్ కిట్ల పనితీరును పరిశీలిస్తారని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రక్త నమూనాలు తీసుకొచ్చి మరోసారి పరీక్షిస్తామని అన్నారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని.. ఒకవేళ టెస్టింగ్ కిట్లలో లోపాలు ఉంటే.. వాటిని రిప్లేస్ చేయాలని తయారీ కంపెనీని కోరతామని అన్నారు. (చదవండి: 500 దాటిన కరోనా మరణాలు) -
500 దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో ఏకంగా 1,324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో పోరాడి కన్నుమూశారు. గుజరాత్లో 10 మంది, మహారాష్ట్రలో 10 మంది, పంజాబ్‌లో ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, పశ్చిమబెంగాల్లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు, కర్ణాటకలో ఒకరు మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,116కు, మొత్తం మరణాల సంఖ్య 519కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 13,295 కాగా, కరోనా బాధితుల్లో 2,310 మంది చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. భారత్‌లో మొత్తం కరోనా బాధితుల్లో 77 మంది విదేశీయులున్నారు. అత్యధిక మరణాలు మహారాష్ట్రలోనే.. మొత్తం 519 కరోనా సంబంధిత మరణాల్లో 211 మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 70 మంది, గుజరాత్లో 58, ఢిల్లీలో 43, ఉత్తరప్రదేశ్‌లో 17, పంజాబ్‌లో 16, తమిళనాడులో 15, కర్ణాటకలో 14, పశ్చిమబెంగాల్లో 12, రాజస్తాన్‌లో 11 మంది చనిపోయారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,893, గుజరాత్లో 1,604, మధ్యప్రదేశ్‌లో 1,407, తమిళనాడులో 1,372, రాజస్తాన్‌లో 1,351, ఉత్తరప్రదేశ్‌లో 1,084, కేరళలో 400, కర్ణాటకలో 384, జమ్మూకశ్మీర్‌లో 341, పశ్చిమబెంగాల్లో 310, హరియాణాలో 233, పంజాబ్‌లో 219 కేసులు బయటపడ్డాయి. వ్యవసాయ రంగంలో అనుమతులు నాన్–కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.. హాట్స్పాట్లలో మాత్రం కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించుకోవచ్చని సూచించారు. హాట్స్పాట్లు, రెడ్జోన్లలో కరోనా పాజిటివ్ కేసులు 4 కంటే తక్కువ రోజుల్లోనే రెట్టింపు అవుతున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షల నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఆదివారం 37,173 పరీక్షలు నిర్వహించామని, ఇప్పటిదాకా 3,86,791 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. -
పరమౌషధం కానున్న ప్లాస్మా!
న్యూఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం తెల్సిందే. దీంతో కొన్ని సంస్థలు పరీక్షలు జరిపేందుకు ముందుకొచ్చాయి. ఈ వ్యవహారానికి తాజాగా సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్ రూపొందించిన ప్రొటోకాల్ ప్రకారం దీనికి అనుమతులిచ్చింది. సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదికలో ప్లాస్మా చికిత్స పరిశోధనలపై పనిచేయనున్న సంస్థల వివరాలు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ రెగ్యులేటరీ తెలిపింది. వాటిని తమ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించినట్లు వెల్లడించింది. డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్ రూల్స్ కింద అనుమతులిచ్చినట్లు స్పష్టం చేసింది. ఇదే ముందున్న మార్గమా? అమెరికా ఎఫ్.డీ.ఏ కన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్స ద్వారా కోవిడ్ వైద్యులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అయిదు మంది కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలు కలిగిన ప్లాస్మాను ఎక్కించారు. అందులో ముగ్గురు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరణాలు అసలులేకపోవడం ఆశాజనకంగా మారింది. మరోవైపు భారత్‌లో నలుగురు రోగులపై ప్లాస్మా చికిత్సను ప్రయోగించగా, వారిలో గర్భిణిసహా అందరూ కోలుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. -
ఆ 40 మందికి ఎలా సోకింది?
న్యూఢిల్లీ: వారు విదేశాలు వెళ్లిన దాఖలాలు లేవు.. చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగు వారెవరూ విదేశాల నుంచి రాలేదు.. ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందితోనూ సంబంధాలు లేవు..లేబొరేటరీల్లోనూ పని చేయలేదు..అయినా సరే 40 మందికి కరోనా సోకింది. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది..ఎందుకిలా?? ఇప్పుడిదే కేంద్రానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో (ఎస్ఏఆర్ఐ) బాధపడుతున్న వారిలో ఎంపిక చేసిన 5,911 మందికి ఐసీఎంఆర్ కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 40 మందికి వ్యాధిగ్రస్తులెవరితోనూ నేరుగా సంబంధాలు లేకపోవడం, విదేశాల నుంచి వచ్చిన చరిత్ర లేకపోవడం ప్రభుత్వానికి షాక్ కలిగించింది. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 52 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఐసీఎంఆర్ మెడికల్ జర్నల్‌లో వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ముఖ్యాంశాలు.. ► తీవ్రమైన శ్వాస కోశ సమస్యలతో బాధపడే రోగులకు (ఎస్ఏఆర్ఐ) మార్చి 14 కంటే ముందు కరోనా వైరస్ అసలు సోకలేదు. అదే ఏప్రిల్ 2 వచ్చేసరికి అలాంటి వారిలో 2.6% మందికి కోవిడ్–19 సోకింది. ► 50 ఏళ్లకు పైబడినవారిలోనూ, పురుషులపైనా ఈ వైరస్ పంజా విసురుతోంది. 50–59 ఏళ్ల మధ్య వయస్కుల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఎస్ఏఆర్ఐ రోగుల్లో 5,911 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 104 మందికి (1.4%) కరోనా ఉన్నట్టు తేలింది. ► ఈ కరోనా కేసుల్లో 40 మంది విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధాలు లేకపోయినా వైరస్ సోకింది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఇలాంటి కేసులున్నాయి. ► శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ కోవిడ్–19 బారిన పడిన వారిలో గుజరాత్ నుంచి అత్యధికంగా కేసులు (792) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు (577), మహారాష్ట్ర (533), కేరళ (503) ఉన్నాయి. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే కావడం గమనార్హం. నిబంధనలు కఠినతరం చేయాలి దేశవ్యాప్తంగా 36 జిల్లాల్లో ఎలాంటి లింకులు లేకపోయినా కరోనా వ్యాపించడంతో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. భారత్‌లో సమూహ వ్యాప్తికి ఇది సంకేతమని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సరిహద్దులు జాగ్రత్త బీఎస్ఎఫ్కు అమిత్ షా ఆదేశాలు న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంట చొరబాట్లను అడ్డుకునే దిశగా మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి సరిహద్దు భద్రతాదళాన్ని(బీఎస్ఎఫ్)ను ఆదేశించారు. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో, ముఖ్యంగా ఫెన్సింగ్ లేని ప్రాంతాలపై, మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ సరిహద్దుల్లో పరిస్థితిపై శుక్రవారం బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అమిత్ షా సమీక్ష జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో చొరబాట్లకు అవకాశం కల్పించకూడదని వారికి ఆదేశాలిచ్చారు. ఈ వివరాలను హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ మీడియాకు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 37,978 రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటయ్యాయని, వాటిలో 14.3 లక్షల మంది కార్మికులు, వలస కూలీలకు ఆశ్రయం కల్పించామన్నారు. ఎఫ్‌సీఐ ఉద్యోగులకు బీమా సౌకర్యం ► లక్ష మందికి పైగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) అధికారులు, కార్మికులకు రూ. 35 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ► ఉద్యోగులు తమ వేతనాల నుంచి యాజమాన్యాల ద్వారా పీఎంకేర్స్ నిధికి విరాళం ఇస్తున్నట్లయితే.. ఆ వివరాలను యాజమాన్యాలు ఆయా ఉద్యోగుల ఫామ్–16 టీడీఎస్ సర్టిఫికెట్లో చూపించాలని ఐటీ శాఖ కోరింది. ► దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితుల్లో వీధుల్లో తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పించేందుకు తీసుకున్న చర్యలను రెండు వారాల్లోగా వివరించాలని హోం శాఖను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ► మధ్యప్రదేశ్‌లో 75 వేల జనాభాకు ఒక వెంటిలేటర్, 47 వేల మందికి ఒక ఐసీయూ బెడ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తాజా అధికార గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 426 కరోనా కేసులు, 33 మరణాలు సంభవించాయి. -
కొవ్వుపై మెట్రోవాసుల్లో లవ్వు
న్యూఢిల్లీ: అధికశాతం కొవ్వును ఆహార రూపంలో తీసుకుంటున్న దేశంలోని ఏడు మెట్రోనగరాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్‌లు టాప్‌లో నిలిచాయి. హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నగరాల్లో అధిక కొవ్వు లభించే దాల్ ఫ్రై, స్టఫ్డ్ పరోటా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చుడువా, బిసి బిళే బాత్, చింతపండు పులిహోర అధికంగా తిం టున్నట్లు ఈ సర్వే నిర్వహించిన భారత మెడికల్ పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) తెలిపింది. అధికంగా వేయించిన ఆహారం ద్వారా ఎక్కువ కొవ్వు ఒంట్లో చేరినట్లు గుర్తించారు. నగరాల్లో దొరికే అన్ని మాంసాహారాల్లోనూ అధిక కొవ్వు ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని ప్రజలు దేశంలోని అందరికంటే అధికంగా రోజుకు 44.4, 43.9 గ్రాముల చొప్పున కొవ్వును తీసుకుంటున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ సేథ్ తెలిపారు. 36–59 వయసు ఉన్నవారు 36.1%, 18–35 వయసువారు 34.8% కొవ్వు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. మెట్రో నగరాల్లో అత్యంత తక్కువగా హైదరాబాద్‌లో ఒక్కో వ్యక్తి రోజుకు 25.1 గ్రాముల కొవ్వును తీసుకుంటున్నారు. మెట్రోల మొత్తం మీద సగటున ఒక్కో వ్యక్తి తీసుకుంటున్న కొవ్వు రోజుకు 32.6 గ్రాములుగా ఉంది. ఇది ఐసీఎమ్ఆర్ సూచించిన 20 గ్రాముల (రోజుకు) కంటే ఎక్కువ. సాధారణంగా మనిషికి రోజుకు 20 గ్రాములు చాలు. మాంసాహారుల కంటే శాకాహారులు పప్పు ధాన్యాల ద్వారా తీసుకుంటున్న కొవ్వుశాతం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇంట్లో చేసే ఆహారం, ప్యాక్ చేసిన ఆహారం, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు వంటి వాటి నుంచి ఈ కొవ్వు ఒంట్లో చేరుతున్నట్లు తేలింది. -
ఇక గర్భ నిరోధానికి ఇంజెక్షన్లు!
అనవసరంగా గర్భం రాకూడదనుకుంటే ఆడవాళ్లకు టూబెక్టమీ ఆపరేషన్ సహా పలు మార్గాలు ఉన్నాయి. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్స్, నిరోధ్‌లు. టూబెక్టమీ మినహా మిగతా అన్నింటి వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మగవాళ్లకు వాసెక్టమీ ఆపరేషన్‌తోపాటు నిరోధ్‌లు ఉన్నాయి. నిరోధ్‌ల వల్ల భావ సంతప్తి కలగదనే భావం చాలా మందిలో ఉండడంతో ఆడవాళ్లకు తరహాలో ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల కోసం భారత పరిశోధకులు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. చివరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ దిశగా 13 ఏళ్లపాటు ప్రయోగాలు నిర్వహించి ఇప్పుడు విజయం సాధించింది. గర్భ నియంత్రణ కోసం మగవాళ్లకు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టింది. ఈ ఇంజెక్షన్‌ను వరి బీజాలకు ఇస్తారు. అందుకు నొప్పి తెలియకుండా అనెస్తీసియా ఇవ్వాల్సి ఉంటుంది. వరి బీజం నుంచి వీర్యం బయటకు రాకుండా ఈ ఇంజెక్షన్ అడ్డుకుంటుందని సీనియర్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. చట్టబద్ధమైన మూడు ట్రయల్స్‌ను ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసిందని పాతికేళ్లపాటు ఈ విషయంలో పరిశోధనలు సాగించిన శర్మ చెప్పారు. ఈ ఇంజెక్షన్ ఉత్పత్తికి లాంఛనంగా భారత్ లైసెన్స్‌తోపాటు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్’ అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానుంది. అమెరికాలాంటి దేశాల్లో మహిళలు గర్భం రాకుండా 70శాతం మంది మాత్రలు, ఇంజెక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మహిళలు టూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. భారత్‌లో 50 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక మందులు, ఇంజెక్షన్లు వాడుతుండగా, మిగతా మహిళల్లో ఎక్కువ మంది మగవారి నిరోధ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్‌లో గణనీయంగా ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు కనుగొన్న ఇంజెక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రపంచంలో గర్భ నిరోధానికి మగవారికి ఇంజెక్షన్ పద్ధతిని ప్రవేశపెడుతున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించబోతోందని డాక్టర్ శర్మ తెలిపారు. 303 మందికి ఈ ఇంజెక్షన్ ఇవ్వగా 97.3 శాతం మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన చెప్పారు. -
పోషకాహార విలువలపై యాప్
హైదరాబాద్: జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ పేరుతో మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ యాప్ ప్రతి ఒక్కరికి ఒక న్యూట్రి షన్ గైడ్‌లా పనిచేయనుంది. ఒక వ్యక్తి ఏ ఆహారాన్ని ఎంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారంలో ఏయే మోతా దుల్లో పోషకాలు ఉంటాయనే విషయాలను దీని ద్వారా తెలుసుకుని, ఆయా పదార్థాలను తీసుకునే వీలుంటుం ది. పోషకాహార పదార్థాల పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే భారతీయులు సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాలు, వాటిలో కేలరీల శక్తి, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఏయే మోతాదుల్లో ఉంటాయి, అవి మన శరీరానికి ఏయే మోతాదుల్లో అవసరమనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆయా దేశాలు వారి ఆహా రపు అలవాట్లకు అనుగుణంగా ఇలాంటి న్యూట్రిషనల్ యాప్‌లను రూపొందించుకుని వినియోగిస్తున్నారు. అయితే భారతీయుల ఆహారపు అలవాట్లు, వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఇప్పటి వరకు ఇలాంటి యాప్‌లు అందుబాటులో లేవు. దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 14 భాషల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాప్‌లో.... ఈ యాప్‌లో నాకు కావాల్సిన పోషకాహా రాలు (మై న్యూట్రియెంట్స్ రిక్వైర్మెంట్స్) నా భోజనంలో పోషకాలు (న్యూట్రియెంట్స్ ఇన్ మై ఫుడ్), నా డైట్.. నా యాక్టివిటీ (మై డైట్ అండ్ యాక్టివిటీ), సెర్చ్ ఫుడ్ బై న్యూట్రిషన్, సెర్చ్ ఫుడ్ బై లాంగ్వేజ్ తదితర అంశాలు ఉన్నాయి. అవస రమైన దానిపై క్లిక్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. యాప్ ఉపయోగాలు... ఈ యాప్ వల్ల మనిషి తాను తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల గురించి సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ వయసు వారికి ఎన్ని కిలో కేలరీల ఆహారం అవసరం, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏ మేరకు పోషకాలు లభిస్తాయి అనే విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
నలుగురిలో ఒకరికి మధుమేహం..
సాక్షి, హైదరాబాద్: దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు.. ఇదీ దేశంలో నగరవాసుల పరిస్థితి. రోజువారీ అవసరాల కంటే తక్కువ మోతాదులో పోషకాలు, విటమిన్లు తీసుకుంటుం డటం ఈ పరిస్థితికి కారణం కావచ్చని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశంలోని నగరాల్లో నివసిస్తున్న వారి పౌష్టికత, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అంశాలపై విస్తృత అధ్యయనం నిర్వహించింది. 2015–16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.72 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనం.. ఆహారం విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటన్నది స్పష్టం చేస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లోని ప్రజలు ఒక రోజులో తీసుకుంటున్న ఆహారం ఆధారంగా ఆ సంస్థ ఓ నివేదిక రూపొందించింది. భారత వైద్య పరిశోధన సమాఖ్య నిర్దేశించిన మోతాదు లోనే నగర ప్రజలు తృణధాన్యాలు (రోజుకు 320 గ్రాములు), చిరుధాన్యాలు (42 గ్రా) తీసుకుంటున్నారు. ► పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, చక్కెర, బెల్లం వంటి వాటిని మాత్రం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా తీసుకుంటున్నారు. ► మూడేళ్ల లోపు పిల్లల్లో సగం మందికి, 4–6 ఏళ్ల మధ్య వయసు వారిలో మూడింట రెండొంతుల మందికి, గర్భి ణుల్లో 56 శాతం మందికి మాత్రమే రోజూ అవసరానికి తగ్గ మోతాదుల్లో ప్రొటీన్లు, కేలరీలు అందుతున్నాయి. ► ఐదేళ్ల లోపు పిల్లల్లో 25 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు. అలాగే 29 శాతం పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి తక్కువగా ఉంటోంది. ► పోషకాహార లేమి అనేది బాలికలతో పోలిస్తే బాలురలోనే (6–17 మధ్య వయసు) ఎక్కువగా ఉండటం గమనార్హం. ► బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లి స్తన్యం పట్టాలన్న సూత్రాన్ని నగర ప్రాంతాల్లో పాటిస్తున్న వారు 42 శాతం మంది మాత్రమే. నలుగురిలో ఒకరు తల్లి పాల కంటే ముందుగా తేనె, గ్లూకోజ్, చక్కెర నీరు, మేకపాలు వంటివి పడుతున్నారు. ► నగరాల్లో నివసిస్తున్న పురుషుల్లో 31 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, మహిళల్లో ఈ సంఖ్య 26 శాతంగా ఉంది. అధిక రక్తపోటు సమస్య కేరళలో అత్యధికంగా ఉంటే.. అత్యల్పం బిహార్ రాష్ట్రంలో నమోదైంది. ► నగరాల్లోని పురుషుల్లో 22 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, మహిళల్లో 19 శాతం మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
వైద్యులకు ‘క్రెడిట్’ గంటలు!
* ఐదేళ్లలో కనీసం 30 గంటలు ఉండాలి * లేదంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్ కుదరదు * భారతీయ వైద్య మండలి సరికొత్త నిబంధన * డాక్టర్ల వృత్తి నైపుణ్యం పెరగాలనే: ఎంసీఐ సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త రోగాలు పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్యులు వృత్తి కౌశలాన్ని పెంపొందించుకునేలా భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) చర్యలు చేపట్టింది. మారుతున్న పరిస్థితులతోపాటు వైద్యులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఇకనుంచి ప్రతి వైద్యుడూతన ప్రతిభను గుర్తించే పని గంటలను(క్రెడిట్ అవర్స్) నిర్దేశిస్తూ ఎంసీఐ నిబంధన విధించింది. వైద్య వృత్తిలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులు, పరిశోధనలపై వైద్యులు నైపుణ్యం పెంచుకోవడానికి క్రెడిట్ అవర్స్ తప్పనిసరి చేసింది.ఈ విధానం వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమలు కానుంది. అమెరికా, ఐరోపాలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 80 వేల మంది డాక్టర్లు ఉన్నట్టు అంచనా. వీరంతా క్రెడిట్ అవర్స్ సొంతం చేసుకుంటేనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. సరైన క్రెడిట్ అవర్స్ లేకుంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు అవకాశం ఉండదు. అందరు డాక్టర్లకూ ఇది వర్తిస్తుంది. ఇక ఐదేళ్లకోసారి రెన్యువల్ తప్పనిసరి వైద్యులు ఇప్పటివరకు ఒక్కసారి ఎంసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అదనపు డిగ్రీ పొందినప్పుడు మాత్రం ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇకపై అలా కుదరదు. ప్రతి ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాల్సిందే. 30 గంటల క్రెడిట్ అవర్స్ చూపకుంటే రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు అనుమతించరు. ఎంసీఐ రెన్యువల్ చేయకుంటే వైద్యుడు ప్రాక్టీస్ చేయటం, కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయటానికి అనుమతించరు. సదస్సులు, సెమినార్లకు హాజరు కావడం, రీసెర్చ్ పేపర్లు, థీసిస్‌లు రూపొందించటం ద్వారా వైద్యులకు వైద్య విధానాలపై సరైన అవగాహన ఉంటుందని ఎంసీఐ చెబుతోంది. క్రెడిట్ అవర్స్ అంటే? ఎంసీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ అవర్స్ అంటే వైద్య పట్టా పుచ్చుకున్న ప్రతి డాక్టర్ తన వృత్తిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిణితి సాధించడం. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొనటం ద్వారా వీటిని సాధించవచ్చు. థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్ సమర్పించటం ద్వారా కూడా లభిస్తారుు. ప్రతి వైద్యుడూ రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి , రెన్యువల్ చేసుకునే నాటికి నిర్దేశిత క్రెడిట్ అవర్స్ పొంది ఉండాలి. లేదంటే ఆ రిజిస్ట్రేషన్‌ను ఆమోదించరు. సాధించటం ఎలా? * డాక్టర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొని తమ వంతు పాత్ర పోషిస్తే క్రెడిట్ అవర్స్ లభిస్తాయి. * సెమినార్ లేదా సదస్సు కచ్చితంగా 8 గంటల పాటు నిర్వహించాలి. ఎనిమిది గంటలు డాక్టరు పాల్గొంటే 4 క్రెడిట్ అవర్స్ ఇస్తారు. * ఎంసీఐ అనుమతి ఇస్తుంది. సదస్సు తీరుపై పరిశీలన చేసి క్రెడిట్ అవర్స్ నిర్ణయిస్తుంది. * అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లకు ఒక్కో సదస్సుకు రెండు క్రెడిట్ అవర్స్ ఇస్తారు * థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్‌లో పబ్లికేషన్లకూ ఈ గంటలు వర్తిస్తాయి. వీటి స్థాయిని బట్టి క్రెడిట్ అవర్స్ నిర్ణరుుస్తారు. * పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య పూర్తిచేసిన ప్రతి వైద్యుడికీ ఏడాదికి 4 గంటల క్రెడిట్ అవర్స్‌ను ఉచితంగా ఇస్తారు. వీరు నిరంతర పాఠ్యాంశాలు, కొత్త వైద్యవిధాన పద్ధతులు అనుసరిస్తున్నందున ఈ సౌకర్యం కల్పించారు. * కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరికైనా క్రెడిట్ అవర్స్ నిబంధన వర్తిస్తుంది. * ప్రతి వైద్యుడు ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్‌ను కచ్చితంగా సొంతం చేసుకోవాలి. -
వైరల్ వ్యాధులపై పరిశోధనలకు నిధులు
విజయవాడ, న్యూస్‌లైన్: మొండి వ్యాధులపై పరిశోధనలకు విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నుంచి భారీగా నిధులు అందనున్నాయి. ప్రవేశాలు, పరీక్షలు నిర్వహిండానికే పరిమితమైన ఈ యూనివర్శిటీ ఇక పరిశోధనలకూ పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో 2014 చివరినాటికి మూడు మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్ (ఎండీఆర్‌యూ)లు ఏర్పాటు కానున్నాయి. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల (విజయవాడ), ఉస్మానియా వైద్య కళాశాల (హైదరాబాద్), శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల(తిరుపతి)లలో ఏర్పాటయ్యే ఈ యూనిట్లకు ఒక్కో దానికి రూ.5.25 కోట్ల నిధులు ఐసీఎంఆర్ నుంచి అందనున్నాయి. కాంట్రాక్టు సిబ్బంది నియామకానికి రూ.19 లక్షలు, రసాయనాలకు మరో రూ.15 లక్షలూ అందుతాయి. మూడేళ్ల ప్రోగ్రామ్ కింద అంటువ్యాధులు కాని వ్యాధులైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కేన్సర్, గుండె జబ్బులపై ఫ్యాక ల్టీ పరిశోధనలు చేస్తుంది. మూడు స్థాయిల్లో వైరాలజీ ల్యాబ్‌లు... రీజియన్ల వారీగా మూడు స్థాయిల్లో నెట్వర్క్ వైరల్ ల్యాబొరేటరీస్‌ను ఐసీఎంఆర్ నెలకొల్పనుంది. చెన్నైలో ప్రాంతీయ ప్రయోగ శాలను, దానికి అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో 150 వైరాలజీ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో ఉస్మానియా వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి ప్రయోగశాలగా అనుమతి లభించింది. ఉస్మానియా వైద్య కళాశాల పర్యవేక్షణలో రాష్ట్రంలో మరో 11 వైద్య కళాశాలల్లో కళాశాల స్థాయి ప్రయోగశాలలు ఏర్పాటు కానున్నాయి. అంటువ్యాధుల నివారణ, వైద్యపరంగా జాతీయ విపత్తులు (మొదడువాపు, ఫైలేరియా, ఆంత్రాక్స్, స్వైన్‌ఫ్లూ, కొత్తకొత్త అంటువ్యాధులు ప్రబలడం) సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఈ నెట్వర్క్ ల్యాబ్‌లు ప్రభుత్వానికి తోడ్పడతాయి.