ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సుమారు మూడు నెలలుగా గుంటూరు రేంజ్ పరిధి ఆందోళనలు నిర్వహిస్తున్న ఉద్యమకారులపై ఇప్పటి వరకు మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో మొత్తం 1067 మందిని అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. రేంజ్‌లోని గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ప్రసుతం ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో కేంద్ర బలగాలను సగానికి తగ్గించి వెనక్కు పంపారు. మిగిలిన వారిని సమస్యాత్మక ప్రా ంతాల్లో వినియోగిస్తున్నారు. రేంజ్ పరిధిలో అధికంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 40కిపైగా కేసులు నమోదు చేసి 380 మందిని అరెస్టు చేశారు. తర్వాతి స్థానాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు అర్బన్ జిల్లాలు నిలిచాయి. గుంటూరు రూరల్ జిల్లాలో కేసులు నామమాత్రంగా ఉన్నాయి. శాంతిభద్రతల పరిస్థితి, అధికారుల పనితీరు తదితరాలను స్వయంగా పరిశీలించేందుకు బుధవారం ఐజీ సునీల్‌కుమార్ ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వెళ్లారు.