ఆధార్ అనుసంధానం తప్పనిసరి
డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి
నెల్లూరు(టౌన్): సంక్షేమ ఫలాలు పేదప్రజలకు అందాలంటే ఆధార్ నంబర్‌ను అనుసంధానించాల్సిందేనని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి అన్నారు. కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఆధార్ సీడింగ్, రేషన్ కార్డుదారుల సమస్యల పరిష్కారానికి ఈపీడీ పద్ధతి అంశాలపై తహశీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్యాస్, రేషన్, పింఛన్ ఇలా అన్ని రకాల సబ్సిడీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అన్నారు. ఇందుకు అధికారులు పక్కాగా చర్యలు చేపట్టి అందరి ఆధార్‌నంబర్‌ను రేషన్ కార్డులతో అనుసంధానం చేయాలన్నారు. రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికి ఎవరూ తహశీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.
కార్డును బదిలీ చేయించుకోవాలనుకున్నా, ఇతర సభ్యుల పేర్లును చేర్పించుకోవాలన్నా, డూప్లికేట్ కార్డును పొందాలన్నా, తప్పొప్పులను సరిచేసుకోవాలన్నా మీ సేవ కేంద్రాల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్తగా వచ్చిన ఈపీడీ (ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్) పద్ధతిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ పద్ధతిలో ఉన్న 9 అంశాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తహశీల్దార్లకు అర్థమయ్యే రీతిలో వివరించారు. జేసీ రేఖారాణి మాట్లాడుతూ జిల్లాలో అసలు ఆధార్ కార్డులు పొందని వారు అనేక మంది ఉన్నారన్నారు.
త్వరగా వారందరికి కార్డులు తీయించి ఆధార్ నంబర్‌ను అనుసంధానించేదానికి ఇప్పటి వరకు ఆధార్ పొందిన, అనుసంధానించిన వారి జాబితాను ఇవ్వాలని డిప్యూటీ డెరైక్టర్‌ను కోరగా అందుకు ఆమె సమ్మతించారు. డీఎస్‌ఓ శాంతకుమారి, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ధర్మారెడ్డి, ఏఎస్‌ఓ శంకరన్ పాల్గొన్నారు.