జిల్లాకు చేరిన యూరియా
1518 టన్నులు సరఫరా
ప్రొద్దుటూరు:
జిల్లాకు కొంతమేరకు యూరియా కొరత తీరినట్టే. యూరియా సరఫరా కావడంతో రైతుల ఇబ్బందులు తీరుతాయి. ముఖ్యంగా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగా వరి పంటను సాగు చేస్తున్నారు. దీంతో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇతర పంటల సాగుకు యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 20 రోజులుగా యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లోని రైతులు యూరియా కోసం కర్నూలు జిల్లాకు సైతం వెళ్లారు.
ఈ సమస్యపై ‘యూరియా లేదయా’ అనే శీర్షికతో ఈనెల 1న సాక్షిలో ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఆదివారం జిల్లాకు యూరియాను తెప్పించారు. కాకినాడ నుంచి వ్యాగన్‌లోడ్ నాగార్జున నీమ్‌కోటెడ్ యూరియా కడపకు వచ్చింది. మొత్తం 1518 టన్నుల యూరియా రాగా రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాధికారులు జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు ఆదివారమే తరలించారు. ఇందులో 400 టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేశారు. కాగా యూరియా ధర విషయంలో కూడా వివాదం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించాలని వ్యవసాయాధికారులు, తమకు గిట్టుబాటు కాదని ఇటు వ్యాపారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుకాణాలకు ఆదివారం సాయంత్రానికే యూరియా చేరింది. యూరియా బస్తా ధర ఏవిధంగా అమ్ముతారనే విషయం చర్చాంశనీయంగా మారింది.