నుజ్జునుజ్జు అయిన అంబులెన్స్
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇసుకగుంట సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాళహస్తి రూరల్ సీఐ అబ్దుల్‌గౌస్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ దక్షిణ బజారువీధికి చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు అనిల్ బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్బారావుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు.
ఇటీవల సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అతన్ని భార్య పద్మావతి బెంగళూరులో ఉన్న కుమారుడి దగ్గరకు తీసుకెళ్లారు. కుమారుడు తన తండ్రిని కొలంబియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో స్వగ్రామానికి తిరిగి పంపించేందుకు బెంగళూరులోని మాండ్యా జిల్లా పాండూపూర్ ప్రాంతానికి చెందిన అంబులెన్స్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు.
ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సుబ్బారావు(59), పద్మావతి(54), అనిల్(31), అంబులెన్స్ డ్రైవర్ గిరీష్(27), అతని స్నేహితుడు సందేష్(26) గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో ఉన్న వంతెన వద్ద శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని అంబులెన్స్ ఢీకొంది.
సుబ్బారావు, అంబులెన్స్ డ్రైవర్ గిరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బారావు భార్య పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు. అనిల్, సందేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment