ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు కోసమే ఆంటోని కమిటీని నియమించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఆంటోని కమిటీ వేసారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. బుధవారం మీడియాకు వివరణ ఇచ్చిన ఆయన తెలంగాణకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు. కేంద్రం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓ కమిటీని ఏర్పాటు చేసారన్నారు.
కాగా, పార్టీ నేతల్లో అపోహలు నెలకొన్నందున వాటిని తొలగించేందుకు ఆంటోని కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన ప్రక్రియపై నెలకొన్న అపోహలపై ఆయన బుధవారం ఆచితూచి స్పందించారు. విభజన ప్రక్రియ ఆగిందా.. లేదా అనేది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ను అడిగితే తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ ఎంపీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహిరిస్తే టిక్కెట్టు ఇవ్వనన్న చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలపై ఏం చర్యలు తీసుకుంటారని పొన్నం ప్రశ్నించారు.