ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల మధ్య తిరుగుతున్న రెండు ప్రాంతాల ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ఉన్న పర్మిట్‌ను మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి విభజన అధికారికం కానుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నుంచి తెలంగాణకు దాదాపు 2 వేలకుపైగా బస్సులు తిరుగుతుండగా, తెలంగాణ నుంచి సీమాంధ్రకు అందులో మూడోవంతు కూడా వెళ్లటం లేదు. దీంతో రెండు రాష్ట్రాలకు ఆ బస్సులను జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలనే విషయంలో వివాదం కొనసాగుతోంది.
జూన్ 2 నుంచి సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటామని కొందరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పర్మిట్లను మరో ఏడాది వరకు కొనసాగించొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వు జారీ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొలువు దీరిన తర్వాత పర్మిట్ల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అందులో పేర్కొంది.