అమలాపురం (తూర్పుగోదావరి) : మానవ హక్కుల చైర్మన్ పదవిని... హోంమంత్రితో చుట్టరికం పేరు అడ్డుపెట్టుకుని జిల్లాలో దందాలకు దిగిన మాయల మరాఠి పేరాబత్తుల అవినాష్ దేవ్ చంద్ర చేసిన తప్పులకు తప్పుకోలేని పరిస్థితుల్లో... తనను కాపాడే దారులన్నీ మూసుకుపోవటంతో ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో స్వచ్చందంగా సరెండరయ్యాడు. అవినాష్ అక్రమాలు, అడ్డాలు నాలుగు రోజుల కిందట ప్రసార మాద్యమాలు తూర్పారబెట్టడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ మాయలోడు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో జల్లెడపట్టాయి. అతను హైదరాబాద్‌లోనే కొన్ని అదృశ్య శక్తుల నీడలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో ఆ నగరానికి జిల్లా నుంచి పోలీలు బృందాలు మూడు రోజుల కిందటే వెళ్లి గాలిస్తున్నాయి. ఇంతలో అవినాషే డీజీపీ కార్యాలయంలో లొంగిపోయి అతని ఆచూకీ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించాడు.
అయితే తొలి నుంచీ అవినాష్‌కు అండగా నిలుస్తున్న టీడీపీ ప్రభుత్వంలోని ఓ అదృశ్య శక్తి ఏదో అతని సరెండర్ ప్యూహంలోనూ తెరవెనుక పనిచేసినట్లు తెలుస్తోంది. అవినాష్ తాను చేసిన మోసాలు, అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటం... హోంమంత్రి బంధువంటూ చెలరేగిపోవటంతో ఇప్పుడు అతడ్ని బహిరంగంగా... ప్రత్యక్షంగా కాపాడే అవకాశాలు ఆ అదృశ్య శక్తికి సన్నగిల్లాయి. దీంతో ఎంతటి అజ్ఞాతంలో ఉన్నా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పన్నిన నిఘా వలకు ఒకట్రెండు రోజుల్లో అవినాష్ చిక్కక తప్పేదికాదు. ఈ క్రమంలో అతడికి అండగా అదృశ్య శక్తులే సరండర్‌కు స్కెచ్ గీశారని తెలుస్తోంది. అతను అజ్ఞాతంలో ఉండేగొలదీ ప్రభుత్వానికి అప్రదిష్ట పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సరెండరై ఈ కరెప్షన్ కధను కంచికి పంపాలని... ఈ ప్రచారాలకు తెరదించాలనే స్వచ్ఛంద లొంగుబాటును అనివార్యం చేశారు. అవినాష్ అక్రమాలు వెలుగు చూసిన 72 గంటల్లో ఆ టక్కరిని అదుపులోకి తీసుకోవటంతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఊపిరిపోల్చుకుంటోంది.
ఊపిరి పీల్చుకున్న బాధితులు
అవినాష్ దౌర్జన్య దృశ్యాలు టీవీలో చూసి అతనికి భయపడి ఫిర్యాదు చేసేందుకు జంకిన జిల్లాలోని బాధితులు అతను పోలీసులకు సరెండర్ కావడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. మొన్నటి వరకు అవినాష్ వల్ల ఎన్ని ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైనా ఆ బాధను అతని ఆగడాలకు దడిసి గుండెల్లో దాచుకున్నారు. ఫిర్యాదు చేస్తే రాజకీయ అండతో తమనేంచేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పోలీసుల అదుపులోకి రావడంతో బాధితుల్లో కొంత ధైర్యం కనిపిస్తోంది. అతని బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఇక ముందుకు రావచ్చునని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి
హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్‌ను విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీసు బందోబస్తుతో గురువారం మధ్యాహ్నమే అక్కడ నుంచి పెద్దాపురానికి తరలించే ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం సీఐ శివకుమార్‌కు డీజీపీ కార్యాలయ అధికారులు ఆ నిందితుడిని అప్పగించారు. రాజమండ్రి నుంచి ఒకటి, పెద్దాపురం నుంచి రెండు కేసులు అవినాష్‌పై నమోదు కావడం... మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉండడంతో విచారణ నిమిత్తం అవినాష్‌ను హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి తీసుకువస్తున్నారు.
అవినాష్‌కు అంగుళూరులో ఆధార్
అవినాష్‌కు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం చిరునామాతో ఆధార్ కార్డు, రేషన్‌కార్డు ఉంది. కొన్నేళ్ల క్రితం కోనసీమ నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడానికి వలస వెళ్లిన అవినాష్ కుటుంబానికి అంగుళూరు గ్రామంలో బంధువులు ఉన్నారు. అతని అమ్మమ్మది ఆ గ్రామమేనని తెలిసింది. అయితే ఆధార్ కార్డులో అతని వయసు 1990 జనవరి 4న పుట్టినట్టుగా ఉంది. ఆలెక్కన అతని వయసు ప్రస్తుతం 25ఏళ్లు ఉండాలి. అయితే అతని వయసు 32ఏళ్లు కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ పొందేందుకు అవినాష్ ఇక్కడ ఆధార్ పుట్టించుకున్నాడా అనే అనుమానాలు ఆ గ్రామంలో గురువారం ప్రజల నుంచి వ్యక్తమవడం గమనార్హం.
టక్కరి దొరికాడు
Published Thu, Mar 12 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement