ఇన్‌పుట్ సబ్సిడీని రికవరీ చేస్తారా?
Published Thu, Dec 5 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
తొండంగి, న్యూస్‌లై న్ : ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని కూడా బ్యాంకు అధికారులు రికవరీకి ప్రయత్నించడంపై అన్నదాతలు మండిపడ్డారు. బుధవారం తొం డంగిలోని కార్పొరేషన్ బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. గతంలో సంభవించిన నీలం తుపాను నష్ట పరిహా రాన్ని ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. ఇలా బ్యాం కుకు సుమారు కోటి రూపాయలు విడుదలయ్యాయి. పరిహారం కోసం తమ ఖాతాల నుంచి సొమ్ము తీసుకునేందుకు రైతులు బ్యాంకుకు వెళ్లగా, అవి పాత బకాయిలకు జమ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు.
దీంతో తొండ ంగి, కృష్ణాపురం, శృంగవృక్షం తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా రైతులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తొండంగి సర్పంచ్ పెదిరెడ్ల సురేష్, వైఎస్సార్ సీపీ నాయకుడు శివకోటి ప్రకాష్, సీపీఐ తుని ఏరియా కోఆర్డినేటర్ శివకోటి రాజు, నాగం నాగబాబు తదితరులు బ్యాంకు అధికారులతో చర్చించారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ ఎక్కువ కావడంతో, వాటిని తీర్చాలని మాత్రమే చెప్పామని బ్యాంకు అధికారులు వివరించారు. బ్యాంకు ఇచ్చిన రుణాలకు, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సొమ్ముకు సంబంధం ఏమిటని రైతులు నిలదీశారు. ఏ విధమైన ఆంక్షలు లేకుండా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామని బ్యాం కు మేనేజర్ సతీష్ చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. నీలం పరిహారంలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, వినతిపత్రం సమర్పించారు.
Advertisement