తలచిందొకటి అయ్యిందొకటి!
మహబూబ్‌నగర్ : బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ నాగం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ నగారా సమితి పేరుతో తిరిగి పోటీచేసి ఘనవిజయం సాధించారు. రానున్న సార్వత్ర ఎన్నిల్లోగా జిల్లాలో తన బలం నిరూపించుకోవాలంటే ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విధితమే.
ఆయన ఆ పార్టీ తరఫున మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తానని కూడా ప్రకటించారు. అయితే మహబూబ్‌నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పోటీచేస్తారని ప్రచారం జరగడంతో నాగం బీజేపీ తరఫున పోటీచేయాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ బయటకు చెప్పకుండా ఇప్పటికీ ఎంపీగానే పోటీచేస్తానని చెబుతుంటారు. అయితే ఆశించిన స్థాయిలో తమ నాయకునికి పార్టీలో తగు ప్రాధాన్యం దక్కడంలేదని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇందులో భాగంగానే గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో నిర్మించతలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా విగ్రహ నిర్మాణ లక్ష్యంగా నిర్వహించిన పార్టీ దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు హాజరుకావాలంటూ నాగం జనార్దన్‌రెడ్డికి పిలుపు అందలేదు.
దీంతో పాటు బీజేపీ నేతల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా నాగంను ఆహ్వానించలేదని అనుచరవర్గం తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. కాగా, నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అంతకుముందు పార్టీలో కొనసాగుతున్న వారెవరూ కూడా ఆయనను కలవడం లేదు. పార్టీ పరంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా మొదటి నుంచీ బీజేపీలో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్న కేడర్ మాత్రమే ప్రస్తుతం కూడా తిరుగుతున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పాత బీజేపీ, కొత్త బీజేపీ అని ఇరువర్గాల మధ్య విభజన రేఖ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. అవును ప్రస్తుతం పార్టీలో ఆ పరిస్థితి కొనసాగుతోందని బహిరంగంగా వెల్లడిస్తున్నారు.
అసంతృప్తి లేదు
బీజేపీలో నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. తెలంగాణ జిల్లాలో బీజేపీ బల పడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా..ఇందులో భాగంగానే పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నిజామాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో పర్యటించాను. పార్టీ పరంగా అసంతృప్తిగా ఉన్నానని వస్తున్నవి పుకార్లు మాత్రమే. -నాగం జనార్దన్‌రెడ్డి,
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
నాగంకు మంచి స్థానమే ఉంది
బీజేపీ నాగం జనార్దన్‌రెడ్డికి ఇప్పటివరకు మంచి స్థానమే కల్పించింది. ఆయన రాజకీయంగా అపారఅనుభవం ఉన్న వ్యక్తి. నేను కూడా ఆయన్ను గౌరవిస్తా. నేను ఇప్పటికీ నాగం జనార్దన్‌రెడ్డిని రాష్ట్రస్థాయి నాయకుడిగానే చూస్తా. ఎవరో కొందరు కిందిస్థాయి కార్యకర్తలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. -యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే