
తిరుమల బస్సులు వెళ్తున్నాయి
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగిపోయినట్లు టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కనుమూరి బాపిరాజు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది అలిపిరి నుంచి తిరుమలకు బస్సులు నడిపించేందుకు దయతో అంగీకరించారని, అందువల్ల తిరుమల వెళ్లే భక్తులు సులభంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు బాపిరాజు తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ నివాసంలో సమావేశం అయిన తర్వాత పార్లమెంటు వద్దకు చేరుకున్న ఆయన.. 'సాక్షి'తో మాట్లాడారు. యూపీఏ-2 ప్రభుత్వం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే తమ పార్టీ ఎంపీందరికీ ఈ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలంటూ విప్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ, దేశం మొత్తానికి సంబంధించిన, జాతి ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు కాబట్టి దీనికి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు చూచాయగా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో కూడా ఈ మేరకు చర్చించినట్లు తెలుస్తోందని, అందరూ కూడా ఈ బిల్లుకు సహకరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర విభజన విషయమై ఆయన మాట్లాడుతూ గతంలో తాను వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశానని, అప్పట్లో మొత్తం ఆదాయంలో దాదాపు 75 శాతం హైదరాబాద్ నుంచి, మిగిలిన దాంట్లో కూడా సింహభాగం సీమాంధ్ర నుంచి వచ్చేదని, అతి తక్కువ వాటా మాత్రమే తెలంగాణ నుంచి వచ్చేదని ఆయన చెప్పారు.