మోదీ చెబితే గానీ... కదలని బాబు!
హుదూద్ తుఫాను తాకిడితో విలవిల్లాడుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు చూసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబితేనే తప్ప.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి కదల్లేదా? ఢిల్లీ బీజేపీ వర్గాలు ఈమాటే చెబుతున్నాయి. హుదూద్ తుఫాను ఎప్పుడు తీరం దాటుతుందన్న విషయం ముందుగానే వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో విలయం సృష్టించడం ఖాయమని సాక్షాత్తు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా వెల్లడించింది. ఆ తర్వాత అక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యమని అందరూ అన్నారు.
ముందు జాగ్రత్త ఉన్నవాళ్లయితే.. అక్కడ సహాయక చర్యలు చేపట్టాలనుకుంటే ముందుగానే అక్కడకు చేరుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ సమయానికి హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక్కడ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులు, ఇతర మార్గాల ద్వారా అధికారులకు సూచనలు ఇస్తున్నారు. కానీ.. అక్కడ తుఫాను ప్రళయం సృష్టించిందని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. వెంటనే అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఫోన్ చేసి కనుక్కున్నారట.
హైదరాబాద్ లో ఉన్నానని చంద్రబాబు చెప్పడంతోనే షాక్ తిన్న మోదీ.. తుఫాను ప్రభావం హైదరాబాద్పై ఉందా అని అడిగారట. లేదని చెప్పగానే.. అయితే మీరు వెంటనే ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పండి ..సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించండి అని సూచించారట. మోదీ ఫోనులో చెబెతే కానీ ఉత్తరాంధ్ర పరిస్థితి తీవ్రం చంద్రబాబుకు అర్ధం కాలేదేమోనని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.