'గురు శిష్యులు ఘర్షణ మానుకోవాలి'
హైదరాబాద్ : గురుశిష్యులైన చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు ఘర్షణ మానుకుని, తెలంగాణలో కరెంట్ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ హితవు పలికారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల సీఎంలో కొట్లాటలు మాని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్పత్తికి సహకరించుకోవాలని సూచించారు.
కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. రైతులకు భరోసా ఇవ్వటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని డీఎస్ ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఎజెండాతో కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలో చేరితేనే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇస్తామనటం సరికాదన్నారు.
మన రాష్ట్రం-మన పాలన అని తెలంగాణను తెచ్చుకుంటే ప్రభుత్వం తీరు తలకొట్టుకునేలా ఉందని డీఎస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమనటం అర్థరహితమన్నారు. కొత్త సర్కార్ పూర్తిగా అటకెక్కిందని, ఇప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ లేదని అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రత్యామ్నాయమే లేదని డీఎస్ అన్నారు. గాంధీ కుటుంబ పాలనను కోరుకుంది ప్రజలే కానీ....నేతలు కాదని డీఎస్ పేర్కొన్నారు.