అంతా మోసమే | Chandrababu Govt Fraud to the Indo UK Hospital Management | Sakshi
Sakshi News home page

అంతా మోసమే

Published Sat, Sep 7 2019 4:59 AM | Last Updated on Sat, Sep 7 2019 9:20 AM

Chandrababu Govt Fraud to the Indo UK Hospital Management - Sakshi

పెట్టుబడిదారులతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. దీంతో అమరావతిలో ఆస్పత్రి ఏర్పాటుపై వెనక్కి తగ్గి  దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.    
– అజయ్‌ రంజన్‌ గుప్తా,ఎండీ, సీఈఓ, ఐయూఐహెచ్‌

సాక్షి, అమరావతి: అదిగో అమరావతి...ఇవిగో భూములు పెట్టుబడులు పెట్టండి... కానీ షరతులు వర్తిస్తాయి! ఇదీ పెట్టుబడుల ఆకర్షణ ముసుగులో చంద్రబాబు సర్కారు గత ఐదేళ్లలో సాగించిన దందా. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ల మాయలో చిక్కుకుని  కొందరు పెట్టుబడిదారులు రూ.కోట్లు చెల్లించారు... తీరా చూస్తే అమరావతిలో భూములు లేవు. చంద్రబాబు కోటరీ షరతులు తెలిసి పెట్టుబడిదారులు నివ్వెరపోయారు. తమకు రూ.వందల కోట్లలో కమీషన్లు, వాటాలు కావాలని బాబు కోటరీ పట్టుబట్టింది. అందుకు ఒప్పుకోని పెట్టుబడిదారులను ముప్పుతిప్పలు పెట్టారు. ఇదీ అమరావతిలో చంద్రబాబు పెట్టుబడుల కథ. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత ఐదేళ్లలో ఎన్నో సంస్థలు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని భావించిన ‘ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌’ సంస్థకు ఎదురైన అనుభవమే ఇందుకు తార్కాణం. 

చంద్రబాబు ప్రభుత్వం బురిడీ కొట్టించిందిలా...
టీడీపీ ప్రభుత్వం 2016లో లండన్‌లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అద్భుత రీతిలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెబుతూ గ్రాఫిక్కులతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఎంత భూమి కావాలంటే అంత ఇస్తామని, అన్ని అనుమతులను 21రోజుల్లోనే మంజూరు చేస్తామని అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. దీన్ని నమ్మిన ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఐయూఐహెచ్‌) అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థకు అమరావతిలో 150 ఎకరాలకు కేటాయించేందుకు 2017లో అంగీకరించింది. తొలుత 50 ఎకరాలు కేటాయించడంతో ఐయూఐహెచ్‌ 2017లొ సీఆర్డీఏకు డిపాజిట్‌ కింద రూ.25 కోట్లు చెల్లించింది. కానీ సీఆర్‌డీఏ భూమిని మాత్రం చూపించలేదు. ఐయూఐహెచ్‌ ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బృందం చుట్టూ మూడేళ్లపాటు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం శూన్యం. 

మోసం బట్టబయలు...
చంద్రబాబు సర్కారు తమకు చేసిన భూకేటాయింపులు, ఇతర డాక్యుమెంట్లను న్యాయ నిపుణులతో పరిశీలించుకున్న ఐయూఐహెచ్‌ నిర్ఘాంతపోయింది. భూమిపై నిజమైన యాజమాన్య, విక్రయ హక్కులు లేకుండానే భూమిని కేటాయించినట్లు వెల్లడైంది. అబద్ధపు సమాచారం, ప్రజెంటేషన్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఐయూఐహెచ్‌ గుర్తించింది. దీనిపై చర్చించేందుకు ఆ  సంస్థ ఎండీ అండ్‌ సీఈవో అజయ్‌ రంజన్‌ గుప్తా, లీగల్‌ కౌన్సిల్‌ సాల్మన్‌ వ్యారిస్‌ ఇతర ఉన్నతాధికారులు పలుసార్లు అమరావతికి వచ్చినా సరైన స్పందన లేకపోవడంతో వెనుతిరిగారు. 2018 అక్టోబర్‌ 3న ఒకసారి, 2019లో మరోసారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశాలు ఏర్పాటు చేసినా చివరి నిమిషంలో రద్దయ్యాయి. కేటాయించిన భూమి చూపించకుండా, కట్టిన డిపాజిట్‌కు సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం మూడేళ్లు కాలయాపన చేసింది. సంస్థ ప్రతినిధులు చంద్రబాబు, ఆయన బృందం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదు. లీగల్‌గా తనకు సంక్రమించని భూమిని ప్రైవేట్‌ కంపెనీకి ఎలా కేటాయించారని,  ఒప్పందం ఎలా చేసుకున్నారని ఆ సంస్థ పలుమార్లు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  తమ పరిస్థితి ఏమిటని గత ప్రభుత్వానికి 40కిపైగా లేఖలు రాసినా స్పందించలేదు. 

రూ.150కోట్లు కమీషన్‌... 25శాతం వాటా
రాజధానిలో భూమి కేటాయించేందుకు, అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సహకరించాలంటే ‘షరతులు’ వర్తిస్తాయని చంద్రబాబు కోటరీలోని ముఖ్యులు ఐయూఐహెచ్‌ ప్రతినిధులకు అసలు విషయం చల్లగా చెప్పారు. ఎకరాకు రూ.కోటి చొప్పున 150 ఎకరాలకు రూ.150 కోట్లు కమీషన్‌ కావాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. దాంతోపాటు అమరావతిలో నెలకొల్పే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 25 శాతం వాటా కూడా కావాలని తేల్చిచెప్పారు. అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థలన్నీ ఆ షరతులు పాటించాల్సిందేనన్నారు. అందుకు ఒప్పుకున్నందువల్లే ఒకట్రెండు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సమ్మతించిందన్నారు. దీంతో బెంబేలెత్తిన ఐయూఐహెచ్‌ ప్రతినిధులు అమరావతిలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు. తమ సంస్థను మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చంద్రబాబు హయాంలో పలు సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా పలాయనం చిత్తగించాయి. 

చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది
– అజయ్‌ రంజన్‌ గుప్తా, ఎండీ, సీఈఓ, ఐయూఐహెచ్‌ 
‘రాజధాని అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పడానికి వచ్చిన తమను చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా వేధించిందని ఇండో యూకే హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈఓ డాక్టర్‌ అజయ్‌ రంజన్‌ గుప్తా తెలిపారు. చంద్రబాబు  ప్రభుత్వం మాటలు నమ్మి ఒప్పందం చేసుకుని మోసపోయామని ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఎన్నో దేశాలు తమను ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరినా టీడీపీ ప్రభుత్వం ప్రజెంటేషన్లు నమ్మి ఒప్పందం చేసుకున్నామన్నారు. తమ దగ్గర డబ్బులు తీసుకుని మరీ వేధించారన్నారు.  పెట్టుబడిదారులతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రాజెక్టు ఏర్పాటుపై వెనక్కి తగ్గి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చిందని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement