దెబ్బ రైతుకు.. డబ్బు సర్కారుకు
అమలాపురం :రైతు రుణమాఫీ పేరుతో చంద్రబాబు ఆడుతున్న కపట నాటకంలో ఇప్పటికి ఎన్నో అంకాలు నడిచాయి. ప్రస్తుతం ఆయన.. రుణమాఫీ చేస్తున్నందున రైతులకు వచ్చే బీమా సొమ్ములు తీసుకుంటామని ప్రకటించడం ద్వారా ఒకవైపు రుణమాఫీ భారాన్ని తగ్గించుకుంటున్నారు. మరోవైపు రైతులకు మరో వారం, పదిరోజుల్లో అందే పరిహారాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోనున్నారు. రెండు నెలల తరువాత చేస్తామంటున్న రుణమాఫీని అడ్డం పెట్టి.. రైతులకుతక్షణం అందే నాలుగు డబ్బులు కూడా అందకుండా చేస్తున్నారు.
పరక ఇచ్చి..మోపు ఇచ్చినట్టు కపటనాటకం
అధికారం చేపట్టగానే రుణ మాఫీపై సంతకం చేసిన చంద్రబాబు అనంతరం నెల్లాళ్లు గడిచాక రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. ఇంకో నెలకు రుణమాఫీ విధివిధానాలు ప్రకటించారు. ఇలా నెలకో ప్రకటన తప్ప మాఫీకి అధికారిక ఉత్తర్వులకు మీనమేషాలు లెక్కించింది. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నందున బీమా సొమ్మును తాము తీసుకుంటామని స్పష్టం చేసింది. తద్వారా మాఫీ భారాన్ని తగ్గే మేర తగ్గించుకోవాలనుకుంటోంది. గత ఏడాది హెలెన్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా సంస్థల నుంచి సుమారు రూ.160 కోట్ల వరకు పరిహారంగా అందనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆ సొమ్ములు రైతుల ఖాతాకు జమ కావు.
ఇదే సమయంలో రైతుల బీమా పరిహారంలోనే మూడొంతుల రుణమాఫీ చేసే సౌలభ్యం ప్రభుత్వానికి దక్కనుంది. హెలెన్ తుపాను వల్ల డెల్టాలో పంట నష్టపోయిన కొన్ని గ్రామాలకు 70 నుంచి 90 శాతానికి పైగా బీమా పరిహారం అందనుంది. అల్లవరం మండలం సామంతకుర్రు వంటి గ్రామాల రైతులకు 93 శాతం పరిహారం రానుందని సమాచారం. రైతుల పరిహారం జమ చేసుకోవడం ద్వారా మిగిలిన ఏడు శాతం నుంచి 30 శాతం వేసి రుణమాఫీ చేయనుందన్నమాట. ఉదాహరణకు ఒక రైతు రూ.లక్ష వరకు రుణం తీసుకుంటే అతనికి పంట నష్టాన్ని బట్టి బీమా పరిహారంగా రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు వస్తుందన్నమాట. అంటే మిగిలిన రూ.పది వేల నుంచి రూ.30 వేలు ప్రభుత్వం భరించి రూ.లక్ష రుణమాఫీ చేసినట్టు చెప్పుకోనుందన్న మాట.
అప్పు పుట్టక అడకత్తెరలో పోకల్లా..
రుణమాఫీ ఉత్తర్వులు అందకపోవడం, రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంకు అంగీకరించకపోవడంతో రైతులకు ఇప్పటి వరకు కొత్త రుణాలందలేదు. జిల్లాలో ఖరీఫ్ వరి సాగు చేస్తున్న రైతుల్లో చాలా మంది ఇప్పటికే నాట్లు పూర్తి చేసి తొలి దఫా ఎరువులు కూడా జల్లారు. ఈ సమయంలోనే రైతులకు పెట్టుబడులు అవసరం. అటు మాఫీ లేక, ఇటు రీషెడ్యూల్ కాక కొత్త రుణాలందని రైతులు అడ్డకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. కనీసం బీమా పరిహారం అందితే పెట్టుబడులకు ప్రైవేట్ అప్పులు చేయనక్కర లేదని రైతులు భావించారు. అయితే ప్రభుత్వం బీమా పరిహారాన్ని తన ఖాతాకు జమ చేసుకోనుండడంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయాలే గాని, బీమా సొమ్ములకు ఎగనామం పెట్టడం ఏమిటని రైతులు వాపోతున్నారు. ఇలా ‘కక్కుర్తి’ నిర్ణయాలు విడనాడి.. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని అక్షరాలా అమలు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.