
నెల్లూరు /ఓజిలి: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అవినీతిమయంలో కూరుకుపోయి ప్రజలు సమస్యలను గాలికొదిలేశారని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. మండలంలోని బట్లకనుపూరులో రావాలి జగన్.. కావాలి జగన్, కార్యక్రమాన్ని పార్టీ మండల కన్వీనర్ జీ రవీంద్రరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క హామీని అమలు చేయకుండా తెలుగు ప్రజలను నట్టేట ముంచారన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి ప్రజల బాధలను తీర్చుతామన్నారు.
అయితే ఒక్కరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను తీర్చుతామని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో సుజల స్రవంతిని పెట్టారే తప్ప ఒక్కరికి మంచినీటిని ఇవ్వలేదన్నారు. బాబు వస్తే జాబన్నారు.. అయితే ఉన్న జాబులను ఊడబెరుకుతూ పేదల పొట్టగొడుతున్నారని తెలిపారు. ఇలా ఎన్నో హామీలను ఇచ్చి రాష్ట్ర ప్రజలను నయవంచన చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడే చంద్రబాబును ప్రజలు చీదరించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019లో నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
రాష్ట్రం ఇబ్బందులలో ఉంటే విదేశాల పర్యటనలకు రూ.5 వేల కోట్లను వృథాగా ఖర్చు చేశాడని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో గడిపేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే నవరత్నాలతో ప్రజలు మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జే బాబురెడ్డి, కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కార్యవర్గసభ్యుడు పాదర్తి హరనాథ్‌రెడ్డి, నాయకులు ముమ్మారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉచ్చూరు హరనాథ్‌రెడ్డి, జీ రఘురామరాజు, బత్తల రవీంద్రర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.