ఏపీలో పోలవరం విలీనంపై ఎవరేమన్నారు!
ఏపీలో పోలవరం విలీనంపై ఎవరేమన్నారు!
Published Sat, Jul 12 2014 2:30 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
పోలవరం బిల్లు బీజేపీకే శాపం: ఈటెల
కరీంనగర్ : పోలవరం ముంపు మండలాల విలీనంపై తీసుకువచ్చిన బిల్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి శాపంగా పరిణమిస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ‘గిరిజన గ్రామాలను ముంచొద్దు, ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని’ టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న నాటినుంచి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ‘తెలంగాణ ప్రాంత నీళ్లను దోచుకోవద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని’ ఎంత మొత్తుకున్నా ఆనాటి సమైక్య ప్రభుత్వం వినలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కళ్లల్లో మట్టికొడుతూ బిల్లును ఆమోదింపచేసిందన్నారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. బిల్లుపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరారు.
శవాలపై నడుస్తూ ప్రాజెక్టు కడతారా?: డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల శవాలపై నడుచుకుంటూ వెళ్లి ప్రాజెక్టు కడతారా? అని తెలంగాణ శాసనమండలిలో ప్రతి పక్ష నేత డి.శ్రీనివాస్ ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై శుక్రవారం ఢిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ బిల్లు తెచ్చినప్పుడు నెలల తరబడి అనేక వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పార్లమెంటులో ఆమోదించారు. ఎవరితోనూ చర్చించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సవరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించుకోవడం అన్యాయం’ అని పేర్కొన్నారు.
న్యాయపోరాటం చేస్తాం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో పోలవరం బిల్లు ఆమోదం పై రాజీలేని న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య కుట్ర ఫలితమే ఈ బిల్లు ఆమోదమని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు మిత్రసేన, రేగ కాంతారావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ఆర్డినెన్సు ఆమోదం అన్యాయం. శనివారం ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతోంది. 14న అఖిలపక్ష నేతలతో హస్తినలో ధర్నా చేపట్టబోతున్నాం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’ అని పేర్కొన్నారు.
అడ్డంకులు తొలిగాయి: మంత్రి యనమల
సాక్షి, హైదరాబాద్: పోలవరం బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ముంపు ప్రాంత గిరిజనులకు పునరావాస, పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు.
మూడేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి దేవినేని
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఆయన శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన గిరిజన, గిరిజనేతరుల్ని ఆదుకునేందుకు.. భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ పనుల కోసం రూ. 3,200 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అధికారంలోకి రావడం కోసం ఆ రోజు అన్నింటికీ ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని, బంద్‌లకు పిలుపునిస్తున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement