ఐటీ కంపెనీల భవిష్యత్‌ పని విధానం! | Coronavirus: Home Safer Than Workplace | Sakshi
Sakshi News home page

ఆఫీసు కన్నా.. ఇల్లే పదిలం

Published Mon, Jul 6 2020 8:46 AM | Last Updated on Mon, Jul 6 2020 12:20 PM

Coronavirus: Home Safer Than Workplace - Sakshi

సాక్షి, అమరావతి: ‘వర్క్‌ ఫ్రం హోం’.. ప్రస్తుతం ఐటీ కంపెనీలు, వాటిల్లోని ఉద్యోగులు పఠిస్తున్న మంత్రం ఇదే. ఏకంగా 70 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించాయి. ఈ విధానమే ఐటీ కంపెనీల భవిష్యత్‌ పని విధానంగా మారుతుందేమోనని నిపుణులు భావిస్తున్నారు. ఆయా సంస్థ లు కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ విధానాన్నే కొనసాగించేందుకు మొగ్గుచూపుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘వర్క్‌ ఫ్రం హోం’ విధా నంపై ప్రముఖ కన్సల్టెన్సీ ‘వేక్‌ఫిట్‌.కామ్‌’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలోని అంశాలు ఇవీ..

ఆఫీసుకు వెళ్లాలంటేనే భయం: 79 శాతం మంది
కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆఫీసుకు వెళ్లేందుకు 79 శాతం మంది ఐటీ ఉద్యోగులు భయపడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినప్పటికీ ఆఫీసుకు వెళ్లడానికి సుముఖత చూపడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీ ఉన్నతాధికారుల ఆదేశాలవల్ల కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. 

నెలనెలా ఆదేశాలు: 57 శాతం కంపెనీలు
ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేయాలని ఐటీ కంపెనీలు నెలవారీగా ఆదేశాలు ఇస్తున్నాయి. 57 శాతం కంపెనీలు ప్రతినెలా పరిస్థితిని సమీక్షించి ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానానికి అనుమతిస్తున్నాయి. అంతేగానీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ‘వర్క్‌ ఫ్రం హోం’ అని ఒకేసారి అనుమతించడంలేదు.

ఇంటి నుంచే పని: 70 శాతం మంది
ఐటీ కంపెనీలు 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తిగా ‘వర్క్‌ ఫ్రం హోం’ సదుపాయం కల్పించాయి. కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గేవరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పేశాయి. ఐటీ సర్వీస్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం విడతల వారీగా ఆఫీసుకు రమ్మని చెబుతున్నాయి.

‘వర్క్‌ ఫ్రం హోం’పై సంతృప్తి: 59 శాతం మంది
తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేస్తున్నామని 59 శాతం మంది ఐటీ ఉద్యోగులు చెప్పారు. ఈ విధానం తమకు సంతృప్తినివ్వడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ ముప్పు తొలగిపోతే ఆఫీసుకు వెళ్లి పనిచేసేందుకే తాము మొగ్గుచూపుతామని వారు చెప్పారు. అలా చెబుతున్న వారిలో 50 శాతం మంది 45 ఏళ్లు దాటిన వారే ఉండటం గమనార్హం.

భద్రతా ప్రమాణాలపై సందేహం: 60 శాతం మంది
కరోనా వైరస్‌ కట్టడికి ఐటీ కంపెనీలు తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ఉద్యోగులు విశ్వాసం వ్యక్తంచేయడం లేదు. 60 శాతం మంది తమ కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించడంలేదని.. ముందస్తు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

ముందుంది మరింత పనిభారం: 72 శాతం మంది
మున్ముందు తమపై పనిభారం అమాంతంగా పెరుగుతుందని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు. కరోనా ముప్పు తొలగిన అనంతరం పనిఒత్తిడి పెరుగుతుందని 72 శాతం మంది చెప్పారు.

ఇంట్లో కుదురుగా పనిచేయలేం: 37 శాతం మంది
ఆఫీసులో అంటే ఓ చోట కూర్చుని పనిచేయగలంగానీ ఇంట్లో అలా కుదరడంలేదని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంట్లో అయితే రోజులో మూడు నాలుగు చోట్లకు మారుతూ పనిచేస్తున్నామని 37 శాతం మంది చెప్పారు.
 
76 శాతం మందికి ఆరోగ్య సమస్యలు
ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇంట్లో ఇష్టానుసారంగా కూర్చుంటూ గంటల తరబడి పనిచేస్తుండటంతో వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని 76 శాతం మంది చెప్పడం గమనార్హం.

ఉద్యోగ భద్రత కావాలి: 68 శాతం మంది
ప్రస్తుత కరోనా వైరస్‌ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని 68 శాతం మంది చెప్పారు. దాంతోనే తమపై మానసిక ఒత్తిడి తగ్గి  బాగా పనిచేయగలమంటున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తితో ఐటీ కంపెనీలు దాదాపుగా వర్క్‌ ఫ్రం హోం విధానాన్నే కొనసాగిస్తున్నాయి. వైరస్‌ ముప్పు తొలగిపోయే వరకు ఇది తప్పదు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం
చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎన్నో కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా నేర్చుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి.  
– ప్రొ. పీవీజీడి ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement