గుత్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని కోట వీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(20) బుధవారం తన ఇంటి పక్కనున్న పాడుబడిన బావిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట వీధిలో నివసిస్తున్న మాజీ సైనికోద్యోగి దస్తగిరి, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. మిగతా ఇద్దరిలో స్వాతి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజ్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. మరో కూతురు కూడా స్థానిక శ్రీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి స్వాతి కనిపించడం లేదు.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వాతి అక్క నీరజ తమ ఇంటి పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి కసువు వేసేందుకు వెళ్లింది. అందులో కసువు వేస్తూ తొంగి చూడగా స్వాతి శవం తేలి ఉండడాన్ని చూసింది. ఆమె కేకలు విన్న బావి పక్కనే ఉన్న ఇళ్లలోని వారు, మృతురాలి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. స్వాతి మృతదేహం చూసి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనిస్నేహితులు, సన్నిహితులు అంటున్నారు.
కాగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ డీఎస్పీ చెప్పారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
Published Thu, Jan 9 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement