డ్వాక్రా..బాబు టోకరా | dwakra womens have concern on debt waiver | Sakshi
Sakshi News home page

డ్వాక్రా..బాబు టోకరా

Published Wed, Jul 23 2014 3:02 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

డ్వాక్రా..బాబు టోకరా - Sakshi

డ్వాక్రా..బాబు టోకరా

ఒక్క పోతుమర్రు గ్రామంలోనే కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. చంద్రబాబు మాటలు నమ్మిన ప్రతి ఆడపడుచూ గడపదాటి రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది.

కలిదిండి మండలం పోతుమర్రు గ్రామంలో 27 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు సభ్యులు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో 27 గ్రూపుల వారు అప్పటి నుంచి వడ్డీలు చెల్లించడం మానేశారు. సీఎం అయ్యాక చంద్రబాబు మాటమార్చారు. ఒక్కో గ్రూపునకు రూ.లక్ష మాత్రమే రద్దు చేస్తామని ప్రకటించడంతో మహిళలు దిక్కుతోచక అల్లాడుతున్నారు.
 
విజయవాడ : ... ఒక్క పోతుమర్రు గ్రామంలోనే కాదు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. చంద్రబాబు మాటలు నమ్మిన ప్రతి ఆడపడుచూ గడపదాటి రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీని కేవలం కంటితుడుపు చర్యగానే అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తమను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
 
ఒక్కో సభ్యురాలికి రూ.10వేలలోపే మాఫీ..!
జిల్లాలో సుమారు 54వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 30వేల గ్రూపులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఒక్కో గూపులో 10 నుంచి 15 మంది వరకు సభ్యులున్నారు. మొత్తం 6.24లక్షల మంది మహిళలు డ్వాక్రా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల చొప్పున రద్దు చేస్తే 30వేల గ్రూపుల్లోని మూడు లక్షల మంది మహిళలకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ అవుతుంది. పది మంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికీ రూ.10వేలు, అంతకన్నా సభ్యులు ఎక్కువ ఉండే రుణమాఫీ మొత్తం ఇంకా తగ్గే అవకాశం ఉంది.
 
పేరుకుపోయిన బకాయిలు
డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో రూ.938 కోట్ల వరకు డ్వాక్రా సంఘాలు రుణాలు పొందాయి. గత ఫిబ్రవరి నంచి జూలై వరకు ఆరు నెలలుగా వడ్డీలు కూడా చెల్లించడంలేదు. సాధారణంగా డ్వాక్రా రుణాలకు 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆరు నెలల నుంచి వాయిదాలు పెండింగ్‌లో ఉండటంతో వడ్డీపై రెండు శాతం పెనాల్టీ కూడా వసూలు చేస్తారు. అసలు, వడ్డీ, పెనాల్టీ మొత్తం చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు స్పష్టంచేస్తున్నారు.
రుణమాఫీ అయిన మొత్తం బకాయిలకు సరి..
 
ఒక్కో మహిళకు రుణమాఫీగా వచ్చిన రూ. 10వేలను కూడా బ్యాంకర్లు పెండింగులో ఉన్న బకాయి కింద జమచేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాయిదాల డబ్బును మహిళలు ఒకేసారి వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించుకునే తమకు రుణమాఫీ ఆశ చూపి ఇప్పుడు రోడ్డుపాలు చేశారని పలువురు మహిళలు మండిపడుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తాము పెద్దమొత్తంలో బకాయిలను ఒకేసారి ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు.  ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు ఆందోళనబాట పట్టారు.
 
మొత్తం రద్దు చేయాలి

డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు రూ.లక్ష మాత్రమే అంటే ఎలా.. సంఘంలో పది మంది సభ్యులు కలిపి రూ.5 లక్షలుపైనే రుణం తీసుకున్నాం. వీటిని రద్దు చేస్తారని నమ్మి ఐదు నెలలుగా సొమ్ము జమచేయడంలేదు. పాలకులు పునరాలోచించాలి.
- డి.సువర్ణ, డ్వాక్రా మహిళ, ఉయ్యూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement