మీకు ఓటేసినందుకు...చెప్పుతో కొట్టుకోవాలి
- టీడీపీకి ఓటేసినందుకు జన్మభూమి సభలో చెప్పుతో కొట్టుకున్న వృద్ధుడు
- అన్యాయంగా పింఛను తొలగించారని ఆవేదన
- పింఛను రాలేదన్న మనస్తాపంతో కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి
చీరాల/గుడివాడ: ‘మీ కుటుంబానికి పెద్ద కొడుకునవుతా.. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.వెయ్యి చేసి మీ బతుక్కు భరోసా ఇస్తానన్న ఏపీ సీఎం చంద్రబాబు .. భరోసా సంగతి ఏమోగానీ మా నోటి దగ్గర బువ్వ లాగేశారంటూ’ పలువురు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల 33వ వార్డుకు చెందిన యాకోబు(70) కూలి పనులు చేసేవాడు. ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఆయ న శరీరం సహకరించక కొంతకాలంగా పనికి వెళ్లలేక ఇంటివద్దే ఉంటున్నాడు.
అయితే ఇటీవల జరిగిన పింఛన్ల పునఃపరిశీలనలో ఆయనకు పింఛను తీసుకునేందుకు నిర్ధారిత వయసు సరిపోలేదంటూ తొలగించారు. దీంతో మనోవేదనకు గురైన యాకోబు తమ వార్డులో శనివారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో అధికారులను ప్రశ్నించేందుకు వచ్చాడు. మున్సిపల్ కమిషనర్, జన్మభూమి కమిటీ సభ్యుల ఎదుట గోడు వెళ్లబోసుకున్న అనంతరం ఆవేదనతో... ‘చంద్రబాబుకు ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి’ అంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు.
కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి
కృష్ణాజిల్లా గుడివాడలోని బేతవోలుకు చెందిన జొన్నలగడ్డ సూర్యనారాయణ(70)కు ఎనిమిది నెలల క్రితం పింఛను తొల గించారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. జన్మభూమి కార్యక్రమంలోనైనా పింఛను ఇస్తారేమోనని ఆశపడ్డాడు. రెండు రోజుల క్రితం బేతవోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి పింఛను గురించి అధికారులను అడగ్గా.. రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన సూర్యనారాయణ... గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు.