ఆకలితో నకనకలాడే బిడ్డకు అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు.. మండుటెండల్లో కాగివేగిన మన్నును మబ్బులు వర్షధారలతో తడుపుతున్నారుు.
ఆకలితో నకనకలాడే బిడ్డకు అమ్మ గోరుముద్దలు పెట్టినట్టు.. మండుటెండల్లో కాగివేగిన మన్నును మబ్బులు వర్షధారలతో తడుపుతున్నారుు. మొన్నటి వరకూ నెర్రెలు తీసి, చినుకు కోసం తహతహలాడిన చేలు.. ఇప్పుడు మెత్తబడి విత్తనాల కోసం నిరీక్షిస్తున్నారుు. అదనుకు వచ్చిన నైరుతి రుతుపవనాలు, కాలువలకు నీటి విడుదల తొలకరి సాగుకు శుభారంభాన్ని అందించాయి.
మండపేట : జిల్లావ్యాప్తంగా 2.26 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 13 శాతం మేర నారుమడులు వేయడం పూర్తికాగా మిగిలిన మేరకు విత్తనాలు జల్లే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అధికశాతం విస్తీర్ణంలో వెదజల్లు విధానం అనుసరించేలా రైతులను ప్రోత్సహించి, అక్టోబరు నెలాఖరుకు ఖరీఫ్ కారును పూర్తిచేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది.
జిల్లాలోని తూర్పుడెల్టాలో 95,593 హెక్టార్లలో, మధ్య డెల్టాలో 41,880 హెక్టార్లలో, మెట్టలోని ఏలేరు, పీబీసీ, ఇతర ఆయకట్టుల పరిధిలో 96,148 హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీటి విడుదలలో జాప్యం ఖరీఫ్ ఆరంభాన్ని ఆలస్యం చేస్తుండేవి. అందుకు భిన్నంగా ప్రస్తుత సీజన్‌లో నిర్ణీత సమయానికి కాలువలకు నీరు విడుదల కావడం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడం తొలకరి పనులను వేగవంతం చేశాయి. తూర్పు డెల్టా పరిధిలోని మండపేట, రామచంద్రపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇంజన్లపై 1,400 హెక్టార్లలో రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. మెట్టలోని జగ్గంపేట, తుని ప్రాంతాల్లో అక్కడక్కడా నారుమడులు వేయగా, సెంట్రల్ డెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పుడిప్పుడే నారుమడులు వేయడంలో నిమగ్నమవుతున్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 270 హెక్టార్లలో వెదజల్లు విధానంలో సాగుకు శ్రీకారం చుట్టగా, 1.26 లక్షల ఎకరాల్లో తరహా సేద్యం జరిగేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఖరీఫ్ సాగుకు మొత్తం 1.72 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా జూన్ నెలాఖరు వరకు కొరత లేకుండా 45 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది.
వ్యవధీ, వ్యయం తగ్గించే ‘వెదజల్లు’
కొన్నేళ్లుగా ఖరీఫ్, రబీ సాగుల్లో జరుగుతున్న జాప్యం మూడవ పంటగా అపరాల సాగుపై ప్రభావం చూపుతోంది. ఐదేళ్ల క్రితం మూడవ పంటగా 55 వేల హెక్టార్లలో అపరాలు వేస్తే ఈ ఏడాది కేవలం సుమారు 5,400 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. వచ్చే అక్టోబరు నెలాఖరు నాటికి ఖరీఫ్‌ను పూర్తిచేయడం ద్వారా రబీని ముందుకు తీసుకువచ్చి మూడవ పంటకు వీలు కల్పించేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. దీని వలన ఏటా నవంబరులో వస్తున్న వర్షాలతో తొలకరి పంటకు వాటిల్లుతున్న నష్టాన్ని నివారించడంతో పాటు రబీలో నీటి ఎద్దడి సమస్య తగ్గుతుందని భావిస్తోంది. జూన్ నెలాఖరుకు నారుమడులు పూర్తిచేసేలా, అప్పటిలోగా నారుమడులు వేసుకోలేని రైతులు వెదజల్లు విధానాన్ని అవలంబించేలా రైతులకు అవగాహన కల్పిస్తోంది.
నారుమడులతో పోలిస్తే వెదజల్లు ద్వారా పది రోజుల పంటకాలం తగ్గడంతో పాటు కూలీల కొరత, పెట్టుబడులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు అంటున్నారు. గత ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 25 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వంతులవారీ విధానం అమలు చేయడం ద్వారా దిగుబడి పెంచవచ్చన్న ఆలోచనలో వ్యవసాయశాఖ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రెండు నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల మాటెలా ఉన్నా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ సాగుకు శుభారంభమే.