
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
జిన్నారం, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత తమ పార్టీదేనని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో రూ. 30లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగిందన్నారు. గ్రామాల్లో దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
లక్ష్మిపతిగూడెంలో రూ. 6.50లక్షలతో అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించేందుకు నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ వావిలాలలో అభివృద్ది పనులు చేపట్టడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మెదటి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటవుతుందన్నారు. మండలంలో రూ. 10కోట్లతో చేపట్టనున్న మంజీరా నీటి పథకం పనులను పూర్తచేసి, వేసవికాలం వరకు ప్రతి ఇంటికి మంజీరా నీటిని అందిస్తామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. అనంతరం సర్పంచ్ రవీందర్, ఉపసర్పంచ్ నవనీత్‌రెడ్డిలు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.