నిన్న ఉద్యమం.. నేడు ఉద్వేగం..
మొన్నటిదాకా అక్కడ.. పోటాపోటీ నినాదాలు.. తోపులాటలు.. ఘర్షణ వాతావరణం..! కానీ నేడు.. ఆప్యాయ ఆలింగనాలు.. ఆత్మీయ పలకరింపులు.. పాతికేళ్ల అనుబంధ స్మృతులు!! నాటి ఉద్రిక్త, నేటి ఉద్వేగ క్షణాలకు వేదికైంది హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయం. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో ప్రాంతాలుగా విడిపోయి పోరుబాట పట్టిన ఉద్యోగులంతా శుక్రవారం అన్నదమ్ముల్లా కలసిపోయారు. మొన్నటి మాటల తూటాలను మరిచిపోయి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో చివరిసారిగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు. రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయి... మన బంధాలు ఎన్నటికీ విడిపోవు అంటూ పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా ఉద్వేగానికి గురయ్యారు.