గాలేరు మార్గం మారుతోంది
సాక్షి ప్రతినిధి, తిరుపతి : గాలేరు- నగరి కాలువ మార్గం మారనుంది. కొత్త అలైన్‌మెంట్ ద్వారా కాలువను తెచ్చి కళ్యాణి నదిలో కలిపేలా డిజైన్ రూపొందిస్తున్నారు. తిరుపతి నగర నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదిలోపే కాంట్రాక్టర్ పనులు పూర్తిచేస్తే 5 శాతం ఇన్సెంటివ్‌కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
రూ.150 కోట్లతో రెడ్డెమ్మకొండ వద్ద రిజర్వాయర్!
గుర్రంకొండ మండలం చెర్లోపల్లె సమీపంలోని రెడ్డెమ్మ కొండ వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. వారం రోజుల్లోపు అంచనాలు రూపొందించాలని నీటిపారదుల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
కండలేరు నుంచి తిరుపతికి నీళ్లు
కండలేరు నుంచి తిరుపతి నగర వాసుల దాహార్తి తీర్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే 24 కోట్ల రూపాయలతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తిరుపతి నగరంలో ఉన్న తీవ్ర నీటి ఎద్దడి దృష్ట్యా ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నాటికే తిరుపతికి నీళ్లివ్వాలని ప్రతిపాదించింది. అయితే టెండర్లలో జరిగిన జావ్యం వల్ల ఈ నెల 25వ తేదీన నగరానికి నీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కండలేరు నుంచి 1.5 టీఎంసీల నీటిని 110 రోజుల పాటు రోజుకు 300 క్యూసెక్కుల వంతున లిఫ్ట్ చేయనున్నారు. తిరుపతి నగరానికి నీరు చేరేసరికి నీటి ప్రవాహం 100-120 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలైన్‌మెంట్ మార్చుతున్నాం
గాలేరు-నగరికాలువ అలైన్‌మెంట్‌ను మార్చుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విజయవాడలో నీటిపారుదల శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఈమేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాలువ మార్గంలో విలువైన భూములు ఉన్నందున రైతుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన ఆదేశాల మేరకు కాలువ మార్గాన్ని మార్చేందుకు సర్వే చేస్తున్నాం. తిరుపతి నగరానికి వీలైనంత త్వరగా నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం.
- సుధాకర్, తెలుగుగంగ ఛీప్ ఇంజినీరు