జీజీహెచ్ అభివృద్ధికి రూ. 20 కోట్లు విడుదల | GH Development Rs. 20 crore released | Sakshi
Sakshi News home page

జీజీహెచ్ అభివృద్ధికి రూ. 20 కోట్లు విడుదల

Published Thu, Jul 31 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

GH Development Rs. 20 crore released

కాకినాడ క్రైం :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య విభాగం (ఎంసీహెచ్ బ్లాకు) ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీజీహెచ్‌లో భవన నిర్మాణం, వైద్య పరికరాల నిమిత్తం రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జీజీహెచ్ మార్చురీ విభాగం సమీపంలోని తోటీ క్వార్టర్స్, నర్సింగ్ స్కూల్ మెస్‌లను తొలగించి సుమారు ఎకరం స్థలంలో భవనాన్ని నిర్మించనున్నారు. ఎంసీహెచ్ బ్లాకు ఏర్పాటు నేపథ్యంలో జీజీహెచ్‌కు నూతనంగా ఐదు యూనిట్లు మంజూరయ్యాయి. ఎంసీహెచ్ బ్లాకు ఏర్పాటుతో గైనిక్ విభాగ వైద్యులు, గర్భిణులకు ఉపశమనం లభించనుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 మూడు యూనిట్లతో సతమతం
 ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందల మంది గర్భిణులు రోజూ కాకినాడ జీజీహెచ్‌కు వస్తుంటారు. జీజీహెచ్ గైనిక్ విభాగంలో ఇప్పటి వరకూ మూడు యూనిట్లు మాత్రమే ఉండడంతో అటు వైద్యులతో పాటు ఇటు గర్భిణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గైనిక్ విభాగానికి రోజూ 400 మంది గర్భిణులు వస్తుంటారు. విభాగంలో మూడు యూనిట్లకు 90 బెడ్‌లు మాత్రమే ఉన్నాయి. వైద్యులపై కూడా ఒత్తిడి అధికమవుతోంది.
 
 రోజూ జీజీహెచ్ గైనిక్ విభాగంలో 40 మందికి పైగా శిశువులు జన్మిస్తుంటారు. గైనిక్ విభాగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఎంసీహెచ్ బ్లాకును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీహెచ్‌తో మూడు గైనిక్ యూనిట్లు నూతనంగా మంజూరయ్యాయి. ఒక పీడియాట్రిక్, ఒక అనస్థీషియా యూనిట్లు కూడా నూతనంగా రానున్నాయి. ఒక్కో యూనిట్‌కు ఒక చీఫ్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానుండడంతో వైద్యుల కొరత తీరనుంది. ఎంసీహెచ్ బ్లాకు నిర్మాణానికి బొంబేడైయింగ్ కనస్ట్రక్షన్స్ సంస్థ భవన నిర్మాణానికి ప్లాన్ రూపొందించింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement