రాష్ర్టంలో గత 27 రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయకపోవటం గర్హనీయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో గత 27 రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయకపోవటం గర్హనీయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలను పెంచి రాజకీయ ప్రయోజనం పొందాలని కొన్ని పార్టీలు చూడటం బాధాకరమని సోమవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వికృత క్రీడలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని, ఆ పార్టీల వ్యవహారాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ అధ్వానంగా మారుతున్నా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చోద్యం చూస్తున్నారని, శాంతియుత సహజీవనానికి దోహదపడే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు.