మండుతున్న సూరీడు
సోమవారం 38.3
ఎండ నుంచి ఉపశమనం పొందడం ఇలా..
వీలైనప్పుడల్లా నీళ్లు తాగుతుండాలి.
తెల్లని కాటన్ దుస్తులు వేసుకోవాలి.
ఎండలో ద్విచక్ర వాహనంపై వెళ్లాల్సి వస్తే కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. తలకు టోపీ ధరించాలి.
నడిచి వెళ్లే వారు గొడుగులు వాడాలి. రోడ్లల్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే చెట్లకింద, లేదా నీడ ఉండే ప్రదేశాల్లో నిలబడాలి.
తిరుపతి తుడా: సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. జనం అడుగు బయటపెట్టేందుకు భయపడిపోతున్నారు. ఉక్కపోత ఉక్కిబిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలనే సాహసం చేయడం లేదు. వడగాల్పుల దాటికి భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి నీరసించిపోతున్నారు. కొందరు అవగాహన లేకుండా ఎండల్లో తిరుగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జనం దూర ప్రయాణాలు చేసేందుకు సాహసించడం లేదు. ఇప్పటికే జిల్లాలో పది మందికి పైగా వడదెబ్బకు మృతి చెందారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బ తగిలితే..
శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, శరీరం ఉష్ణాన్ని కోల్పోవడంతో వడదెబ్బ తగులుతుంది. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. తలనొప్పి, తలతిరగడం, చర్మం ఎండిపోవడం, విపరీతంగా జ్వరం రావడం, మగత, కలవరింతలు, పిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. తక్షణం వైద్యం చేయించాలి.
ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది
ఎండా కాలం ఎన్ని నీళ్లుతాగితే అంత మంచిది. ఎండ తీవ్రతకు శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. చెమట రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణిలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్ల రసాలు తీసుకోవాలి. కర్బజా, దోస వంటి పండ్లను తినాలి. పిల్లల్ని ఎండల్లో తిరగకుండా చూసుకోవాలి. ఐస్‌క్రీంలు, శీతలపానీయాలు తీసుకోకూడదు. ఇంట్లో దొరికే మజ్జిగ, నిమ్మ రసం తరచూ తీసుకుంటే మంచిది. మాంసాహారాన్ని వీలైనంత వరకు దూరం చేయాలి.
-డాక్టర్ కృష్ణప్రశాంతి, జనరల్ ఫిజీషియన్, తిరుపతి.