పోటాపోటీ ప్రదర్శనలు, నినాదాలు, బైఠాయింపులు
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: రాజధాని హైదరాబాద్‌లో ఉద్యోగుల మధ్య వైషమ్యాలు రోజు రోజుకూ మరింత ముదురుతున్నాయి. రోజూలాగే బుధవారం కూడా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీ నిరసన కార్యక్రమాలు, నినాదాలతో ఆఫీసులను హోరెత్తించారు. వీధుల్లోకొచ్చి ర్యాలీలు తీశారు. సచివాలయంలో రోజూ ఇలాగే పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నా బుధవారం మాత్రం మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ ఉద్యోగులు పరస్పర వ్యతిరేక నినాదాలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. మరోవైపు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగులు కొట్టుకునే దాకా పరిస్థితి దిగజారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో నిన్నమొన్నటి వరకు మంచి స్నేహితులుగా కలిసి మెలిసి ఉన్న ఎందరో ఉద్యోగులు.. ఇప్పుడిలా విభజనకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. స్నేహబంధాల్ని మర్చిపోయి.. పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు.
ఒకరిమీద మరొకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. విభజన ముద్దని ఒకరంటే.. వద్దేవద్దని మరొకరు అంటున్నారు. ఒకరినొకరు కొరకొర చూసుకుంటూ.. పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా తరలివస్తున్న రాజకీయ నేతలు, వారి ప్రసంగాలు పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఆరని చిచ్చు పెడుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు తమకు బాధ కలిగిస్తున్నాయంటున్న ఉద్యోగులు.. అలాగని ప్రాంతీయ అభిమానం వీడలేమంటూ లోలోన మథనపడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బీమాభవన్‌లో మొదలు: విభజన నిర్ణయం వెలువడిన రోజు నుంచి హైదారబాద్‌లోని పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. ఆందోళనలు మొదలైన తర్వాత బీమా భవన్‌లో సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇలా పో టీ ప్రదర్శనలకు బీమా భవన్‌లోనే బీజం పడింది. తర్వాత.. విద్యుత్‌సౌధ, జలసౌధ, దేవాదాయ కమిషనర్ కార్యాలయం, గృహకల్ప, బీఆర్కే భవన్... ఇలా పలు శాఖాధిపతుల కార్యాలయాల్లో పోటాపోటీ నిరసనలు, నినాదాలు సాధారణమయ్యాయి. సచివాలయంతోపాటు కొన్ని కార్యాలయాల్లో పరస్పర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వి ద్యుత్ సౌధలో ఉద్యోగుల మధ్య దాదాపు గత పక్షం రోజులుగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యోగి మీద సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారంటూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆరోపించింది. రోజూ విద్యుత్‌సౌధలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దద్దరిల్లిన సచివాలయం: సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ప్రదర్శనలు, నినాదాలతో బుధవారం సచివాలయం దద్దరిల్లింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ప్రదర్శనలు జరిపారు. సమైక్య, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు సచివాలయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సమైక్యంగా ఉంటే రాష్ట్రం పచ్చని చెట్టులా ఉంటుందని, విడిపోతే నిలువునా ఎండిపోతుందంటూ సీమాంధ్ర ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు ‘మీరు తెలంగాణ నిర్ణయాన్ని రోల్‌బ్యాక్ అంటే.. మేము మిమ్మల్ని గో బ్యాక్ అంటాం’ అని నినాదాలు చేశారు.
ఎంఎన్‌జేలో బాహాబాహీ: బుధవారం మధ్యాహ్నం ఉస్మానియా ఆసుపత్రి స్టాఫ్ నర్సులిద్దరు, టీఎన్జీఓ సంఘ నాయకులు మీడియా ప్రతినిధులను వెంటపెట్టుకుని రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్‌తో 610 జీఓపై చర్చించేందుకు వచ్చారు. ఆసుపత్రి సిబ్బంది విజ్‌డమ్ చౌదరి తదితరులు వీరికి స్వాగతం పలికారు. అప్పటి వరకు కలిసున్న ఉద్యోగులు రెండుగా చీలిపోయి ఘర్షణ పడ్డారు. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. కాగా, విజ్‌డమ్ చౌదరి.. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన సరళ, హేమలతలు విధి నిర్వహణలో ఉన్న తనను కొట్టారంటూ నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది తెలిసి ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది, ఇతర ఉద్యోగులు.. విజ్‌డమ్ చౌదరి తమను కులం పేరుతో దూషించారంటూ అదే ఠాణాలో ఫిర్యాదు చేశారు.
బీమాభవన్‌లో ఉద్రిక్తత: సమైక్యాంధ్ర ఉద్యోగుల ఆందోళనలు.. బుధవారం అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో ఉద్రిక్తతకు దారి తీశాయి. టీఎన్జీవో ఉద్యోగులు సైతం పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. ఇరుపక్షాల నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది. అబిడ్స్ పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అదే సమయంలో కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోనూ ఉద్యోగుల మధ్య విద్వేష పూరిత వాతావరణం చోటుచేసుకుంది. నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు.
దేవదాయ శాఖలో: బొగ్గులకుంటలోని దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీఎన్జీవో ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెను నిర్వహించారు. వీరికి పోటీగా భోజన విరామ సమయంలో టీఎన్జీవోస్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ధర్నా నిర్వహించారు. గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో జైసమైక్యాంధ్రప్రదేశ్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు.
వేడెక్కిన విద్యుత్‌సౌధ: విద్యుత్‌సౌధ ప్రాంగణం మరోసారి రణరంగమైంది. తెలంగాణ ఉద్యోగి సంతోష్‌పై జరిగిన దాడిపై విచారించేందుకు వచ్చిన తెలంగాణ లాయర్ల నిజ నిర్ధారణ కమిటీని గేటు బయటే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ లాయర్ల జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అరెస్ట్‌చేశారు. సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు.
ఆర్‌అండ్‌బీలోనూ: ఉద్యోగులు ప్రాంతాలవారీగా విడిపోయి ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఆందోళనలు నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఒక చోట చేరడంతో టీఎన్జీవోలు బయటకొచ్చి పోటాపోటీ నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వోద్యోగుల మధ్య పెరుగుతున్న విద్వేషాలు
Published Thu, Aug 29 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement