
ప్రెస్‌మీట్ పెట్టినంత సులువు కాదు
సీఎం కొత్త పార్టీపై మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టడమంటే ప్రెస్‌మీట్ పెట్టినంత సులభం కాదని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతంటూ సీఎం తరచూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆయన ఏ విధంగా భావిస్తున్నారో కానీ అది అంత సులభం కాదనేది తన అభిప్రాయమన్నారు. సీఎం కిరణ్, తాను నియోజకవర్గానికంటే ఎక్కువ స్థాయి నేతలమని చెప్పారు. అలాంటి స్థాయి నుంచి తాను మంత్రి, కిరణ్ ముఖ్యమంత్రి కాగలిగామంటే అందుకు సోనియానే కారణమని చెప్పారు. ఆమె ఇచ్చిన అవకాశాల వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామన్నారు. సీఎం రెండు చేతులతో ఎడాపెడా సంతకాలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలేవీ ముందుకు సాగడం లేదని చెప్పారు. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని డొక్కా పేర్కొన్నారు. ఏడు కోట్ల సీమాంధ్రుల ఆకాంక్షలను ఎంపీలు వ్యక్తపరుస్తుంటే పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు.