రాష్ట్ర విభజన మాటెలా ఉన్నా, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీలో ఏకాభిప్రాయం కొరవడింది.
ఉద్యోగుల పంపిణీపై ఏకాభిప్రాయానికి రాని సభ్యులు
ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి తొలుత పంపేయాలన్న మెజారిటీ సభ్యులు
ముందే ఆప్షన్లు ఇవ్వాలన్న మరో సభ్యుడు
ఏ అభిప్రాయం చెప్పని కమలనాథన్, అర్చన వర్మ
హైదరాబాద్: రాష్ట్ర విభజన మాటెలా ఉన్నా, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీలో ఏకాభిప్రాయం కొరవడింది. కమిటీ శుక్రవారం సమావేశమై ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై విస్త్రృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు పి.వి.రమేశ్, నాగిరెడ్డి, జయేశ్ రంజన్, కేంద్ర అధికారి అర్చన వర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి ప్రొవిజనల్ జాబితా ప్రకారం కేటాయిద్దామని, జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఆప్షన్ల విధానాన్ని అమలు చేద్దామని కమిటీలోని మెజారిటీ సభ్యులు చెప్పారు.
మరో సభ్యుడు మాత్రం ఇప్పుడే ఆప్షన్లు ఇవ్వాలని అన్నారు. కొత్త ప్రభుత్వాలు, కొత్త ముఖ్యమంత్రులు వచ్చాక పూర్తి రాజకీయం అవుతుందని, అప్పుడు ఆప్షన్లు అంటే సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కమిటీ చైర్మన్ కమలనాథన్ మాత్రం ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయలేదు. కమిటీలోని మరో సభ్యురాలు, కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మకు రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ, మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కమలనాథన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 (1), 76 (2)లో తొలుత జూన్ 2కన్నా ముందుగానే తెలంగాణ ఉద్యోగులను కేటాయించాలని ఉంది. దీనిప్రకారం స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతం వారిని తెలంగాణకు, సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.