చలికి కప్పుకునేందుకు ఇంటి వద్ద నుంచి దుప్పట్లు తెచ్చుకున్నామని చూపిస్తున్న బూసాయవలస కేజీబీవీ బాలికలుతలుపులు లేని బాత్‌రూమ్‌లు
విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మద్యలో బడిమానేసిన డ్రాపౌట్లు, నిరుపేద విద్యార్థినులకు కస్తూర్భా విద్యాలయాల్లో నాణ్యమైన విద్యతో పాటు సరైన వసతి ఉంటుందని భావించిన తల్లిదండ్రుల అంచనాలు తప్పాయి. అన్ని పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సంక్షేమం కోసం సర్వశిక్షా అభియాన్ రూ.కోట్లు ఖర్చు చేసి పక్కా భవనాలు నిర్మించినప్పటికీ సరైన వసతులు లేవు. ఫలితంగా బాలికలు సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంటూ నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలో బడిమానేసి డ్రాపౌట్లుగా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో పేదవారైన ఆడపిల్లల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కస్తూర్బా విద్యాలయాలను నెలకొల్పారు. పేద పిల్లల సంక్షేమం గురించి ఆలోచించి మంచి మౌలిక వసతులు కల్పించారు. అయితే నేటి పాలకులు ఆ విద్యాలయాల్లో చదువుతున్న బాలికల సంక్షేమాన్ని విస్మరిస్తూ కనీస సౌకర్యాల గురించి పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫలితాల్లో మేటిగా నిలుస్తున్నా...
జిల్లాలో 33 కస్తూర్బా విద్యాలయాలు ఉండగా వాటిలో ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 6,276 మంది బాలికలు చదువుతున్నారు. రామభద్రపురం మండలం బూసాయవలసలో గల పాఠశాలలో 200 మంది బాలికలు చదువుతున్నారు. జిల్లాలోని పిల్లలంతా చక్కనైన ఫలితాలు సాధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లోనూ మేటిగా నిలుస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొని పాఠశాలలకు గుర్తింపు తీసుకువస్తున్నారు. కానీ వీరికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
చలికి గజగజ...
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశంతో ఊరిబయటే పాఠశాల భవనాలు నిర్మించారు. 15 రోజులుగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండడం, నేలపై పడుకోవడంతో బాలికలు మరింతగా వణికిపోతున్నారు. ప్రభుత్వం దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేయకపోవడంతో విద్యార్ధినులు తమ ఇళ్ల నుంచి వాటిని తెచ్చుకొని వాడుకోవాల్సి వస్తోంది. ఇక బాత్ రూమ్‌లకు స్నానాలకు వెళితే జిల్లుమనే చల్లటి నీరు బాలికలను వణికిస్తోంది. సాధారణంగా సంక్షేమ పాఠశాలల్లో గ్రీజర్లు ఏర్పాటు చేయాలి. కాని కస్తూర్బా పాఠశాలల్లో వాటిని ఏర్పాటుచేయలేదు. గతేడాది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశారు. అవి పాతబడినా ఈ ఏడాది కొంతవరకూ వాడుకోగలుగుతున్నారు. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశాలు పొందిన బాలికలకు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. వారంతా చలికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం తమ పిల్లలను కస్తూర్బా పాఠశాలల్లో చేర్పిస్తే ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో తామే కొత్త దుçప్పట్లు కొని ఇస్తున్నామని చెబుతున్నారు.
ఒక్క బాత్‌రూమ్‌కూ తలుపులేదు
బూసాయవలస కస్తూర్బా పాఠశాలలో సరిపడా తరగతిగదులు లేక డార్మెటరీలనే తరగతి గదులుగా వాడుకుంటూ కిందనే కూర్చొని పరీక్షలు రాస్తున్నారు. ఇక్కడ బాత్ రూమ్‌లకు ఒక్క దానికి కూడా తలుపులు లేక స్నానానికి వెళ్లడానికి సిగ్గుగా ఉందని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. చదువుకోవడానికి సరిపడా తరగతి గదులు లేవని, పరీక్షల సమయంలో డార్మిటరీలలో నేల కూర్చొని పరీక్షలు రాయాల్సి వస్తోందని, గంటల కొద్దీ నేలపైనే కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థినులు నిద్రపోవడానికి మంచాలు లేవు సరికదా కనీసం పరుచుకోవడానికి కార్పెట్‌లైన సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కటిక నేలపై నిద్రపోతున్నారు..
ఇంటి నుంచి తెచ్చినవే వాడుకుంటున్నాం
రాత్రి అయిందంటే చలికి వణికి పోతున్నాం. దుప్పట్లు, కార్పెట్లు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకుని వాడుకుం టున్నాం. నేలపై పడుకుంటే చలి బాగా ఉంటోం ది. అలాగే ఈ కాలంలో రోజూ చల్లటి నీరు స్నానం చేయడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం దుప్పట్లు, కార్పెట్లు పంపిణీతో పాటు ఈ సీజన్‌లోనైనా వేడినీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటే మంచిది. – రెడ్డి స్వప్న,
6వ తరగతి, కస్తూర్బా పాఠశాల, బూసాయవలస
చాలా ఇబ్బందులు పడుతున్నాం
మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుమారు ఏడాది కాలంగా బాత్‌రూమ్‌లకు తలుపులు లేకపోవడంతో అందులోకి వెళ్లాలంటేనే సిగ్గేస్తోంది. రోజూ నేలపై పడుకోవడం డార్మెటరీ లేక భోజనాలు చేస్తున్న గదిలోనే పడుకోవలసి వస్తోంది. అది కాస్త అసౌకర్యంగా ఉంటోంది. – మీసాల జ్యోత్స్న,విద్యార్థిని, కేజీబీవీ, బూసాయవలస
కొత్తగా చేరిన వారికి ఇంకా రాలేదు
గతేడాది విద్యార్థినులకు దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేశా. రెండేళ్లకోసారి పంపిణీ చేస్తాం. ఈ ఏడాది కొత్తగా చేరిన 6వ తరగతి బాలికలకు ఇంకా దుప్పట్లు, కార్పెట్లు పంపిణీ చేయలేదు. ఎస్డీపీ ఆప్కో సంస్థకు అప్పగించారు. త్వరలో వస్తాయి పంపిణీ చేస్తాం. అలాగే సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం కోరుతున్నాం.– డాక్టర్ బి.శ్రీనివాసరావు,ఎస్‌ఎస్‌ఏ పీవో, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment